Mango Fruit Bobbatlu: మామిడిపండు బొబ్బట్లు చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Mango Fruit Bobbatlu: మామిడి పండుతో చేసే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని చేయడం చాలా తక్కువ మందికి తెలుసు. మామిడిపండు బొబ్బట్లు రెసిపీ ఇక్కడ ఇచ్చాము ఫాలో అయిపొండి.
Mango Fruit Bobbatlu: వేసవిలో మామిడి పండ్లు అధికంగా దొరుకుతాయి. తియ్యటి మామిడి పండ్లతో ఒకసారి బొబ్బట్లు చేసి చూడండి. రుచి మామూలుగా ఉండదు. ఇవి కొత్తగా కూడా ఉంటాయి. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఈ మామిడిపండు బొబ్బట్లు చేసి పెడితే మరీ ఇష్టంగా తింటారు. పిల్లలకు ఇవి ఎంతో నచ్చుతాయి. దీని చేయడం ఎలాగో తెలుసుకోండి.
మామిడిపండ్లు బొబ్బట్ల రెసిపీకి కావలసిన పదార్థాలు
మామిడి పండ్లు గుజ్జు - ఒక కప్పు
గోధుమ పిండి - ఒక కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొబ్బరి తురుము - పావు కప్పు
బెల్లం తురుము - పావు కప్పు
యాలకుల పొడి - అర స్పూను
మామిడి పండ్లు బొబ్బట్లు రెసిపీ
1. ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసి ఉప్పు కలిపి కాస్త గోరువెచ్చని నీళ్లు పోసుకుని చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టి కొద్దిసేపు పక్కన వదిలేయాలి.
2. మామిడిపండు గుజ్జును మిక్సీలో వేసి పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి మిక్సీ జార్లో మెత్తగా రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి.
4. అందులోనే పచ్చి కొబ్బరి తురుమును కూడా వేయాలి.
5. చిన్న మంట మీద వేయించి తర్వాత బెల్లం తురుమును వేయాలి.
6. ఈ మొత్తం మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత మిక్సీలో పేస్ట్ లా చేసుకున్న మామిడి గుజ్జును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
7. చిన్న మంట మీద దీన్ని వండాలి. ఇదంతా హల్వా లాగా దగ్గరగా వస్తుంది.
8. ఆ సమయంలో యాలకుల పొడిని వేసి బాగా కలిపి చల్లార్చాలి. స్టవ్ ఆఫ్ చేయాలి.
9. ఇప్పుడు ఈ మామిడిపండు మిశ్రమాన్ని చిన్నచిన్న పూర్ణాల చుట్టూ కొని పక్కన పెట్టుకోవాలి.
10. చపాతీ పిండి నుంచి కొంత ముద్దను తీసి పూరీలా ఒత్తుకొని మధ్యలో ఈ మామిడిపండు పూర్ణాలను పెట్టి మడిచేసి మళ్లీ ఒత్తుకోవాలి.
11. బొబ్బట్లు ఇలా ఒత్తుకున్నాక స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాసి వీటిని కాల్చుకోవాలి. అంతే టేస్టీ బొబ్బట్లు రెడీ అవుతాయి.
12. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. ఈ మామిడి పండ్లు బొబ్బట్లు ఒక్కసారి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు.
సీజనల్ గా దొరికే మామిడిపండ్లతో వీలైనంత రెసిపీలు చేసుకొని తినడం మంచిది. ఎందుకంటే వేసవిలో మాత్రమే దొరికే ఈ పండ్లను మిగతా కాలాల్లో తినడం కష్టం. సీజనల్ గా దొరికే పండ్లు వచ్చే వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తాయి. కాబట్టి వీలైనంతవరకు మామిడి పండ్లను తినేందుకు ప్రయత్నించండి.
టాపిక్