Tomato Halwa Recipe: టమాటో హల్వా ఎప్పుడైనా తిన్నారా? తింటే మైమరిచిపోతారు, రెసిపీ ఇదిగో
Tomato Halwa Recipe: టమాటోలతో హల్వా ఏమిటి? అనుకోకండి. టమాటాలతో ఎన్నో రకాల రెసిపీలను ప్రయత్నించవచ్చు. ఇక్కడ మేము టమాటో హల్వా రెసిపీ ఇచ్చాము. ఈ స్వీట్ రెసిపీ ఒకసారి ప్రయత్నించండి.
Tomato Halwa Recipe: బాదం హల్వా, క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా తిని ఉంటారు. ఒకసారి టమోటా హల్వా కూడా తిని చూడండి. టమోటాలు కేవలం కూరలో ఇగురు కోసమే కాదు, ఎన్నో స్వీట్ రెసిపీలలో కూడా వినియోగిస్తారు. టమాటో హల్వా చేయడం చాలా సులువు. టమోటాలకు ఉండే ఎరుపు రంగు వల్ల హల్వా కూడా కంటికి ఇంపుగా ఎర్ర రంగులోనే వస్తుంది. చూస్తేనే తినేయాలనిపిస్తుంది. దీన్ని చాలా సులువుగా చేసేయొచ్చు. టమాటా హల్వా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
టమాటో హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
టమాటాలు - అయిదు
బాదం జీడిపప్పుల తరుగు - అరకప్పు
యాలకుల పొడి - ఒక స్పూను
ఉప్మా రవ్వ - అరకప్పు
పంచదార - ఒక కప్పు
నెయ్యి - అరకప్పు
టమాటో హల్వా రెసిపీ
1. టమోటాలను ఎర్రగా ఉండేవి ఈ హల్వా కోసం ఎంపిక చేసుకోవాలి.
2. వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి.
3. ఆ గిన్నెలో స్టవ్ మీద పెట్టి పావుగంట సేపు ఉడకబెట్టుకోవాలి.
4. ఆ తరువాత స్టవ్ కట్టేసి టమోటోలను మరొక గిన్నెలో వేసి చేతితోనే నలిపి గుజ్జులా చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
6. ఆ నెయ్యిలో జీడిపప్పులను, బాదంపప్పులను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇక మిగిలిన నెయ్యిలో ఉప్మా రవ్వను వేసి వేయించుకోవాలి.
8. కాస్త రంగు మారేవరకు రవ్వను వేయించాలి.
9. తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి ఆ రవ్వను ఉడకనివ్వాలి.
10. రవ్వ ఉడికి కాస్త దగ్గరగా అవుతుంది. ఆ సమయంలోనే టమాటో గుజ్జును, పంచదారను వేసి బాగా కలపాలి.
11. అందులోనే యాలకుల పొడిని, జీడిపప్పు, బాదంపప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
12. చిన్న మంట మీద ఉడికిస్తే ఇది హల్వాలాగా దగ్గరగా వస్తుంది.
13. ఆ సమయంలో మరి కాస్త నెయ్యిని వేసి బాగా కలపాలి.
14. టేస్టీ హల్వా రెడీ అయిపోతుంది. స్టవ్ కట్టేసి ఒక ప్లేటుకు నెయ్యి రాయాలి.
15. ఈ మొత్తం హల్వా మిశ్రమాన్ని ఆ ప్లేట్లో వేసి సమంగా సర్దుకోవాలి.
16. ఇది చల్లారాక ముక్కలుగా కోసి నిల్వ చేసుకోవాలి.
ఈ టమాటా హల్వా పిల్లలకు బాగా నచ్చుతుంది. దీన్ని టమోటాలతో చేసామంటే ఎవరూ నమ్మరు. అంత రుచిగా ఉంటుంది ఇది.
టాపిక్