Pandem Kodi Curry: పందెంకోడి కూర ఇలా వండారంటే ఒక్క ముక్క కూడా మిగల్చరు, అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ-pandem kodi curry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pandem Kodi Curry: పందెంకోడి కూర ఇలా వండారంటే ఒక్క ముక్క కూడా మిగల్చరు, అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ

Pandem Kodi Curry: పందెంకోడి కూర ఇలా వండారంటే ఒక్క ముక్క కూడా మిగల్చరు, అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ

Haritha Chappa HT Telugu
Sep 16, 2024 05:30 PM IST

Pandem Kodi Curry: పందెం కోళ్లను ఎంతోమంది పెంచుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాటిని కోసుకొని తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. పందెంకోడి కూర ఎలా వండాలో తెలుసుకోండి. మేం చెప్పిన పద్ధతిలో వండితే రుచి అదిరిపోతుంది. రెసిపీ ఇక్కడే ఉంది.

పందెం కోడి కూర రెసిపీ
పందెం కోడి కూర రెసిపీ (Youtube)

Pandem Kodi Curry: పందెంకోడి అంటే సంక్రాంతి సమయాల్లో పోరాటానికి తయారుచేసే నాటుకోడి. దీనికి ప్రత్యేకంగా ఖరీదైన ఆహారాలను పెట్టి పెంచుతారు. అందుకే దీని మాంసంలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. సాధారణ కోళ్లతో పోలిస్తే పందెంకోడి చాలా టేస్టీగా వండుకోవచ్చు. దీని రుచి కూడా అదిరిపోతుంది. కాస్త స్పైసీగా చేస్తే పందెంకోడి కూర రుచే వేరు. దీన్ని ఎలా వండాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము.

పందెంకోడి కూర రెసిపీకి కావలసిన పదార్థాలు

పందెంకోడి కూర - కిలో

జీలకర్ర - అర స్పూను

బిర్యానీ ఆకులు - మూడు

షాజీరా - అర స్పూను

ఉల్లిపాయలు - మూడు

పసుపు - అర స్పూను

కారం - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు ముక్కలు

నూనె - తగినంత

గసగసాలు - ఒక స్పూను

జీడిపప్పు - నాలుగు

ధనియాలు - రెండు స్పూన్లు

దాల్చిన చెక్క - పెద్ద ముక్క

లవంగాలు - ఆరు

యాలకులు - మూడు

వెల్లుల్లి రెబ్బలు - పది

ఉప్పు - రుచికి సరిపడా

పందెంకోడి కూర రెసిపీ

1. పందెంకోడి కూర వండడానికి ముందుగా మసాలా ముద్దను సిద్ధం చేసుకోవాలి.

2. ఇందుకోసం మిక్సీ జార్లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, అల్లం, గసగసాలు, జీడిపప్పులు, కొత్తిమీర, జీలకర్ర వేసి కాస్త నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.

4. తర్వాత షాజీరా, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి.

5. ఉల్లిపాయలు కాస్త రంగు మారేవరకు వేయించుకోవాలి.

6. ఇప్పుడు పచ్చిమిర్చిని వేసి వేయించాలి.

7. పందెంకోడి ముక్కలను కూడా వేసి మూత పెట్టి పది నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

8. తర్వాత మూత తీసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి బాగా కలుపుకోవాలి.

9. అందులోనే పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి.

10. ఆ తర్వాత ఒక గ్లాసు నీరు వేసి ఒకసారి కలిపి కుక్కర్ మీద మూత పెట్టి విజిల్స్ పెట్టాలి.

11. మీడియం మంట మీద నుంచి కనీసం ఏడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

12. ఆ తర్వాత కుక్కర్ ఆవిరిపోయే వరకు ఉంచి మూత తీయాలి.

13. టేస్టీ పందెంకోడి కూర రెడీ అయినట్టే.

14. కుక్కర్లో కాస్త నీళ్లు ఎక్కువ అది పులుసు లాగా వస్తే కాసేపు స్టవ్ మీద ఉడికిస్తే ఇగురులా మారిపోతుంది.

15. పైన కొత్తిమీర తరుగును చల్లుకుంటే రుచికరమైన పందెంకోడి కూర నోరూరిస్తూ రెడీగా ఉంటుంది. దీన్ని బగారా రైస్, బిర్యానీలో కలుపుకుని తింటే ఆ రుచే వేరు.

బ్రాయిలర్ కోడి, సాధారణ నాటుకోడితో పోలిస్తే పందెంకోడి కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. కాకపోతే దీన్ని వండడానికి ఎక్కువ సమయం పడుతుంది. పందెంకోడికి జీడిపప్పులు వంటి అనేక రకాల పోషకాహారాన్ని పెట్టి పెంచుతారు. కాబట్టి మాంసం మందంగా తయారవుతుంది. అది ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే కుక్కర్లో ఏడు, ఎనిమిది విజిల్స్ వరకు ఉడికించుకుంటే అది బాగా మెత్తగా ఉడుకుతుంది. పందెంకోడి కూర తినాలంటే అందరి వల్ల కాదు, దాన్ని కష్టపడి పెంచి పోరాటానికి పంపి ఆ తర్వాతే దాన్ని వంటకు సిద్ధం చేయాలి.