Kobbari Karam Podi: ఇడ్లీ, దోశెల్లోకి కొబ్బరి కారంపొడి రెసిపీ ఇదిగోండి, టేస్టీగా ఉంటుంది-kobbari karam podi recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kobbari Karam Podi: ఇడ్లీ, దోశెల్లోకి కొబ్బరి కారంపొడి రెసిపీ ఇదిగోండి, టేస్టీగా ఉంటుంది

Kobbari Karam Podi: ఇడ్లీ, దోశెల్లోకి కొబ్బరి కారంపొడి రెసిపీ ఇదిగోండి, టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
May 27, 2024 06:00 AM IST

Kobbari Karam Podi: కొబ్బరి కారం పొడి ఒకసారి చేసుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశెల్లోకి టేస్టీగా ఉంటుంది. అన్నంలో కూడా వేసుకొని తినవచ్చు.

కొబ్బరి కారం పొడి రెసిపీ
కొబ్బరి కారం పొడి రెసిపీ

Kobbari Karam Podi: ఇడ్లీ, దోశెల్లోకి ఎన్ని చట్నీలు ఉన్నా పక్కన కారంపొడి ఉంటేనే తినాలనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కారంపొడి చేసుకోలేని వారు ఒక్కసారే చేసుకొని డబ్బాల్లో దాచుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలాంటి కారంపొడి కాకుండా ఈసారి కొబ్బరి కారంపొడి ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి కారం చేసుకున్నారంటే ఎన్ని ఇడ్లీలు అయినా తినాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలో ఈ కొబ్బరి కారం పొడి వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుంటే ఆ రుచి అదిరిపోతుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.

కొబ్బరి కారం పొడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఎండుమిర్చి - 15

వెల్లుల్లి రెబ్బలు - ఏడు

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఎండు కొబ్బరి ముక్కలు - పావు కిలో

కొబ్బరి కారం పొడి రెసిపీ

1. కొబ్బరి కారం చేసేందుకు ఎండు కొబ్బరిని మాత్రమే వినియోగించాలి.

2. పచ్చి కొబ్బరి వల్ల కొబ్బరిపొడి సరిగా రాదు. అందులో తేమదనం ఉంటుంది. కాబట్టి అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది.

3. ఎండు కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వాటిని వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి.

5. పది నిమిషాలు కలిపాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చిని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి.

8. అంతే కొబ్బరి కారంపొడి రెడీ అయినట్టే. దీన్ని ఒక సీసాలో ఉంచుకుంటే నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది.

9. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.

పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి రుచిగా ఉంటుంది. ఇది ఆహారం రుచిని పెంచడమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎండు కొబ్బరిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, క్యాల్షియం, మాంగనీస్చ, ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం ఎండు కొబ్బరిలో లభిస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి కొబ్బరిని ఎండబెట్టి ఎండు కొబ్బరిగా మార్చి పొడి చేసుకొని ఇంట్లో దాచుకుంటే ఉత్తమం. దీన్ని అప్పుడప్పుడు కూరల్లో వేసుకుంటే ఇంకా మంచిది.

Whats_app_banner