Chicken Recipe: స్పైసి స్పైసీగా మామిడికాయ చికెన్ ఫ్రై చేసి చూడండి, బగారా రైస్‌తో అదిరిపోతుంది
Chicken Recipe: పచ్చిమామిడి దొరికేది వేసవిలోనే. ఈ పచ్చి మామిడితో చికెన్ ఫ్రై చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
Chicken Recipe: వేసవి వచ్చిందంటే మామిడి కాయలు, మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి. పచ్చి మామిడితో అనేక రకాల రెసిపీలను తయారు చేస్తారు. ఒకసారి పచ్చిమామిడి చికెన్ ఫ్రై కూడా చేసి చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. బగారా రైస్‌కు లేదా పలావ్‌కు జతగా అదిరిపోతుంది. దీన్ని స్పైసీగా చేసుకుంటే అందరికీ నచ్చడం ఖాయం. మామిడికాయ చికెన్ ఫ్రై చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ చికెన్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ ముక్కలు - అర కిలో
మామిడికాయ - ఒకటి
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - మూడు
జీడిపప్పు - గుప్పెడు
కరివేపాకులు - గుప్పెడు
కారం - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - ఒక స్పూన్
ధనియాల పొడి - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
మామిడికాయ చికెన్ ఫ్రై రెసిపీ
1. మామిడికాయ పొట్టును తీసేసి మిగతా మామిడి గుజ్జును ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు చికెన్ పరిశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
3. ఆ చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. నూనెలో నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.
6. అలాగే గుప్పెడు కరివేపాకులు కూడా వేయాలి.
7. అందులోనే పసుపు, గరం మసాలా పొడి, కారం వేసి బాగా కలపాలి.
8. అందులో మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
9. కాస్త నీరు వేస్తే మామిడికాయ ముక్కలు త్వరగా ఉడుకుతాయి.
10. అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి.
11. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని ఉడికించాలి.
12. చికెన్ లో నీరంతా ఇంకిపోయే వరకు చిన్న మంట మీద ఉంచాలి.
13. దించేముందు ధనియాల పొడి, కొత్తిమీర తరుగు చల్లి ఒకసారి కలుపుకోవాలి.
14. ఆ తర్వాత మళ్లీ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి.
15. అంతే మామిడికాయ చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. ఇది పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది.
16. పెద్దలకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. బగారా రైస్ లేదా పలావ్ వంటి వండుకున్నప్పుడు జతగా వండుకుని చూడండి... మీ అందరికీ నచ్చడం ఖాయం. ఇది గ్రేవీలా కావాలనుకుంటే ఇగురు పూర్తిగా ఇంకిపోకుండా ఉంచుకుంటే సరి.
మామిడికాయ సీజనల్ దొరికే ఆహారం. కాబట్టి కచ్చితంగా దీన్ని తినాలి. వేసవిలో మాత్రమే మామిడికాయలు అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు జరుగుతుంది.
పచ్చి మామిడికాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. మామిడి పండ్లను డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా తినకూడదు. కానీ మామిడికాయలను తినవచ్చు. కాబట్టి మామిడి పండ్లలోని పోషకాలను పొందేందుకు మధుమేహులు పచ్చి మామిడిని తినేందుకు ప్రయత్నించండి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఫైబర్, ఫాస్ఫరస్, క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. పచ్చిమామిడిని తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. వడదెబ్బ వంటివి తగలకుండా ఉంటాయి.