Onion juice vs Onion Oil: ఉల్లిపాయ రసం Vs ఉల్లిపాయ నూనె, జుట్టుకు ఏది అప్లయ్ చేస్తే మంచిది?
Onion juice vs Onion Oil: ఉల్లిపాయను జుట్టు సంరక్షణ కోసం వినియోగించడం ఎప్పటినుంచో ఆదరణలో ఉంది. ఆయుర్వేదంలో కూడా ఉల్లిపాయకు మంచి స్థానమే ఉంది.
Onion juice vs Onion Oil: జుట్టు బాగా పెరిగేందుకు, పట్టుకుచ్చుల్లా మెరిసేందుకు ఎంతో మంది ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. కొంతమంది ఉల్లిపాయ రసాన్ని తీసి జుట్టుకు అప్లయ్ చేస్తే, మరికొందరు ఉల్లిపాయ నూనెను జుట్టుకు రాస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనది? అనే సందేహం మాత్రం ఎంతో మందిలో ఉంది. ఉల్లిపాయ రసం, ఉల్లిపాయ నూనె... ఈ రెండు మన జుట్టుకు అప్లయ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ముందుగా తెలుసుకుందాం. ఆ తరువాత ఏది మంచిదో మీకే అర్థమవుతుంది.
ఉల్లిపాయ రసం
దీనిలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి సల్ఫర్ అత్యవసరమైనది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ప్రోటీన్ కొలాజిన్. కాబట్టి ఉల్లిపాయ రసాన్ని తలపై అప్లయ్ చేస్తూ ఉంటారు ఎక్కువమంది. ఇందులో ఉండే సల్ఫర్.. జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది. దీనివల్ల వెంట్రుకలు పల్చబడడం, విరగడం వంటివి జరగవు. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తాయి. తలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల ఎయిర్ ఫోలికల్స్‌కు పోషణ పుష్కలంగా అందుతుంది. ఇది ఆరోగ్యకరంగా జుట్టు పెరిగేందుకు ఉపయోగపడుతుంది .
ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి. ఈ ఫ్రీరాడికల్స్ జుట్టు కణాలను దెబ్బతీస్తాయి. వీటివల్లే జుట్టు రాలిపోతుంది. ఉల్లిపాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ కోసం ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టిస్తూ ఉంటారు. ఉల్లిపాయ రసాన్ని తలకు రాయడం వల్ల చుండ్రు లక్షణాలు కూడా తగ్గుతాయి. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికం. ఇవి ఇన్ఫెక్షన్లను రాకుండా అడ్డుకుంటాయి. చుండ్రు కూడా ఒక రకమైన ఇన్ఫెక్షన్. దీనికి కూడా ఉల్లిపాయ రసం అద్భుతంగా పనిచేస్తుంది.
ఉల్లిపాయ నూనె
ఉల్లిపాయ నూనె మనం ఇంట్లో తయారు చేసుకోలేము. ఇవి మార్కెట్లో లభిస్తుంది. ఉల్లిపాయ రసం రాసుకుంటే దుర్వాసన వస్తూ ఉంటుంది. కానీ ఉల్లిపాయ నూనె వల్ల పెద్దగా దుర్వాసన రాదు. ఉల్లిపాయ నూనెలోని పోషకాలు జుట్టుకు లోతైన కండిషనింగ్ అందిస్తాయి. వాటికి సహజసిద్ధమైన మెరుపును ఇస్తాయి. ఉల్లిపాయ నూనె ఒక్కసారి కొనుక్కుంటే కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. కానీ ఉల్లిపాయ రసం మాత్రం వెంటనే వాడేయాల్సి ఉంటుంది. లేకపోతే పాడైపోయే అవకాశం ఎక్కువ .ఉల్లిపాయ నూనె కూడా జుట్టు కుదళ్లను బలపరచడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా అప్లయ్ చేయడం వల్ల జుట్టు చివర్లు పెరగడం వంటివి ఉండవు. వెంట్రుకలు ఆరోగ్యకరంగా కాంతివంతంగా పెరుగుతాయి.
ఉల్లిపాయ vs ఉల్లిపాయ రసం
ఉల్లిపాయ రసం, ఉల్లిపాయ నూనె ఈ రెండింటిలో ఏది వాడినా మంచిదే. ఏది వాడాలన్నది మీ జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. బిజీ షెడ్యూల్ ఉన్నవారు ఉల్లిపాయ నూనెను వాడుకోవడం మంచిది. ఉల్లిపాయ రసాన్ని తీసి దాన్ని స్టోర్ చేయడానికి టైం పడుతుంది. అదే ఉల్లిపాయ నూనె అయితే నచ్చినప్పుడు రాసుకోవచ్చు. ఉల్లిపాయ నూనెను రాసుకొని బయటికి వెళ్లినా ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఉల్లిపాయ రసాన్ని రాసుకున్న తర్వాత కచ్చితంగా తలకు స్నానం చేయాలి. లేకపోతే ఆ వాసన వదలదు. కాబట్టి మీ జీవనశైలిని బట్టి ఏది మీ తలకు అప్లయ చేయాలనేది నిర్ణయించుకుంటే మంచిది.