Signs Of High BP: ఉదయాన్నే ఈ లక్షణాలుంటే.. అధిక రక్త పోటుకు సూచనలు కావచ్చు..-know what are the early morning symptoms of high blood pressure ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Signs Of High Bp: ఉదయాన్నే ఈ లక్షణాలుంటే.. అధిక రక్త పోటుకు సూచనలు కావచ్చు..

Signs Of High BP: ఉదయాన్నే ఈ లక్షణాలుంటే.. అధిక రక్త పోటుకు సూచనలు కావచ్చు..

Koutik Pranaya Sree HT Telugu
Nov 26, 2023 01:30 PM IST

Signs Of High BP: ఉదయం లేవగానే మన శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలతో హైబీపీని గుర్తించొచ్చు. సరైన సమయంలో వైద్యుల్ని సంప్రదించి వైద్యం మొదలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ లక్షణాలేంటో మీరూ తెల్సుకోండి.

హైబీపీ లక్షణాలు
హైబీపీ లక్షణాలు (freepik)

అధిక రక్త పోటునే హైపర్‌ టెన్షన్‌ అనీ పిలుస్తారు. అంటే రక్తం ధమనుల నుంచి ప్రవహించడానికి అవసరమైన ఒత్తిడి.. ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉందని అర్థం. దీన్ని ప్రాథమికంగా గుర్తించడం కాస్త కష్టంగా ఉంటుంది. చాలా మందిలో పెద్దగా లక్షణాలు కూడా కనిపించవు. అందుకనే దీన్ని సైలెంట్‌ కిల్లర్ అనీ అంటుంటారు. సమస్య ఎక్కువ అయిన తర్వాత ఇది బయటపడే అవకాశాలు ఉంటాయి. అయితే ఉదయాన్నే ఎవరికైనా ఈ కింది లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే చాలా మందిలో ఈ లక్షణాలు ఉదయం పూట కనిపిస్తాయి. సమయం గడిచే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి. అలా తగ్గిపోతున్నాయి కదా అని అశ్రద్ధ వహిస్తే ఊహించని నష్టం వాటిల్లవచ్చు.

తరచుగా తల నొప్పులు :

కొందరిలో ఉదయాన్నే తలనొప్పి కనిపిస్తూ ఉంటుంది. ఏవైనా మాత్రలు వేసుకుంటే తగ్గి కొద్ది సమయం తర్వాత మళ్లీ వస్తుంటాయి. తల అంతా దిమ్ముగా ఉన్నట్లు ఉంటూ ఉంటుంది. ఇది మరీ తీవ్రంగా కాకపోయినా చాలా సార్లు ఒక మాదిరిగా ఉంటుంది. ఇలాంటి తల నొప్పులు బహుశా లోపల అధిక రక్త పోటు లక్షణాలు అయి ఉండొచ్చు. కాబట్టి వీటిని తేలికగా తీసుకోకండి. అనుమానంగా అనిపిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లి ఒక సారి బీపీని చెక్‌ చేయించుకోండి.

తల తిరగడం :

ఉదయాన్నే తల తిరగడం, తల దిమ్ముగా ఉండటం, శరీరం ఊగుతున్నట్లుగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నట్లయితే అది అధిక రక్త పోటుకు సూచన కావొచ్చు. రక్త ప్రసరణలో తేడా రావడం వల్ల ఇలాంటివి ఉత్పన్నం అవుతాయి.

దృష్టి మందగించడం :

ఉదయాన్నే కళ్లు సరిగ్గా కనిపించక పోవడం కూడా అధిక రక్త పోటు లక్షణం. నరాల్లో అధికంగా ఒత్తిడి ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. కళ్ల దగ్గర నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ ఒత్తిడి కారణంగా అవి ప్రభావితం అయి కళ్లు మసక బారినట్లుగా అనిపిస్తాయి. అకస్మాత్తుగా ఇలా దృష్టి మందగించినట్లు అనిపించినా, లేదా ఉదయాన్నే ఇలాంటి భావన కలుగుతున్నా సరే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఏ మాత్రమూ అజాగ్రత్తగా ఉండకూడదు. ఎందుకంటే ఇవి ఒక్కోసారి ప్రాణ హానిని కూడా కలిగించేంత ప్రమాదకరమైనవి కావొచ్చు. అధిక రక్త పోటును తొందరగా గుర్తిస్తే చికిత్సలు ప్రారంభించడం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. లేకపోతే గుండె జబ్బులు, గుండె పోటు లాంటి ప్రాణాంతక పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది.

Whats_app_banner