Monday Motivation : సమస్య నీకోసం పుడితే.. సమాధానం నీ నుంచే పుట్టాలి
Monday Motivation In Telugu : చాలా మంది చిన్న సమస్య రాగానే నానా ఇబ్బందులు పడుతారు. కానీ దానికి సమాదానం వెతికేందుకు మాత్రం అస్సలు ప్రయత్నించారు.
ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ జీవికి సమస్యే. ప్రకృతి కచ్చితంగా పరీక్షలు పెడుతుంది. సమస్యలు లేని జీవితం.. అస్సలు జీవితమే కాదు. సమస్య లేకుండా బతుకును వెళ్లడదీయడమంటే.. శవంతో సమానం. వచ్చే చిన్న సమస్యలకు కుంగిపోకూడదు. ఎక్కడ సమస్య పుట్టిందో అక్కడే దానికి సమాధానం కూడా దొరుకుతుంది. సమస్య పుట్టిన చోటే.. సమాధానం కూడా ఉంటుంది. కానీ మనం మాత్రం సమాధానం కోసం వెతకకుండా కాలం వెళ్లదీస్తూ ఉంటాం.
సమస్యల రాళ్లు మన మీద పడుతూ ఉంటే.. తెలివిగలవారు వాటిని అందుకొని కొత్త గోడలను నిర్మించుకుంటారు. అదే తెలివి లేనివారు.. తల వంచుకుని రాళ్ల దెబ్బలు తింటారు. అలా దెబ్బలు తింటే నష్టపోయేది మీరే. అదే కొత్త గోడలను నిర్మించుకుంటే లాభపడేది మీరే. అందుకే సమస్య మెుదలైన నీలో నుంచే.. సమాధానం కూడా రావాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది.
జీవితమనే పొలంలో కలుపు మెుక్కలు అనే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్లలేం కదా.. కలుపు మెుక్కలను పీకేస్తూ పైరును కాపాడుకుంటాం. అలాగే సమస్యల మీద యుద్ధం చేసి జీవించాలి. అదే సమస్యలకు లొంగిపోతే.. జీవితాంతం కుంగిపోవాల్సి వస్తుంది.
ప్రతీ ఒక్కరూ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది.. సమస్య నీదైనప్పుడు.. పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర సలహాలు మాత్రమే ఉంటాయి. మీకు ఎంత దగ్గరివారైనా కేవలం సలహాలు, సూచలను మాత్రమే ఇస్తారు. సమాధానాన్ని వెతుక్కోవలసింది మీరే. అంతేకాదు.. దానికోసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అప్పుడే సరైన సమాధానం మీకు దొరుకుతుంది.
చాలా మంది చేసే అతిపెద్ద తప్పు.. సమస్యలు రాగానే ఇక జీవితం అయిపోయిందని అనుకుంటారు. కానీ సమస్య చుట్టే సమాధానం కూడా మీ కోసం ఉంటుంది. ఆలోచించే శక్తి మాత్రం ఉండాలి. దానిని ఎలా అధిగమించాలనే తెలివి ఉండాలి. సమస్యల గురించి ఆలోచిస్తూ.. అక్కడే ఉండిపోతే.. మీరు కూడా ఆగిపోతారు. జీవితంలో చేయాల్సిన పనులన్నీ పెండింగ్ పడతాయి. సమస్యలు వస్తే భయపడి పరిగెత్తకూడదు.. ధైర్యంగా ముందుకు సాగాలి.
గతంలో నువ్ ఎదుర్కొన్న బాధలు, కష్టాలు.. ప్రస్తుతంలో నువ్ తీసుకున్న నిర్ణయాల ముందు చిన్నవే. జీవితంలో గడిచిపోయిన సమస్య గురించి ఇప్పుడు ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. ముందుగు ప్రయాణిస్తూ ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు. సమస్యలు శాశ్వతం కాదు.. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని క్షణాలు.. ఇలా ఏదో ఒక సమయంలో తిరిపోవాల్సిందే. అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి.. బాధపడకూడదు.
కొత్తగా వచ్చేవి సవాళ్లు, సవాళ్లతో కూడిన పరిస్థితులే.. అవి సమస్యలు కావు.. మీ జీవితంలో అస్సలు కొత్తగా ఏమీ జరగకపోవడమే అసలు సమస్య. అందుకే జీవితంలో ఏదో ఒకటి జరగాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం.. ఏ సమస్యలూ లేని జీవితం ఉండదు. అస్సలు అది జీవితమే కాదు..