Dragon Fruit: రోజుకి ఒక అరముక్క డ్రాగన్ ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి, ఈ వ్యాధులన్నీ అదుపులో ఉంటాయి-make a habit of eating dragon fruit daily and all these diseases will be controlled ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dragon Fruit: రోజుకి ఒక అరముక్క డ్రాగన్ ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి, ఈ వ్యాధులన్నీ అదుపులో ఉంటాయి

Dragon Fruit: రోజుకి ఒక అరముక్క డ్రాగన్ ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి, ఈ వ్యాధులన్నీ అదుపులో ఉంటాయి

Haritha Chappa HT Telugu
Oct 08, 2024 04:30 PM IST

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ ఖరీదైన పండే, కానీ ఆరోగ్యాన్ని కూడా అంతే పరిమాణంలో అందిస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మధుమేహం నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో సమస్యలు అదుపులో ఉంటాయి.

డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు
డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగాలు (Pixabay)

డ్రాగన్ ఫ్రూట్ ని చూడగానే అది ధనవంతుల పండుగా భావిస్తారు. నిజానికి ఈ పండుకు ఎంత ఖర్చు పెట్టి తిన్నా మంచిదే. ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ ను పిటాయా అని పిలుస్తారు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడం, మధుమేహం అదుపులో ఉండడం, మెరుగైన జీర్ణ క్రియ, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటం వంటి ఎన్నో సుగుణాలు ఇందులో ఉన్నాయి.

డ్రాగన్ ఫ్రూట్ పసుపు, పింక్, తెలుపు రంగుల్లో లభిస్తుంది. ఏ రంగులో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అయినా ఆరోగ్యానికి మేలే చేస్తుంది. రోజుకో అర ముక్క డ్రాగన్ ఫ్రూట్ తినడం అలవాటు చేసుకోండి. ఎంతో మేలు జరుగుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల క్యాలరీలు తక్కువగా శరీరంలో చేరుతాయి. దీనిలో కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇతర భోజనాలు అతిగా తినడం తగ్గిస్తాము. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే బీటా సైనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇన్సులిన్ నిరోధకతను, కొవ్వు కాలేయ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇవి కణాలను దెబ్బతీయకుండా కాపాడతాయి. క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా రాకుండా అడ్డుకుంటాయి. చర్మంలో కొల్లాజెన్ ఏర్పడడానికి ప్రోత్సహిస్తుంది. ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి అకాల వృద్ధాప్యం రాకుండా అడ్డుకుంటుంది.

చర్మం మెరిసిపోవాలన్నా, చర్మంపై ముడతలు, గీతలు వంటివి రాకుండా ఉండాలన్నా డ్రాగన్ ఫ్రూట్ ను అధికంగా తినాలి. డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఏర్పడడానికి సహాయపడుతుంది. చర్మంలో సాగే గుణాన్ని అందిస్తుంది. దీనివల్ల ముడతలు రాకుండా ఉంటాయి.

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్... పెరుగు లాగే ప్రోబయోటిక్ గా ఉపయోగపడుతుంది. ఈ పండులో ఉండే ఫైబర్ కంటెంట్ పూర్తిగా జీర్ణం కాదు. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని పెంచడానికి ఇది చాలా అవసరం.

మధుమేహం ఉన్నవారు డ్రాగన్ ఫ్రూట్ ను కచ్చితంగా తినాలి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. ప్రీ డయాబెటిస్ తో బాధపడుతున్న వారు కచ్చితంగా డ్రాగన్ ఫ్రూట్ ను ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మీరు డయాబెటిక్ గా మారకుండా ఉంటారు.

డ్రాగన్ ఫ్రూట్లో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. ఆర్థరైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు డ్రాగన్ ఫ్రూట్ ను కచ్చితంగా తినాలి. పిల్లలకు డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం ఎంతో మంచిది.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి డ్రాగన్ ఫ్రూట్ ఎంతో ఉపయోగపడుతుంది. హృదయ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో ఈ పండు ముందుంటుంది. చిన్న పేగుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. డెంగ్యూ, కొన్ని ఫంగస్ వ్యాధులు బారిన పడకుండా ఈ పండు రక్షణ వలయంగా నిలుస్తుంది.

Whats_app_banner