Night Shift Care: రాత్రి షిఫ్టుల్లో పని చేస్తున్నారా? ఈ 3 జాగ్రత్తలు తప్పనిసరి
Night Shift Care: రాత్రి షిఫ్టుల్లో పని చేసేవారు ఆరోగ్య పరంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే. లేదంటే ఆరోగ్యం చిత్తవుతుంది.
ఉరుకుల పరుగుల జీవన విధానంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మనం కొన్ని సార్లు పని చేయాల్సి ఉంటుంది. ప్రకృతి సహజ సిద్ధమైన ధర్మానికి విరుద్ధంగా రాత్రిళ్లు మేల్కొని ఉండి నైట్ షిఫ్టుల్లో పని చేయాల్సిన అవసరం ప్రస్తుతం చాలా మందికి ఉంది. అయితే రాత్రి నిద్ర లేకపోవడం అనేది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జీవన విధానాన్ని మార్చుకోవాలి. లేదంటే ఆరోగ్యం చిత్తయ్యే ప్రమాదం ఉంటుంది.
1. ఒకటే షిఫ్టును అనుసరించండి :
కొన్ని కార్యాలయాల్లో కొన్ని సార్లు పగలు షిఫ్టులు, కొన్ని సార్లు రాత్రి షిఫ్టులు ఉంటాయి. మరి కొన్ని సార్లు తెల్లవారు జాము షిఫ్టులూ ఉంటాయి. ఇలా రక రకాల షిఫ్టుల్లో పని చేస్తూ ఎప్పుడు వీలైతే అప్పుడు పడుకోవడం వల్ల జీవ గడియారం దారుణంగా దెబ్బ తింటుంది. అలా కాకుండా రాత్రి షిఫ్టులో పని చేయాల్సి వస్తే అలా రాత్రి షిఫ్టును మాత్రమే ఉంచమని మీ కార్యాలయానికి రిక్వెస్ట్ పెట్టుకోండి. ఎప్పుడూ ఒకే సమయంలో పడుకోవడం, ఒకే సమయంలో లేవడం చేయండి. సెలవు దినాలు, ఆదివారాల్లోనూ దాదాపుగా ఇలాంటి జీవన విధానాన్నే అనుసరించండి. ఇలా చేయడం వల్ల కొంతలో కొంత చెడు ప్రభావాలు తగ్గుతాయి.
2. ప్రణాళిక వేసుకోండి :
రోజు వారీ రొటీన్ని తయారు చేసుకోండి. ఏ సమయంలో ఏం చేయాలనే దానిపై సమయ పాలనపై దృష్టి పెట్టండి. వాటిని రోజూ అలాగే అనుసరించే ప్రయత్నం చేయండి. మధ్యలో అవసరం అయినప్పుడు చిన్న పాటి కునుకులు వేయండి. నిద్ర లేచిన తర్వాత మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకునేందుకు ఇష్టమైన పనులు చేయండి. యోగా, ధ్యానం, వ్యాయామాల్లాంటి వాటిని క్రమం తప్పకుండా రోజూ చేసుకునే ప్రయత్నం చేయండి.
3. మంచి నిద్ర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి :
పగటి పూట నిద్ర పోయే వారు గది వాతావరణాన్ని అందుకు అనువుగా ఏర్పరుచుకునే ప్రయత్నం చేయండి. పక్కను పరిశుభ్రంగా ఉంచడం, గది కిటికీలకు మందపాటి పరదాలు వేసుకోవడం, గదిని చీకటి చేసుకోవడం లాంటి విషయాలపై ప్రధానంగా దృష్టి పెట్టండి. ఇలా నైట్ షిఫ్టులు చేసుకునే వారిలో ఎక్కువగా స్లీప్ డిజార్డర్లు, నిద్ర లేమి లాంటి సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. అందుకనే ఇలాంటి వారు నిద్ర పోయేప్పుడు కచ్చితంగా గది చీకటి చేసుకోవాలి. రాత్రి లాంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి. అప్పుడు మాత్రమే వీరి జీవ గడియారం సర్దుబాటు అయి కొంత వరకు మీకు, మీ ఆరోగ్యానికి సహకరించ గలుగుతుంది.