National Cabbage day 2024: బట్టతల చికిత్సలో క్యాబేజీ వాడకం, దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే ప్రతిరోజూ తింటారు
National Cabbage day 2024: క్యాబేజీ అనగానే ఎంతోమంది ముఖం ముడుచుకుపోతుంది. నిజానికి క్యాబేజీ చేసే మేలు ఎక్కువే. ఒకప్పుడు దీన్ని ఔషధంగా వాడేవారు. ఈరోజు నేషనల్ క్యాబేజ్ డే. కాబట్టి దీని గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం.
National Cabbage day 2024: క్యాబేజీ ఫ్రై, క్యాబేజీ పులావ్, క్యాబేజీ గ్రీన్ పీస్ కర్రీ, క్యాబేజీ చట్నీ... ఇలా క్యాబేజీతో చేసే వంటలు ఎన్నో. వారంలో ఒక్కసారైనా కచ్చితంగా తెలుగు ఇళ్లల్లో క్యాబేజీ వంటకం ఉంటుంది. అయినా కూడా దాన్ని ఇష్టంగా తినే వారి సంఖ్య తక్కువే. నిజానికి క్యాబేజీ తినడం వల్ల అన్ని విధాలుగా మంచే జరుగుతుంది. అందుకే క్యాబేజీ కోసం ఒక ప్రత్యేక రోజును ప్రకటించారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 17న నేషనల్ క్యాబేజీ డే గా నిర్వహించుకుంటారు. ఈ దినోత్సవాన క్యాబేజీ వల్ల మనకు కలిగే లాభాలను, దానిపై అవగాహనను పెంచుతారు.
వేల ఏళ్లుగా మన ఆహారంలో క్యాబేజీ భాగమై గడుస్తోంది. క్యాబేజీ వినియోగం క్రీస్తు పూర్వ 4000 ఏళ్ల క్రితమే మొదలైందని చెబుతారు. క్యాబేజీ, బ్రస్సెల్స్, బ్రొకోలీ, కాలీఫ్లవర్, కాలే... ఇవన్నీ కూడా ఒకే జాతికి చెందిన ఆకుకూరలు. క్యాబేజీని పండించడం కూడా చాలా సులువు.
17, 18వ శతాబ్దాలలో ఐర్లాండ్, ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా ఇలా అనేక దేశాలలో క్యాబేజీ ప్రధాన ఆహారంగా మారిపోయింది. తర్వాత మన దేశంలో క్యాబేజీ అనేది ప్రధాన కూరగాయల జాబితాలో చేరిపోయింది. అయితే ఈ క్యాబేజీ అమెరికాకు పరిచయం అయింది మాత్రం 1541లో. ఒక ఫ్రెంచ్ అన్వేషకుడు దాన్ని ఉత్తర అమెరికాకు పరిచయం చేశాడు. క్యాబేజీని అధికంగా పండిస్తున్న దేశం చైనా. ప్రపంచంలో క్యాబేజీ 48% చైనా నుంచి వస్తాయి. క్యాబేజీని అనేక రకాలుగా వండుకొని తింటారు. కొంతమంది ఉడికించి తింటే, మరికొందరికి కాల్చుకొని తింటారు. కొందరు పచ్చి క్యాబేజీని ఇష్టంగా తింటారు. ఏదైనా కూడా క్యాబేజీ మేలే చేస్తుంది.
క్యాబేజీ తిని బతికాడు
గ్రీకు తత్వవేత్త అయిన డయోజెనెస్ తన జీవితాంతం కేవలం క్యాబేజీని మాత్రమే తిన్నాడు. క్యాబేజీ, నీరు ఇదే ఆయనకు ప్రతిరోజూ భోజనం. అయినా సరే ఆయన ఆరోగ్యంగా జీవించాడని చెబుతారు. ఇక రోమ్ దేశంలో ఇతర కూరగాయలతో పోలిస్తే క్యాబేజీ చాలా ఖరీదైనది. ధనవంతులు అధికంగా తినే కూరగాయ రోమ్‌లో క్యాబేజీనే.
బట్టతలకు చికిత్స
పురాతన చైనాలో క్యాబేజీని బట్టతలకి చికిత్స చేసేందుకు వినియోగించేవారు. క్యాబేజీతో చేసిన ఔషధాలను తలకి రాయడం ద్వారా జుట్టును మొలిపించేవారు. బట్టతల ఉన్న వారిని క్యాబేజీ అధికంగా తినమని అప్పట్లో సూచించేవారట. పురాతన ఈజిప్టులో క్యాబేజీ రసాన్ని తీసి దాన్ని రాత్రిపూట తాగేవారు. ఇలా చేయడం వల్ల మరుసటి రోజు మద్యం తాగడం వల్ల వచ్చే హ్యాంగోవర్ తగ్గిపోతుందని వారి నమ్మకం.
క్యాబేజీని తినడం వల్ల క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు కూడా చెప్పాయి. ముఖ్యంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రాకుండా క్యాబేజీ అడ్డుకుంటుంది. కనుక క్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అలాగే అధిక బరువును తగ్గించుకోవాలనుకునే వారు క్యాబేజీతో వండిన ఆహారాలను తరచూ తింటూ ఉండాలి.
పిల్లలకు పాలిచ్చే తల్లులు క్యాబేజీని తినడం వల్ల వారికి పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అలాగే దగ్గుకు ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది క్యాబేజీ. దగ్గు వస్తున్నప్పుడు క్యాబేజీ ఆకులను నమలడం అలవాటు చేసుకోండి. క్యాబేజీ ఆకుల రసాన్ని తాగితే ఇంకా మంచిది. ఆకుల రసాన్ని తాగలేనివారు చిటికెడు పంచదార వేసుకొని తాగినా సరిపోతుంది. స్మోకింగ్ అలవాటు ఉన్నవారు తమ ఆహారంలో క్యాబేజీని అధికంగా తినాలి. ఎందుకంటే పొగ తాగినప్పుడు శరీరంపై ఎన్నో చెడు ప్రభావాలు పడతాయి. వాటి తీవ్రతను తగ్గించే శక్తి క్యాబేజీకి ఉంది.
ఒక ఆకు కూర కిందకే వస్తుంది ఎన్నో పోషకాలు ఉన్న క్యాబేజీని గురించి అందరిలో అవగాహన కల్పించేందుకే నేషనల్ క్యాబేజ్ డేను నిర్వహిస్తున్నారు