Foods for full stomach: ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉండాలంటే ఆహారంలో వీటిని చేర్చుకోండి..
Foods for full stomach: ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను చేర్చుకుంటే సరి. వాటివల్ల బరువు తగ్గడం కూడా సులువవుతుంది.
ఇటీవల కాలంలో అధిక బరువు, ఊబకాయం సమస్యలతో ఎక్కువ మంది సతమతం అవుతున్నారు. ఇలాంటి వారు బరువు తగ్గేందుకు పెద్ద పెద్ద డైట్‌లు ఫాలో కాకపోయినా ఫర్వాలేదు. తేలికగా కొన్ని ఆహారాలను రోజు వారీ తిండిలో భాగం చేసుకుంటే చాలు. వాటిలో ఉండే పీచు పదార్థాల వల్ల కడుపు ఎక్కువ సేపు నిండి ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో ఎక్కువగా మరే ఆహారాలను తీసుకోవాలనే కోరిక పుట్టదు. ఆకలి వేయదు. ఫలితంగా శరీరంలో ఉన్న క్యాలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గుతారు.
పాలిష్ పెట్టని ధాన్యాలు :
పాలిష్ చేయకుండా ఎర్రగా ఉండే బియ్యం, గోధుమలు.. లాంటి ధాన్యాలను వండుకుని తినేందుకు ప్రయత్నించాలి. వాటిలో పీచు పదార్థాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో మొక్కలకు సంబంధించిన సమ్మేళనాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి కొద్దిగా తినే సరికే కడుపు నిండిపోయిన భావన కలిగిస్తాయి. ఎక్కువ సేపు ఆకలిని వేయనియ్యవు.
ఓట్ మీల్ :ఎ
ఓట్స్‌లో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం వల్ల తొందరగా కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. అయితే వీటిలో రకరకాల ఫ్లేవర్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. చక్కెర వేసి తయారు చేసిన ఫ్లేవర్లవి కాకుండా ప్లెయిన్ ఓట్స్‌ని ఎంపిక చేసుకోవాలి. వీటిలో కాసిన్ని పాలు, డ్రై ఫ్రూట్స్, పండ్ల ముక్కలు వేసుకుని తినేయవచ్చు. శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతోపాటుగా ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
చేపలు :
చేపల్ని గొప్ప ప్రొటీన్ సోర్సులని చెప్పవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ డైటరీ గైడ్ లైన్స్ ప్రకారం వారానికి రెండు సార్లు వీటిని తినవచ్చు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్ల లాంటివి ఉండటం వల్ల మనకు తొందరగా ఆకలేయదు. గుండెకూ మంచిది. శరీరంలో వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా సాల్మన్, మాకెరాల్, హెర్రింగ్, ట్రోట్, సార్డినెస్, ట్యూనా వంటి సముద్రపు చేపల కొవ్వులు మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
నట్స్, బీన్స్ :
భోజనానికి, భోజనానికీ మధ్యలో ఏమైనా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని కాసిన్ని కాసిన్ని చొప్పున తినేందుకు ప్రయత్నించండి. ఇవి బ్లడ్ షుగర్‌ని, ఇన్సులిన్ స్థాయిల్ని నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్‌లు, మినరళ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే చిక్కుడు జాతి గింజలు, బీన్స్‌లో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల ప్రొటీన్, ఆరు గ్రాముల ఫైబర్ దొరకుతాయి. కాబట్టి పొట్ట చాలా నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది.