Unwanted hair removal: ఇంట్లోనే ఇవి రాసుకుంటే.. వ్యాక్సింగ్, షేవింగ్ అవసరం లేదిక..-unwanted hair removal at home with natural home made masks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Unwanted Hair Removal: ఇంట్లోనే ఇవి రాసుకుంటే.. వ్యాక్సింగ్, షేవింగ్ అవసరం లేదిక..

Unwanted hair removal: ఇంట్లోనే ఇవి రాసుకుంటే.. వ్యాక్సింగ్, షేవింగ్ అవసరం లేదిక..

Koutik Pranaya Sree HT Telugu
May 28, 2023 09:59 AM IST

Unwanted hair removal: వ్యాక్సింగ్, షేవింగ్ తో కాకుండా సహజ పద్ధతుల్లో అవాంఛిత రోమాలు ఎలా తొలగించుకోవాలో తెలుసుకోండి. కాళ్లు, చేతులు, ముఖం మీద పెరిగే వెంట్రుకలను ఈ పూతలతో సులువుగా తగ్గించుకోవచ్చు.

ఇంట్లోనే వ్యాక్సింగ్
ఇంట్లోనే వ్యాక్సింగ్ (freepik)

ముఖం మీద, చేతుల మీద, కాళ్ల మీద పెరిగే జుట్టు తీయించుకోడానికి వ్యాక్సింగ్ లేదా షేవింగ్ ఎంచుకోవాల్సిందే. కానీ వ్యాక్సింగ్ వల్ల నొప్పి భరించడం, తరచూ పార్లర్ వెళ్లడం శ్రమతో కూడిన పనే. దానికి బదులుగా వెంట్రుకల పెరుగుదల తగ్గించే కొన్ని ప్యాక్స్ గురించి తెలుసుకోండి. వీటివల్ల వెంట్రుకల పెరుగుదల పూర్తిగా ఒకేసారి తగ్గించలేం కానీ.. తరచూ వాడుతుంటే క్రమంగా తగ్గిపోతుంది.

1. బొప్పాయి, పసుపుతో పూత:

బొప్పాయి గుజ్జులో, రెండు చెంచాల పసుపు కలపాలి. ముఖానికి, చేతులకు రాసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే చాలు. వారానికి రెండు సార్లు ఒక రెండు మూడు నెలల పాటు చేస్తుంటే క్రమంగా వెంట్రుకలు పెరగడం తగ్గుతుంది. బొప్పాయిలో పపైన్ ఉంటుంది. ఇది వెంట్రుకల పెరుగుదల ఆపుతుంది.

2. బంగాళదుంపలతో:

పెసరపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే మిక్సీ పట్టాలి. దాంట్లో బంగాళదంపను తురుముకొని తీసిన రసం కలపాలి. తేనె, నిమ్మరసం కూడా కలుపుకోవాలి. ఇది ముఖానికి, శరీరానికి రాసుకుని ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి. కాస్త ఆరాక చేతితో రుద్దుతూ కడుక్కోవాలి. బంగాళదుంపలు బ్లీచింగ్ లాగా పనిచేసి క్రమంగా వెంట్రుకల రంగు తగ్గిస్తుంది. పెసర్లు వాడటం వల్ల వెంట్రుకలు తొందరగా ఊడిపోతాయి.

3. కార్న్‌స్టార్చ్, గుడ్లు:

ఈ రెండింటితో పీల్ ఆఫ్ మాస్క్ చేసుకోవచ్చు. ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని అందులో ఒక చెంచా కార్న్‌స్టార్చ్, పంచదార కలుపుకోవాలి. ఇది చేతులకు కాళ్లకు రాసుకోవచ్చు. ఇది రాసుకున్న అరగంటకు మాస్క్ లాగా గట్టిగా, బిగుతుగా అనిపిస్తుంది. దాన్ని మెల్లగా పొరలాగా తీసేయాలి. దీనివల్ల వెంటనే వెంట్రుకలు ఊడిరావడమే కాదు, మృతకణాలు కూడా తొలిగిపోతాయి.

4. పంచదార, తేనె, నిమ్మరసం:

చెంచా పంచదార, చెంచాడు తేనె, చెంచా నిమ్మరసం కలపుకోవాలి. దీన్ని కాస్త జిగటుగా మారే వరకు వేడి చేసుకోవాలి. దీన్ని వెంట్రుకలు ఉన్నచోట రాసుకుని మీద వ్యాక్సింగ్ స్ట్రిప్ పెట్టుకోవాలి. అర నిమిషం ఉంచి లాగేయాలి. ఇది రాసుకునే ముందు పౌడర్ లేదా కార్న్ స్టార్చ్ రాసుకుంటే సులువుగా ఊడి వచ్చేస్తాయి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు.

5. శనగపిండి:

ఇది పురాతన పద్ధతి. సగం కప్పు శనగపిండిలో ఏదైనా నూనె కలపాలి. ల్యావెండర్, ఆలివ్ లేదా కొబ్బరి నూనె కలుపుకోవచ్చు. కాస్త పెరుగు కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇది కాళ్లకు, చేతులకు రాసుకుని ఇరవై నిమిషాలయ్యాక రుద్దుతూ మర్దనా చేసుకోవాలి. ఇది వెంట్రుకలతో పాటూ, చర్మం మీద పేరుకున్న జిడ్డు కూడా తొలగిస్తుంది.

Whats_app_banner