Masala Rice Recipe: పావుగంటలో చేసే మసాలా రైస్ రెసిపీ, చల్లని వాతావరణంలో ఘాటుగా, టేస్టీగా ఉంటుంది
Masala Rice Recipe: ఎప్పుడూ పులావ్, బిర్యానీలే కాదు. మసాలా రైస్ రెసిపీని ప్రయత్నించండి.
మసాలా రైస్ రెసిపీ
Masala Rice Recipe: వాతావరణం చల్లగా ఉందంటే కాస్త కారంగా, ఘాటుగా ఏమైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మసాలా రైస్ రెసిపీని ప్రయత్నించండి. అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ రెసిపీని ప్రయత్నించవచ్చు. ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే అందరూ పులిహోర, లెమన్ రైస్ వంటివే ప్రయత్నిస్తారు. అన్నం మిగిలిపోతే మసాలా రైస్‌ను కూడా చేసుకోవచ్చు. ఇందులో కొన్ని రకాల కూరగాయలు, మసాలా దినుసులు వేస్తాం. కాబట్టి పోషకాహారపరంగా కూడా మంచిదే. ఈ మసాలా రైస్ రెసిపీ చాలా సులువు. ఎవరైనా ఇట్టే చేసేయొచ్చు. అది కూడా కేవలం పావుగంటలో ఇది రెడీ అయిపోతుంది.
మసాలా రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
అన్నం - ఒక కప్పు
టమాటా - ఒకటి
పచ్చి బఠానీలు - గుప్పెడు
పచ్చి మిర్చి - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
జీలకర్ర - పావు స్పూను
కారం - ఒక స్పూన్
గరం మసాలా పొడి - పావు స్పూను
ఉల్లిపాయ - ఒకటి
క్యారెట్ - ఒకటి
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - అర స్పూను
పసుపు - పావు స్పూను
ధనియాల పొడి - అర స్పూను
ఉప్పు- రుచికి సరిపడా
మసాలా రైస్ రెసిపీ తయారీ ఇదిగో
1. మసాలా రైస్ రెసిపీ కోసం ముందుగానే అన్నం వండుకొని పెట్టుకోవాలి. లేదా మిగిలిపోయిన అన్నాన్ని కూడా వాడుకోవచ్చు.
2. ఉల్లిపాయ, టమోటో, పచ్చిమిర్చి, క్యారెట్ వంటివి సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.
4. తర్వాత ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. అవి బాగా వేగాక టమోటో ముక్కలను వేయాలి.
5. ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. కొన్ని నిమిషాల పాటు బాగా మగ్గించాలి.
6. తరువాత క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు వేసి కలపాలి. రెండు నిమిషాలు వాటిని ఉడకనివ్వాలి.
7. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టాలి. ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి.
8. ఇప్పుడు చిన్న మంట మీద స్టవ్ ను పెట్టి కళాయిలో ముందుగా వండుకున్న అన్నాన్ని వేసి కలపాలి. పైన గరం మసాలాను కూడా చల్లుకోవాలి.
9. అన్నం మరీ ముద్దగా కాకుండా పొడిపొడిగా వచ్చేలా కలుపుకోవాలి. అంతే మసాలా రైస్ రెడీ అయినట్టే.
10. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని తింటే రుచి అదిరిపోతుంది.