Painless Waxing: వ్యాక్సింగ్ చేసేటప్పుడు నొప్పి రావొద్దా? ఈ పని చేయండి చాలు-know these tips must for painless waxing in beauty parlour ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Painless Waxing: వ్యాక్సింగ్ చేసేటప్పుడు నొప్పి రావొద్దా? ఈ పని చేయండి చాలు

Painless Waxing: వ్యాక్సింగ్ చేసేటప్పుడు నొప్పి రావొద్దా? ఈ పని చేయండి చాలు

Koutik Pranaya Sree HT Telugu
Oct 23, 2024 10:30 AM IST

Painless Waxing: వ్యాక్సింగ్ చేసేటప్పుడు నొప్పి కొందరు అస్సలు భరించలేరు. దానికి కొన్ని తప్పులు కారణం. అవేంటో తెల్సుకుని జాగ్రత్త పడితే మరోసారి వ్యాక్సింగ్ అంటే భయపడాల్సి రాదు. అవేంటో తెల్సుకోండి.

వ్యాక్సింగ్ చేసేటప్పుడు నొప్పి రాకుండా చిట్కాలు
వ్యాక్సింగ్ చేసేటప్పుడు నొప్పి రాకుండా చిట్కాలు (Shutterstock)

కాళ్లు, చేతుల మీద పెరిగే రోమాలను తొలగించడానికి చాలా మంది వ్యాక్సింగ్ చేయించుకుంటారు. అందం కోసం చేయించుకునే వ్యాక్సింగ్ వల్ల నొప్పి కూడా భరించాల్సి వస్తుంది. కొంతమందికైతే కళ్లలో నుంచి నీళ్లు కూడ ఆగకుండా వస్తుంటాయి. కొందరు వ్యాక్సింగ్ పేరు వింటేనే భయపడతారు కూడా. అయితే ఈసారి వ్యాక్సింగ్ చేయించుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించండి. నొప్పి తగ్గిస్తాయి.

వేడినీటి స్నానం:

వ్యాక్సింగ్ చేయించుకునే ముందు వేడి నీటి స్నానం చేయడం చాలా మట్టుకు నొప్పిని తగ్గిస్తుంది. స్నానం చేయడం కుదరకపోతే వేడి నీటిలో ఒక వస్త్రం ముంచి చేతులు, కాళ్ల మీద కాసేపు మర్దనా చేస్తూ రాసుకొని తర్వాత వ్యాక్సింగ్ చేయించుకోండి. వేడి నీటి వల్ల చర్మం రంధ్రాలు తెరుచుకుంటాయి. దీంతో వెంట్రుకలు తొందరగా ఊడి వచ్చేస్తాయి. దానివల్ల నొప్పి ఎక్కువగా అనిపించదు. అలా కాకుండా పార్లర్ వెళ్లే ముందు చల్లటి నీటితో గనక చేతులు, కాళ్లు కడుక్కుంటే చర్మం రంధ్రాలు మూసుకుపోయి వ్యాక్సింగ్ నొప్పి విపరీతంగా అనిపించొంచ్చు.

స్క్రబ్బింగ్:

వ్యాక్సింగ్ కు ముందు స్క్రబ్బింగ్ చేయడం కూడా సహాయపడుతుంది. ఏదైనా బాడీ స్క్రబ్ సాయంతో మెల్లగా చర్మం మీద రుద్దుతూ పేరుకున్న మృతకణాలను తొలిగించుకోండి. ఇలా చేస్తే వ్యాక్సింగ్ చేసేటప్పుడు నొప్పి తగ్గిపోతుంది. అలాగే వ్యాక్సింగ్ తర్వాత చర్మం మరింత మృదువుగా, ఆరోగ్యంగానూ కనిపిస్తుంది.

నంబింగ్ క్రీమ్:

వ్యాక్సింగ్ చేసేటప్పుడు నొప్పి కొందరు అస్సలు భరించలేరు. కానీ పెళ్లిళ్లకో, ముఖ్య వేడుకలకో వ్యాక్సింగ్ చేయించుకోవడం తప్పనిసరి అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు పార్లర్ ప్రొఫెషనల్‌ను నంబింగ్ క్రీం రాయమని అడగండి. వ్యాక్సింగ్ కన్నా కాసేపు ముందు ఈ క్రీం రాయడం వల్ల అసలు వ్యాక్సింగ్ చేసినట్లు కూడా తెలీదు. లేదంటే దీనికి బదులుగా కూలింగ్ మాయిశ్చరైజర్ రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఓసారి వ్యాక్సింగ్ చేయించుకున్నాక అదే కంటిన్యూ చేయడం మేలు. మధ్యలో షేవింగ్ చేయడం వల్ల మరోసారి వ్యాక్సింగ్ చేసుకునేటప్పుడు నొప్పి మరింత పెరుగుతుంది.

టెక్నిక్:

వ్యాక్సింగ్ సమయంలో నొప్పి ఉంటే ఒక్కోసారి వ్యాక్సింగ్ చేసే పద్ధతి కూడా కారణం కావచ్చు. కాబట్టి కాస్త ప్రొఫెషనల్ దగ్గరికి మాత్రమే దీనికోసం వెళ్లండి. వాళ్లకి చిన్న చిన్న విషయాలు కూడా సరిగ్గా తెలుస్తాయి. మృదువుగా చేయగలుగుతారు. దాంతో నొప్పి రాదు. వ్యాక్స్ ఉష్ణోగ్రత సరిగ్గా ఉంచడం, జుట్టు పెరిగే దిశ లాంటివన్నీ చూసి వ్యాక్సింగ్ చేస్తే నొప్పి సగానికి తగ్గిపోతుంది. ముఖ్యంగా వ్యాక్సింగ్ తర్వాత ఎర్రటి దద్దుర్లు లాంటివి అస్సలు రావు.

Whats_app_banner