Korrala Pulao: కొర్రల పులావ్ రెసిపీ, డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ లంచ్ ఎంపిక
Korrala Pulao: డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రుచికరమైన ఆహారాన్ని తినాలంటేనే భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి కొర్రలతో చేసిన పులావ్ ఎంతో నచ్చుతుంది. కొర్రలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
Korrala Pulao: డయాబెటిస్ ఉందని నోరు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. టేస్టీ వంటకాలను ఆరోగ్యకరంగా వండుకోవచ్చు. ఇక్కడ మేము కొర్రల పులావ్ రెసిపీ ఇచ్చాము. కొర్రలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచడంలో ముందుంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఐరన్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి కొర్రల పులావును డయాబెటిస్ ఉన్నవారు లంచ్ లో లేదా రాత్రి డిన్నర్ లో తినేందుకు ప్రయత్నించండి. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
కొర్రల పులావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
కొర్రలు - ఒక కప్పు
నీళ్లు - సరిపడినన్ని
నూనె - రెండు స్పూన్లు
స్వీట్ కార్న్ - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - రెండు
జీలకర్ర - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
పసుపు - అర స్పూను
కారం - అర స్పూను
క్యారెట్ - ఒకటి
పచ్చి బఠానీలు - గుప్పెడు
క్యాప్సికం తరుగు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కొర్రల పులావ్ రెసిపీ
1. కొర్రలను ముందుగానే శుభ్రంగా కడిగి గంటపాటు నీటిలో నానబెట్టుకోండి.
2. తర్వాత ఆ నీటిని వంపేసి కొర్రలను ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి.
3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయండి.
4. ఆ నూనెలో జీలకర్రను వేసి వేయించండి.
5. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను, వెల్లుల్లి రెబ్బలను వేసి రంగు మారేవరకు వేయించుకోండి.
6. ఆ మిశ్రమంలోనే పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా వేయించండి.
7. ఆ తర్వాత ముక్కలుగా కోసుకున్న స్వీట్ కార్న్, క్యారెట్లు, క్యాప్సికమ్, పచ్చి బఠానీలను వేసి వేయించుకోండి.
8. అవన్నీ బాగా ఉడికాక ముందుగా కడిగి పెట్టుకున్న కొర్రలు వేసి ఓ రెండు నిమిషాలు చిన్న మంట మీద వేయించండి.
9. అవి ఉడకడానికి సరిపడా నీటిని వేయండి.
10. రుచికి సరిపడా ఉప్పును కలపండి.
11. పైన కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి.
12. మూత తీసాక కొత్తిమీర ఆకులను పైన చల్లుకోండి.
13. కాస్త నీరు ఉన్నట్టు అనిపిస్తే చిన్న మంట మీద మరొక ఐదు నిమిషాలు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే టేస్టీ కొర్రల పులావ్ రెడీ అయినట్టే.
14. దీన్ని చికెన్ కర్రీతో తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిని చూడండి. అందరికీ నచ్చడం ఖాయం.
డయాబెటిస్ ఉన్నవారే కాదు, డయాబెటిస్ లేని వారు కూడా కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కొర్రలను తరచూ తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు వంటివి రావు. కాబట్టి ఆర్థరైటిస్‌తో బాధపడేవారు కూడా కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కొర్రల్లో ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి కొర్రలను తరచూ తింటే రక్తహీనత సమస్య రాదు. ఇలా కొర్రల పులావ్‌ను వండి పిల్లలకు తినిపించడం చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకుంటున్నా వారు కొర్రల పులావ్‌ను ప్రయత్నించండి.