Healthy Snacking: దీపావళి పిండివంటలతో బరువు పెరగొద్దంటే? ఈ ట్రైల్ మిక్స్‌లు ప్రయత్నించండి..
Healthy Snacking: తక్షణ శక్తిని, ఆరోగ్యాన్నిచ్చే ట్రైల్ మిక్స్ గురించి విన్నారా? వాటిని ఇంట్లోనే వివిధ రుచుల్లో తయారు చేసుకోవచ్చు. వాటి లాభాలేంటో వివరంగా తెలుసుకోవాల్సిందే.
పండుగల సీజన్ అంటే ఇంట్లో రకరకాల చిరుతిండ్లు అందుబాటులో ఉంటాయి. జంతికలు, మురుకులు, పూర్ణాలు, అప్పడాలు.. ఇలా రకరకాల చిరు తిండ్లను ఇండ్లలో తయారు చేసి పెడుతుంటారు. ఇలా నూనెల్లో వేయించిన వాటిని తినీ తినీ పండగ సీజన్ అయ్యే పాటికి మనం కచ్చితంగా బరువు పెరిగిపోతుంటాం. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారైతే.. హెల్దీగా చిరుతిండ్లను తినాలని అనుకుంటున్నట్లయితే ఇప్పుడు ట్రల్ మిక్స్లనే స్నాక్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి.
ఏమిటీ ట్రైల్ మిక్స్‌లు ?
ట్రైల్ మిక్స్ అనేది ఒక రకమైన స్నాక్స్ మిక్స్ అన్న మాట. ఇందులో రకరకాల డ్రై ఫ్రూట్స్, గింజలు, గ్రనోలా, ఇంకా కొన్ని క్యాండీలు అన్నీ కలిపి ఒక డబ్బాలా తయారు చేస్తారు. ఇది ముఖ్యంగా హైకింగ్, ట్రెక్కింగ్ చేసే వారి కోసం తయారు చేసిన స్నాక్. వారు చాలా ఎక్కువ దూరాలు కొండలు ఎక్కుతూ హైకింగ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వారు కూడా బ్యాగ్‌లో తీసుకెళ్లాలంటే తక్కువ బరువు ఉండి, ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థాలు అయి ఉండాలి. అందుకోసమే ఈ ట్రైల్ మిక్స్‌లను తయారు చేశారు.
ఇందులో ఉండే క్యాండీలు, గ్రనోలా లాంటివి.. పిండి పదార్థాలను, కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే వీటిలో ఉండే కొవ్వులు, విటమిన్‌లు, పోషకాలు, పీచు పదార్థాలు తదితరాలు వీరిని బలంగా ఉంచి ఎక్కువ సమయం ఆకలి కానివ్వకుండా చూస్తాయి. ఇది మన దగ్గర ఇప్పుడిప్పుడు ఆదరణ పొందుతోంది కానీ 1910 నుంచి దీని వాడకం ఉండేదట. అప్పుడు కేవలం చాక్లెట్, ఎండు ద్రాక్షలు రెండింటినీ కలిపి దీన్ని తయారు చేసేవారు. ఇప్పుడు మాత్రం క్యాలరీలు, ప్రొటీన్‌లు, ఫైబర్‌లతోపాటు విటమిన్లు, మినరళ్లు ఉండేలా వీటిని తయారు చేస్తున్నారు.
ఇంట్లోనే ట్రైల్ మిక్స్ తయారీ :
డ్రై ఫ్రూట్స్, గింజలు, విత్తనాలతో కలిపి కొన్ని చాక్లెట్ ముక్కలు, గ్రనోలా, పాప్‌కార్న్ లాంటి వాటిని చేర్చుకుని దీన్ని తయారు చేసుకోవాలి.
ఎండు ద్రాక్ష, అంజీరా లాంటి డ్రై ఫ్రూట్స్‌ని ఒక కప్పు తీసుకోవాలి. గుమ్మడి గింజలు, అవిశె గింజలు, ప్రొద్దు తిరుగుడు గింజల్లాంటి వాటిని ఒక కప్పు చొప్పున తీసుకోవాలి. బాదం, జీడిపప్పు, వేరు శెనగ గుళ్లు లాంటి నట్స్‌ని ఒకటిన్నర కప్పుల వరకు తీసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి రోస్ట్ చేసుకుని కరకరలాడేలా చేసుకోవాలి. అన్నింటినీ ఒక గిన్నెలో వేసి డార్క్ చాక్లెట్, పాప్ కార్న్ లాంటి ఫన్ స్టఫ్‌ని అర కప్పు వరకు వేసుకోవాలి. అందులోకి కాస్త సముద్రపు ఉప్పు, దాల్చిన చెక్క పొడిని వేసుకుని బాగా కలుపుకుని డబ్బాలో వేసుకోవాలి. అంతే ట్రైల్ మిక్స్ తయార్.