Palli Pachi pulusu: పల్లీలతో పచ్చిపులుసు, ఇది ఆరోగ్యానికి చేసే మేలు ఇంతా అంతా కాదు, రెసిపీ ఇదిగో
Palli Pachi pulusu: పచ్చిపులుసు అందరూ చేసుకుంటారు, ఇక్కడ మేము పల్లీలతో చేసే పచ్చిపులుసు రెసిపీని ఇచ్చాము. ఇది టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా సులువు.
Palli Pachi pulusu: పూర్వకాలం నుంచి పచ్చిపులుసును తినడం తెలుగువారికి అలవాటే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రసం. ఇక్కడ మేము కాస్త కొత్తగా పల్లీలతో పచ్చిపులుసు ఎలా చేయాలో ఇచ్చాము. దీన్ని అన్నంతోనే కాదు ఇడ్లీ, ఉప్మా, దోశెలు... దేనితో తిన్నా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటుంటే రుచి అదిరిపోతుంది. రెసిపీ చాలా సులువు. ఒకసారి చేసుకుంటే రెండు పూటలకు వస్తుంది. దీన్ని రసంలాగా, చట్నీ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలా చేయాలో తెలుసుకుందాం.
పల్లీల పచ్చిపులుసు రెసిపీకి కావలసిన పదార్థాలు
వేరుశెనగ పలుకులు - అరకప్పు
జీలకర్ర - ఒక స్పూను
చింతపండు - చిన్న ఉసిరికాయ సైజులో
ఎండుమిర్చి - ఎనిమిది
ఆవాలు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
పసుపు - అర స్పూను
నూనె - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
ఉల్లిపాయలు - ఒకటి
పల్లీల పచ్చిపులుసు రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి ముందుగా వేరుశెనగ పలుకులను చిన్న మంటపై వేయించాలి.
2. అవి వేగాక ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు చింతపండు నీటిలో నానబెట్టి గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి.
4. మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. కావాలనుకుంటే కాస్త నీరుని చేర్చవచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు, చింతపండు రసం వేసి పెట్టండి.
7. అందులోనే ఉల్లిపాయలను నిలువుగా కోసి వేయండి.
8. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోండి.
9. ఉప్పు సరిపోకపోతే కాస్త ఉప్పును కూడా వేసుకోవచ్చు.
10. కారం చాలకపోతే కారంపొడి ని కూడా యాడ్ చేసుకోవచ్చు.
11. ఇప్పుడు దీనికి తాళింపు పెట్టేందుకు సిద్ధం అవ్వండి.
12. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి ఒకటిన్నర స్పూను నూనె వేయండి.
13. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు, పసుపు వేసి వేయించి పచ్చిపులుసులో వేయండి. అంతే టేస్టీ పల్లీల పచ్చిపులుసు రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
ఇది మరీ నీళ్లలా కాకుండా వేరుశెనగ పలుకుల పేస్టు ఉంటుంది. కాబట్టి కొంచెం చిక్కగా ఉంటుంది. కాబట్టే ఇడ్లీల్లోకి, దోసెల్లోకి, ఉప్మా లోకి కూడా బాగుంటుంది. వేడివేడి అన్నంతో తింటే టేస్ట్ గా ఉంటుంది.
పల్లీల్లోని పోషకాలు నేరుగా మన శరీరానికి అందడానికి పల్లీల పచ్చిపులుసు ఉపయోగపడుతుంది. దీన్ని మీరు బ్రేక్ ఫాస్ట్ సమయంలో చేసుకుంటే రాత్రి వరకు సరిపోతుంది. ప్రత్యేకంగా కూర వండుకోవాల్సిన అవసరం ఉండదు. లంచ్ లో పాటు అప్పడాలు, వడియాలు వేయించుకుంటే ఆరోజు లంచ్ అదిరిపోవడం ఖాయం. ఇడ్లీలకి, దోశెలకు జతగా ఈ పల్లీల పచ్చిపులుసును తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.
టాపిక్