Masala Omelette Bun | బ్రేక్‌ఫాస్ట్‌లో మసాలా ఆమ్లెట్ బన్.. తింటుంటే ఎంతో ఫన్!
Breakfast Recipe: చిక్కని వెన్న, జున్ను, బన్ను కలిపి గుడ్లతో చక్కని ఆమ్లెట్ చేసుకుంటే దాని రుచి మామూలుగా ఉండదు. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో Masala Omelette Bun చేసుకోండి, మైమరిపోయి తినండి.
త్వరగా, రుచికరంగా ఏదైనా చేసుకోవాలనుకుంటే గుడ్లతో ఆమ్లెట్ చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ సమయాల్లోనూ ఆమ్లెట్ ఆహారంతో పాటు తీసుకోవచ్చు. మీరు ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో కాస్త రుచికరమైన అల్పాహారం చేయాలనుకుంటే మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన రెసిపీని పరిచయం చేస్తున్నాం. మీరు బ్రెడ్ ఆమ్లెట్ రుచి చూసి ఉంటారు, మరి ఎప్పుడైనా మసాలా ఆమ్లెట్ బన్ రుచి చూశారా? మసాలా ఆమ్లెట్ బన్ అనేది బ్రెడ్, బటర్, ఎగ్ ఈ మూడింటిని కలిపి తయారు చేసుకునే ఒక పసందైన అల్పాహారం.
గుడ్లు, ఉల్లిపాయలు, టొమాటోలు, సువాసనగల సుగంధ ద్రవ్యాలు అన్ని కలిపి ఒకసారి మసాలా బన్ ఆమ్లెట్ చేసుకొని తినండి.. దీని సువాసన, రుచికి మిమ్మల్ని మీరు మైమరిచిపోతారు. చల్లటి ఉదయాన వెచ్చటి, మెత్తటి మసాలా బన్ ఆమ్లెట్ మీ నోట్లో నానుతుంటే స్వర్గపు అంచులదాకా వెళ్లిపోతారు. ఇక, ఆలస్యం చేయకుండా వెంటనే మసాలా ఆమ్లెట్ బన్ తయారు చేసుకోవటం ఎలాగో, ఏమేం కావాలో తెలుసుకోండి. మసాలా ఆమ్లెట్ బన్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం, చూడండి.
Masala Omelette Bun Recipe కోసం కావలసినవి
- 3 గుడ్లు
- 1/2 ఉల్లిపాయ
- 1 టమోటా
- 2 పచ్చి మిరపకాయలు
- 3 టేబుల్ స్పూన్లు ఆలివ్ నూనె
- 2 టేబుల్ స్పూన్లు వెన్న
- ఉప్పు , కారం (రుచికి తగినంత)
- తాజా కొత్తిమీర
- స్ప్రింగ్ ఆనియన్స్
- చీజ్ లేదా జున్ను కొద్దిగా
- బర్గర్ బన్
మసాలా ఆమ్లెట్ బన్ తయారీ విధానం
- ముందుగా ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయండి.
- చిన్న మంట మీద వీటిని నూనెలోనే ఉడికించండి.
- తర్వాత ఒక గిన్నెలో గుడ్లు పగలగొట్టి, ఉప్పు కారం వేసుకొని వాటిని బాగా గిలకొట్టండి.
- అనంతరం ఉడుకుతున్న ఉల్లిపాయ, టొమాటో ముక్కలు ఉంచిన పాన్‌లో గుడ్డు మిశ్రమం కలపండి.
- మరొక పాన్‌లో వెన్నను వేడి చేసి ఆ వెన్నను గుడ్డు మిశ్రమంలో కలిపేయండి.
- ఇప్పుడు గుడ్డుపై తాజా కొత్తిమీర ఆకులు, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు, తురిమిన చీజ్ చల్లి కాసేపు ఫ్రై చేయండి.
- ఆపై టోస్ట్ చేసిన బన్నుతో కలిపి సర్వ్ చేసుకోండి.
మసాలా ఆమ్లెట్ బన్ రెసిపీ రెడీ అయింది. వేడివేడిగా తింటూ దీని రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం