Benefits of Yoga: యోగాతో టాప్ 8 ప్రయోజనాలివే! ఇవి తెలిస్తే వెంటనే మొదలెట్టేస్తారు..
Benefits of Yoga: యోగా ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాదు. దానివల్ల శారీరకంగా, మానసికంగా బోలెడు లాభాలున్నాయి. అవేంటో మీరూ తెలుసుకోండి.
శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచీ దీన్ని అభ్యసిస్తూ వస్తున్నారు. అందుకనే ఇది ప్రపంచ దేశాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. మరి ఇలాంటి యోగాను రోజు వారీ వ్యాయామంలో భాగం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో టాప్ ఎనిమిది ఉత్తమ ప్రయోజనాలు ఏంటనేది తెలుసుకుందాం.
యోగా ఉపయోగాలు :
1. భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇందులో రకరకాల యోగాసనాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా శ్వాస కోస సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు ఇమిడి ఉంటాయి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస లాంటి వాటి వల్ల మానసిక ప్రశాంతతా చేకూరుతుంది. ఒక యోగాభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా, ఉన్నతులుగా మారొచ్చని ప్రాచీన యోగ శాస్త్రాలు చెబుతున్నాయి.
2. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల అకారణంగా మనం ఎదుటి వారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటి వాటిని మనసులో నింపుకోకుండా ఉంటాం. దీంతో మనకు మనమే చాలా ఆరోగ్యంగా ఉంటాం.
3. కొందరికి చేస్తున్న పనులపై అస్సలు ఆసక్తి ఉండదు. అలాంటి వారు యోగా చేయడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి.
4. ఇది పారా సింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. అందువల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ఏ పనినైనా గాబరా పడిపోకుండా నిదానంగా చేసేందుకు ప్రయత్నిస్తాం. దీంతో ఆందోళన లేకుండా జీవనం గడపగలుగుతాం. రిలాంక్సింగ్‌గా ఉండ గలుగుతాం.
5. యోగా మన కండరాలను దృఢంగా మారుస్తుంది. దీంతో మనం శారీరకంగా శక్తివంతులుగా ఉంటాం. నీరసం లాంటివి దరి చేరవు.
6. ఈ ప్రక్రియ వల్ల శారీరకంగా, మానసికంగా ఉన్న వ్యర్థాలు బయటకు నెట్టివేయబడతాయి. అందువల్ల మనం నిర్మలంగా ఉండగలుగుతాం.
7. యోగాలో ధ్యానమూ ఒక భాగం. ఇది విశ్వ శక్తితో మన ప్రాణ శక్తిని అనుసంధానం చేస్తుంది. అందువల్ల మన జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తాయి. ఎక్కువ ప్రాణ శక్తి మనకు లభించడం వల్ల కొన్ని వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయి.
8. యోగాభ్యాసాన్ని తీవ్రతరం చేసే కొద్దీ అది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతుల్ని చేస్తుంది. ఈ సమయంలో మాత్రం సాధారణ యోగా టీచర్లను కాకుండా కాస్త నిపుణులను గురువులుగా స్వీకరించాల్సి ఉంటుంది. సుశిక్షితులైన వారి ద్వారా మన కుండలినీ శక్తికి సంబంధించిన యోగాభ్యాసాలను చేయగలుగుతాం. ఇది యోగాభ్యాసంలో అత్యున్నతమైన శిక్షణా స్థితి అని చెప్పవచ్చు.
టాపిక్