Monday Motivation : ఆత్మవిశ్వాసం లేకుంటే ఏ పనైనా కష్టమే.. అదే ఉంటే గడ్డిపరక కూడా ఆయుధమే-monday motivation if you dont have self confidence anything is difficult ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monday Motivation : ఆత్మవిశ్వాసం లేకుంటే ఏ పనైనా కష్టమే.. అదే ఉంటే గడ్డిపరక కూడా ఆయుధమే

Monday Motivation : ఆత్మవిశ్వాసం లేకుంటే ఏ పనైనా కష్టమే.. అదే ఉంటే గడ్డిపరక కూడా ఆయుధమే

Anand Sai HT Telugu
Apr 01, 2024 07:27 AM IST

Monday Motivation In Telugu : ఆత్మవిశ్వాసం అనేది మనిషి అత్యంత ముఖ్యమైనది. అది లేకుండా ఎంత చిన్న పనైనా చేయడం కష్టంగా ఉంటుంది.

ఆత్మవిశ్వాసమే బలం
ఆత్మవిశ్వాసమే బలం (Unsplash)

మనిషి ఆశ జీవి. కానీ ఆశపడినంత గొప్పగా ఆత్మవిశ్వాసాన్ని చూపలేడు. అదే ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు. అన్నీ ఉన్నా.. ఆత్మ విశ్వాసం లేక ఓడిపోయిన వారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. జీవితంలో గెలిచేందుకు సంపద ఉంటే సరిపోదు.. సరైన ప్రణాళిక ఉండాలి. దానికి ఆత్మవిశ్వాసం కావాలి. అదే లేకుంటే చిన్న ఆయుధం కూడా మీతో ఆడుకుంటుంది. అదే ఆత్మవిశ్వాసం ఉంటే గడ్డిపరక కూడా ఆయుధంగా మారి శత్రువులను అడ్డుకుంటుంది. ఓ చిన్న కథ చదవండి.

ఒక రాజు తన శత్రువులపై దాడి చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేశాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ యుద్ధంలో ఎలాగైనా గెలుస్తాం అని నమ్మకంగా ఉన్నాడు. కానీ సైనికులు చాలా అనుమానించారు. మనం గెలుస్తామో లేదోనని సైన్యాధిపతి కూడా చెప్పుకొచ్చాడు. రాజు తన సైనికులను ప్రోత్సహించడానికి ఏమి చేయాలని ఆలోచించాడు. చివరగా సన్యాసి దగ్గరకు వెళ్లాడు. ఏమి చేయగలనని అడిగాడు. అప్పుడు సన్యాసి రాజుకు ఒక ఆలోచన చెప్పాడు. రాజు కూడా అలాగే చేసాడు.

అదేమిటంటే ఆ రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు. వారి కులదేవత గుడి వద్ద ఆగి ప్రార్థించి, ఒక నాణెం తీసుకొని సైనికుల ముందు పెట్టాడు. నేను ఇప్పుడు ఈ నాణెం తిప్పుతాను, అది తల పడితే మనం గెలుస్తాము. లేకుంటే యుద్ధంలో ఓడిపోతాం అని చెప్పాడు. మన తలరాత మన విధిని ఈ నాణెం చెబుతుందని నాణేనాన్ని గాలికోలి వదిలాడు.

సైనికులందరూ నాణేం వైపు చూశారు. అప్పుడు తల పడింది. కాబట్టి మనం తప్పకుండా గెలుస్తామనే ఆశతో, సంతోషంతో ఆ సైనికులు శత్రువుపై దాడి చేశారు. తర్వాత యుద్ధం గెలిచారు. తర్వాత సైనికులను పిలిచాడు రాజు. విధిని ఎవరూ మార్చలేరు అని చెప్పాడు. సైనికులకు అర్థం కాలేదు. నేను నాణేనికి రెండు వైపులా తల పెట్టే తయారు చేయించాను అని చెప్పాడు. దీంతో సైనికులు అందరూ ఆశ్చర్యపోయారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే దేన్నైనా సులువుగా జయించి విధిని మార్చుకోవచ్చని చెప్పాడు రాజు.

పైన చెప్పినట్టుగా ఏది జరగాలో అదే జరుగుతుంది. అయితే ఆత్మవిశ్వాసం ఉంటే మన వైపే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం సాధారణంగా వెళ్లి యుద్ధం చేయడం కంటే.. ఆత్మవిశ్వాసంతో వెళ్లి యుద్ధం చేస్తే కచ్చితంగా గెలుపు మన సొంతం అవుతుంది. ఆత్మవిశ్వాసం లేకుంటే ఎలాంటి పని చేసినా నో యూజ్. ఎంత గొప్ప సైన్యం ఉన్నా.. ఎంత గొప్ప వారైనా కచ్చితంగా గెలవలేరు. ఆత్మవిశ్వాసం ముందుకు సాగితే.. ప్రతీ గెలుపు మీ సొంతం అవుతుంది.

ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్టే..

అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే..

విజయం మనల్ని వరించినట్టే..

సూర్యుడు పగలే దారిచూపగలడు..

అదే ఆత్మవిశ్వాసం శూన్యంలోనూ దారిచూపిస్తుంది..

లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా..

అగ్గిపుల్ల వెలుగు దాచలేదు..

నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే..

నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు..

పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది..

ఆత్మవిశ్వాసం విజయపథం వైపు నడిపిస్తుంది..

Whats_app_banner