Lung cancer: మీరు ఊహించే కారణం లంగ్ క్యాన్సర్‌కు ముఖ్య కారకం కాదట.. వీటితోనే ఎక్కువ ప్రమాదం
Lung cancer: వృత్తిపరమైన ప్రమాదాల నుండి కలుషితమైన గాలికి గురికావడం వరకు, భారతీయులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కలగజేసే కొన్ని అంశాలు గురించి తెల్సుకోండి.
లాన్సెట్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ భారతీయులలో కనీసం పదేళ్లు తక్కువ వయసున్న వాళ్లకే వస్తోందని తేలింది. అలాగని పాశ్చాత్యుల కన్నా మనవాళ్లు ఎక్కువ ప్రొగ తాగుతున్నారని కాదు. పొగత్రాగే అలవాటు లేని వాళ్లని కూడా ఈ మహమ్మారి ప్రభావితం చేస్తోంది. ఆ కారణాలేంటో చూడండి.
“సాధారణంగా ధూమపానంతో ముడిపడి ఉన్న వ్యాధి అయిన ఊపిరితిత్తుల క్యాన్సర్ భారతదేశంలో మాత్రం ఒక విభిన్నమైన, ఆందోళనకర చిత్రం చూపిస్తోంది. పాశ్చాత్య దేశాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దూమపానమే ప్రధాన కారణం అయితే, ఇక్కడది వేరుగా ఉంది. భారతీయుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల్లో గణనీయమైన భాగం ఎప్పుడూ ధూమపానం అలవాటున్న వారు కాదు. ఇది ఒక ప్రశ్నను రేకెత్తిస్తోంది.” అన్నారు షాలిమార్ బాగ్ లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సజ్జన్ రాజ్ పురోహిత్.
లంగ్ క్యాన్సర్ కారణాలు:
వాయు కాలుష్యం: సైలెంట్ కిల్లర్
భారతదేశం తీవ్రమైన వాయు కాలుష్యంతో సతమతమవుతోంది, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. గాల్లో ఉండే పిఎం 2.5 (2.5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న ధూళి కణాలు) వంటి సూక్ష్మ కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకుపోయి వాపుకు కారణమవుతాయి. ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఇటువంటి కాలుష్య కారకాలకు దీర్ఘాకాలికంగా గురికావడం వల్ల ఊపిరితిత్తుల కణాలలో మార్పులకు ప్రేరేపిస్తాయి. చివరికి ఇది లంగ్ క్యాన్సర్ కు దారి తీస్తుంది. ప్రతిరోజూ కలుషితమైన గాలిని పీల్చేవారికి ధూమపానం చేయకపోయినా ప్రమాదం ఉంటుంది.
వృత్తిపరమైన ప్రమాదాలు:
భారతదేశంలోని అనేక రంగాలు కార్మికులను ఊపిరితిత్తుల క్యాన్సర్ కారకాలకు గురిచేస్తాయి. వీటిలో ఆస్బెస్టాస్, క్రోమియం, కాడ్మియం, ఆర్సెనిక్, బొగ్గు ధూళి ఉన్నాయి. మైనింగ్, కన్స్ట్రక్షన్ లాంటి కొన్ని తయారీ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కూడా ముప్పు పొంచి ఉంది.
సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్ పోజర్:
పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్ లో ధూమపానం రేటు తక్కువగా ఉన్నప్పటికీ, సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్‌పోజర్ ప్రభావం వల్ల గణనీయమైన ముప్పు ఉంది. అంటే ఇంట్లో, కుటుంబ సభ్యుల్లో లేదా ఇరుగుపొరుగులో ఎవరికైనా పొగత్రాగే అలవాటు ఉంటే అది పీల్చిన వారి మీద ప్రభావం పడుతుంది. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసేవాళ్ల వల్ల కూడా ఇతరులపై ప్రభావం ఉంటుంది. పొగ పీల్చినా కూడా పొగత్రాగినట్లే ప్రమాదం ఉంటోంది.
జన్యువులు:
ఊపిరితిత్తుల క్యాన్సర్ జన్యువుల్లో మార్పుల వల్ల కూడా రావచ్చు. జన్యువుల్లో వచ్చే వైవిధ్యాల వల్ల ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రారంభ ప్రారంభం మరియు రోగ నిర్ధారణలో సవాళ్లు:
పాశ్చాత్య దేశాల కంటే భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే వాళ్ల వయసు దశాబ్దం చిన్న. పాశ్చాత్య దేశాల్లో రోగుల వయసు 60-70 మధ్య ఉంటే, మన దేశంలో 54-70 మధ్యే ఉంటోంది. అలాగే వ్యాధి మీద అవగాహన లోపం, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వల్ల దీన్ని ఆలస్యంగా గుర్తిస్తున్నాం. ఇవన్నీ చికిత్స ఫలితాలను ప్రభావితం చేస్తాయి.
టాపిక్