Palli karam podi: ఇడ్లీల్లోకి, దోశెల్లోకి పల్లీ కారంపొడి ఇలా చేసుకోండి, స్పైసీగా అదిరిపోతుంది
Palli karam podi: ఇడ్లీతో చట్నీ కంటే కారంపొడిని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. అలాగే దోశెల పైన కారంపొడిని చల్లుకుంటే ఆ రుచే వేరు. పల్లీ కారం పొడి రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Palli karam podi: తెలుగువారికి సంపూర్ణ భోజనం అంటే అందులో కూరలు, పప్పులు, పచ్చళ్ళతో పాటు ఆవకాయ, కారంపొడులు వంటివి ఉండాలి. ఇడ్లీతో కారంపొడి తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. దోశెల పైన కూడా కారం పొడి చల్లుకొని అర స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. ఇంట్లోనే పల్లీ కారంపొడిని తయారు చేసుకోండి. ఇడ్లీ, దోశ చేసుకున్నప్పుడు వాటితో కలిపి తింటే అదిరిపోతుంది. అంతేకాదు వేడివేడి అన్నంలో ఈ పల్లీ కారంపొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు. పల్లీ కారంపొడి తయారు చేయడం కూడా చాలా సులువు.
పల్లీ కారంపొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
వేరుశనగ పలుకులు - ఒక కప్పు
ఎండుమిర్చి - 15
ధనియాలు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - 15
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
జీలకర్ర- అర స్పూను
పల్లి కారంపొడి రెసిపీ
1. స్టవ్ కళాయి మీద పెట్టి వేరుశనగ పలుకలను వేయించాలి.
2. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేయించుకోవాలి.
3. వీటిని బాగా వేయించాక స్టవ్ కట్టేయాలి.
4. వీటన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసి పొడిలా చేసుకోవాలి.
5. అలాగే వెల్లుల్లి రెబ్బలను ముందుగా వేయించుకున్న వేరుశెనగ పలుకులను రుచికి సరిపడా ఉప్పును వేసి మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. అంతే కారంపొడి రెడీ అయినట్టే.
6. దీన్ని గాలి చొరబడని ఒక గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి.
7. ఇది ఎన్ని నెలలైనా తాజాగా ఉంటుంది.
8. ఇడ్లీ తినే ముందు ఓ రెండు స్పూన్లు వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.
9. అలాగే దోశెలు వేసినప్పుడు పైన ఈ పల్లీకారాన్ని చల్లి అర స్పూను నెయ్యిని కూడా వేసి దోశెలు సర్వ్ చేయండి. తినేవారు ఆహా అనకుండా ఉండలేరు.
ఇందులో మనం ముఖ్యంగా వాడింది వేరుశెనగ పలుకులు. ఇవి చాలా బలమైన ఆహారం. అవి నూనె నిండిన గింజలు. అంటే వీటిలో నూనె శాతం ఎక్కువ. పల్లీల నూనె ఎంత బలవర్ధకమో అందరికీ తెలిసిందే. వేరుశనగ పలుకులను తినడం వల్ల ఆ నూనె కూడా శరీరంలో చేరుతుంది. వేరుశనగ పలుకులను ఒక కోడి గుడ్డుతో సమానంగా చూడవచ్చు. అందులో ఎన్ని పోషకాలు ఉంటాయో వేరుశనగ పలుకుల్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయి. వీటిని అధికంగా వాడేది భారత్, చైనాలోని. వీటిని మితంగా వాడిన వరకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు పెరగకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే వేరుశనగలో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరం అభివృద్ధికి అవసరం. పొట్ట క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకోవడంలో పల్లీలు ముందుంటాయి. దీనిలో విటమిన్ ఈ కూడా అధికంగా ఉంటుంది. మన చర్మం మెరుపుకు విటమిన్ ఈ చాలా అవసరం. కాబట్టి వేరుశెనగ పలుకులతో చేసే ఈ పల్లికారాన్ని ఎంచక్కా తినండి. ఇడ్లీ దోసెల్లో వేసుకుని తింటే రుచి అదిరిపోవడంతో పాటు ఆరోగ్యకరం కూడా.
టాపిక్