Palak Pesarattu: పాలకూర పెసరట్టు ఇలా చేసేయండి, ఎంతో ఆరోగ్యం
Palak Pesarattu: పాలకూర, పెసరట్టు రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ రెండిటిని కలిపి దోశె చేస్తే రుచి అదిరిపోతుంది. పైగా ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది.
Palak Pesarattu: ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ తిని బోర్ కొట్టిందా? ఓసారి కొత్తగా పాలకూర పెసరట్టును ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా అల్పాహారంలో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తినాలని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. కాబట్టి పాలకూర పెసరట్టు తినడం వల్ల ఆ రోజంతా మీరు ఆరోగ్యంగా ఉంటారు. శక్తి నిరంతరం అందుతుంది. పిల్లలు ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు. ఈ పాలకూర పెసరట్టు చేయడం చాలా సులువు. ఇది ఎలా చేయాలో చూద్దాం.
పాలకూర పెసరట్టు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
పాలకూర - రెండు కట్టలు
బియ్యం పిండి - మూడు స్పూన్లు
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - సరిపడినన్ని
నూనె - ఒక స్పూను
పాలకూర పెసరట్టు రెసిపీ
1. ముందుగానే పెసరపప్పును మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. పాలకూరను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. పాలకూరను వేసి వేయించాలి.
4. పాలకూరల్లో నీరు దిగుతుంది. ఆ నీరు ఇంకిపోయేదాకా వేయించి స్టవ్ కట్టేయాలి.
5. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును మిక్సీ జార్లో వేయాలి.
6. అందులోని వేయించిన పాలకూర, అల్లం, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.
7. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.
8. ఆ గిన్నెలో బియ్యపు పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
9. ఈ పిండి దోశెలు వేయడానికి సరిపడా మందంతో ఉండేలా చూసుకోవాలి.
10. అవసరమైతే వీటిని కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.
11. ఈ పిండిని దోశెల్లా పోసుకోవాలి. రెండు వైపులా కాల్చుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి.
12. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. కొంతమంది దీనిపై చీజ్‌ను కూడా వేసుకొని తింటూ ఉంటారు. అలాగే కారంపొడి చల్లుకున్నా టేస్టీ గానే ఉంటుంది.
పెసరపప్పు, పాలకూర... రెండూ ఆరోగ్యకరమైనది. పాలకూర తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. పాలకూరలో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. పాలకూర తినడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. గుండెకు కూడా పాలకూర ఎంతో మేలు చేస్తుంది.
ఇందులో వాడిన మరో ప్రధాన పదార్థం పెసరపప్పు. పెసరపప్పులో కూడా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, ప్రోటీన్ దీనిలో అధికంగా ఉంటాయి. పెసరపప్పును ప్రోటీన్ పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. చాలామంది మొలకెత్తిన పెసలను తింటూ ఉంటారు. అలాగే పెసరపప్పును తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి. పాలకూర పెసరట్టును ఒకసారి మీరు తిని చూడండి. బరువు తగ్గడానికి ఇది చాలా సహాయపడుతుంది. చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి ఇతర ఆహారాలు తీసుకోకుండా ఉంటారు. తద్వారా సులువుగా బరువు తగ్గొచ్చు.