Not Hungry: ఆకలి వేయడం లేదా? తేలిగ్గా తీసుకోకండి, అది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సూచన
Not Hungry: హఠాత్తుగా ఆకలి తగ్గిపోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. అది కొన్ని రకాల అనారోగ్యాలను సూచిస్తుంది.
Not Hungry: కొంతమందికి ఆకలి వేయడం క్రమంగా తగ్గుతుంది. మరికొందరిలో హఠాత్తుగా తగ్గిపోతుంది. ఆ విషయాన్ని ఎంతో మంది తేలిగ్గా తీసుకుంటారు. ఆకలి తగ్గడం వల్ల త్వరగా బరువు తగ్గుతామని అనుకుంటారు. నిజానికి ఆకలి హఠాత్తుగా తగ్గడం లేదా క్రమంగా తగ్గడం అయినా ఆందోళన చెందే విషయమే. ఇది మీ శరీరంలో దాగి ఉన్న ఐదు రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచికగా పనిచేస్తుంది. కాబట్టి ఆకలిని కోల్పోతే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సిందే.
జీర్ణకోశ సమస్యలు
ఆకలి తగ్గిపోవడం అనేది జీర్ణాశయంతర సమస్యలకు కారణంగా చెప్పవచ్చు. ఇన్ఫ్లమేటరీ బోవెల్ సిండ్రోమ్, పొట్టలో పుండ్లు ఏర్పడడం, పెప్టిక్ అల్సర్లు ఏర్పడడం వంటివి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. వీటి వల్ల నొప్పి కలుగుతుంది. అలాగే ఆకలి తగ్గిపోతుంది. మీ ఆకలి తగ్గడానికి ఇలాంటి సమస్యలు కారణమేమో ఒకసారి చెక్ చేసుకోండి.
థైరాయిడ్ పనిచేయకపోవడం
థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా లేదా హైపో థైరాయిడిజం బారిన పడినా కూడా ఆకలి తగ్గిపోతుంది. జీవక్రియను నియంత్రించేది థైరాయిడ్ గ్రంథి. అయితే ఇది ఎప్పుడు పనిచేయదో అప్పుడు ఆకలిలో అసమతుల్యత వస్తుంది. ఆకలి వేయకపోవడం, తినాలనిపించకుపోవడం వంటివి జరుగుతుంది. కాబట్టి ఆకలి తగ్గిపోవడానికి థైరాయిడ్ రుగ్మతలు కూడా కారణమే.
మానసిక ఆరోగ్యం
మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆకలి వేస్తుంది. డిప్రెషన్, యాంగ్జయిటీ, తీవ్రమైన ఒత్తిడి వంటి లక్షణాలతో బాధపడే వారిలో ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి ఒకసారి మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ... ఆకలి కూడా తగ్గితే వెంటనే మానసిక వైద్యనిపులను సంప్రదించడం చాలా ముఖ్యం.
అంటు వ్యాధులు
క్షయ వ్యాధి ఉన్నా, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా ఆకలి వేయదు. ఈ ఇన్ఫెక్షన్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరుకు అంతరాయం కలుగుతుంది. అందుకే ఆకలి వేయదు. కాబట్టి ఆకలి వేయకపోవడం అనేది చిన్న సమస్య కాదు.
క్యాన్సర్ సూచిక
హఠాత్తుగా ఆకలి తగ్గడం లేదా క్రమంగా ఆకలి తగ్గుతూ రావడం అనేది కొన్ని రకాల క్యాన్సర్లకు లక్షణంగా చెప్పుకోవచ్చు. పొట్ట క్యాన్సర్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తే జీర్ణవ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఆహారం తినాలనిపించదు. ఆహారం చూడగానే యావగింపు కలుగుతుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు ముందస్తుగా కనిపించే లక్షణాల్లో ఆకలి తగ్గడం ఒకటి. కాబట్టి ఆకలి తగ్గినట్టు అనిపిస్తే వెంటనే సంప్రదించడం చాలా ముఖ్యం.
టాపిక్