Monday Quote : దగ్గరున్నప్పుడు అర్థం చేసుకోనివాళ్లకి.. దూరమయ్యాక బాధపడే అర్హత లేదు-monday motivation on always appreciate what you have before its gone ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Quote : దగ్గరున్నప్పుడు అర్థం చేసుకోనివాళ్లకి.. దూరమయ్యాక బాధపడే అర్హత లేదు

Monday Quote : దగ్గరున్నప్పుడు అర్థం చేసుకోనివాళ్లకి.. దూరమయ్యాక బాధపడే అర్హత లేదు

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 17, 2022 06:00 AM IST

Monday Motivation : కొందరు మనిషి పక్కనున్నప్పుడు వారిని అభినందించారు. వారి కృషిని గుర్తించరు. వాళ్లకి ప్రేమను ఇవ్వరు. ధైర్యం, సపోర్ట్ ఇవ్వరు. కానీ వాళ్లు దూరం అయినప్పుడు మాత్రం ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తారు. అప్పుడేమి ప్రయోజనం ఉంటుంది. మనుషులు దూరమయ్యాక.. ఇవన్నీ ఇస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది చెప్పండి.

<p>కోట్ ఆఫ్ ద డే</p>
కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : చాలామంది అలానే ఉంటారు. మనిషి బతికున్నప్పుడు ప్రేమను ఇవ్వరు కానీ.. వాళ్లు చనిపోయాక అన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటూ.. మంచి విషయాలు గుర్తుచేసుకుంటారు. బతికున్నప్పుడు కనీసం గంజినీరు కూడా పోయని వాళ్లు మన చుట్టూ చాలామందే ఉంటారు. మనిషిపోయాక పంచభక్ష పరావన్నాలు పెట్టి.. వారి మీద ప్రేమను చాటుకుంటారు కానీ.. బతికున్నప్పుడు పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అదేంటో ఇప్పటికైనా పోయారనే ఆనందంతో విందు ఇస్తారు ఏమో. అది ఎంతవరకు కరెక్ట్?

ఓ మనిషి దూరమైపోవడం అంటే చనిపోవడం ఒక్కటే కాదు. ఓ మనిషి అవతలి వారి నుంచి సరైన సపోర్ట్, ప్రేమ ఇవ్వనప్పుడే దూరమైపోతారు. వాళ్లతో ఉన్నప్పుడు కనీసం వారికి ధైర్యం చెప్పి నేనున్నాను అనరు కానీ.. వాళ్లు విరక్తితో దూరమైపోయాక.. నీకోసం నేనున్నాను. నీకోసం అది చేస్తాను.. ఇది చేస్తాను అంటూ హామీలు ఇస్తారు. దానితో ఏమి ప్రయోజనం ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం ఏమిటి? మనిషి దూరమయ్యాక.. ప్రేమను చూపించడం కూడా అంతే.

ఓ మనిషి మీతో ఉన్నప్పుడు మీరు కనీసం వారి గురించి ఆలోచించరు. ఏవో సమస్యలు ఆలోచించుకుంటూ.. వాటిని మీతో ఉన్నవారిపై రుద్దేస్తారు. దానివల్ల మీతో ఉన్నవారు ఇబ్బంది పడతారు. చివరికి మీకు దూరమైపోతారు. వాళ్లు దూరమయ్యాక మీకు ఈ విషయాలు అర్థమైన పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే ఓ వ్యక్తి కానీ.. వస్తువు కానీ.. మీ దగ్గరున్నప్పుడు బాగా చూసుకోండి. మీరు బాగా చూసినా వాళ్లు వెళ్లిపోయారంటే అది వాళ్ల కర్మ. అలా అనుకుని వదిలేయండి. కానీ మీ దగ్గరున్నప్పుడు పట్టించుకోకుండా.. వాళ్లు దూరమయ్యాక ప్రేమను, కేర్​ను చూపించాలి అనుకుంటే అది బురదలో పోసిన పన్నీరే అవుతుంది.

మీతో ఉన్నవాళ్లని ప్రేమించండి. అభినందించండి. వారి పట్ల మీకున్న అభిమానాన్ని తెలియజేయండి. వాళ్ల కోసం మీరున్నారనే భరోసా ఇవ్వండి. ఏ ఆపద వచ్చిన మీరున్నారని మీరు అనుకుంటే సరిపోదు. వాళ్లకి నిజంగా సమస్య వచ్చినప్పపుడు.. లేదా వాళ్లు నా సమస్య ఇది అని చెప్పినప్పుడు అర్థం చేసుకుని వారికి తోడుగా నిలబడండి. అంతేకానీ వారి సమస్యను.. మీ సమస్యతో కలిసి ఎక్కువ చేసి.. వారికి మీపై మనసు విరిగేలా చేసి.. వాళ్లు దూరమయ్యాక నేను బాగా చూశాను.. ప్రేమనిచ్చాను.. కానీ వెళ్లిపోయారని ఫీల్ అవ్వకండి. ఓ వ్యక్తి మిమ్మల్ని నమ్మినప్పుడే మీతో ఉంటారు. వారు మీతో ఉండాలనుకున్నారు కాబట్టే మీ తప్పులను కూడా క్షమించి ఉండవచ్చు.

కానీ వాళ్లు వెళ్లిపోయాక మీ తప్పులు మీకు తెలిసినా.. పెద్ద ప్రయోజనం ఉండదు. అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మా తప్పులను చెప్తున్నావా అంటూ జడ్జ్ చేయకండి. ప్రేమలో ఉన్నప్పుడు ఎవరు తప్పులు ఎంచరు. ప్రేమించిన వ్యక్తి అర్థం చేసుకోకపోయినప్పుడు.. గతిలేక మీ తప్పులను చెప్పి మీ నుంచి దూరమైపోతారు. కాబట్టి ఎవరైనా మీ దగ్గరున్నప్పుడు.. వారిని అర్థం చేసుకుని.. వారితో ముందుకు సాగండి. లేదు కాదు అనుకుంటే వాళ్లు వెళ్లిపోయాక బాధపడకండి. ఈ ప్రపంచంలో ఏదీ మీతో శాశ్వతం కాదని తెలుసుకోండి. కాబట్టి.. మీరు వాళ్లతో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం