periods itching: పీరియడ్స్‌లో ప్యాడ్ వల్ల దురద, మంటా? చిట్కాలు, కారణాలు ఇవే
Period rashes: పీరియడ్ సమయంలో ర్యాషెస్ చాలా సాధారణమైన సమస్య. అయితే వీటికి కొబ్బరి నూనె నుంచి ఎలా ఉపశమనం దొరుకుతుందో తెల్సుకోండి.
పీరియడ్స్ అంటేనే చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాంటిది ఆ సమయంలో పీరియడ్ ర్యాషెస్ వచ్చి మరింత ఇబ్బంది పెట్టేస్తాయి. యోని దగ్గర, తొడల లోపలి భాగంలో, వెనకాల దురద పెడుతుంది. చర్మం ఎరుపెక్కుతుంది. దురద పెట్టడం, చర్మం ఎరుపెక్కడం, ఉబ్బడం పీరియడ్ ర్యాషెస్ లక్షణాలు. అయితే వీటికి కొబ్బరి నూనె వాడితే పూర్తి పరిష్కారం ఉంటుందట. ముందుగా పీరియడ్ ర్యాషెస్ ఎందుకొస్తాయి? అవి రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? కొబ్బరి నూనెతో పాటూ మరికొన్ని చిట్కాలేంటో తెల్సుకోండి.
పీరియడ్ ర్యాషెస్ కారణాలు:
1. రాపిడి వల్ల:
శ్యానిటరీ న్యాప్‌కిన్లు, ట్యాంపన్లు వాడినప్పుడు అవి చర్మానికి తాకుతాయి. వాటి రాపిడి వల్ల ర్యాషెస్ వస్తాయి. ముఖ్యంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు కాళ్లు అటూ ఇటూ కదిలించాల్సి వస్తుంది కాబట్టి ప్యాడ్ వల్ల ర్యాషెస్ వచ్చేస్తాయి.
2. తేమ:
పీరియడ్స్ లో వచ్చే బ్లీడింగ్, చెమట వల్ల తేమగా ఉంటుంది. దానివల్ల బ్యాక్టీరియా ఎదుగుదల ఎక్కువవుతుంది. దాంతో ఇన్ఫెక్షన్ వచ్చి దురద, చర్మం ఎరుపెక్కడం జరుగుతుంది.
3. ఎలర్జీలు:
కొంతమందికి పీరియడ్స్ లో వాడే ఉత్పత్తులు పడవు. ప్యాడ్స్ లో ఉండే రసాయనాల వల్ల, కలర్లు, ఫ్రాగ్రెన్సుల వల్ల ర్యాషెస్ వస్తాయి. ఇది గమనించి మీరు వాడే ఉత్పత్తి మారిస్తేనే మేలు. కనీసం బ్రాండ్ అయినా మార్చి చూడాలి.
4. అపరిశుభ్రత:
పీరియడ్స్ సమయంలో అపరిశుభ్రత వల్ల, ప్యాడ్ ఎక్కువసేపు మార్చుకోకుండా ఉంచుకోవడం వల్ల ర్యాషెస్ రావచ్చు. కాబట్టి తరచూ వీటిని మార్చకపోతే ర్యాషెస్ సమస్య వస్తుందని గుర్తుంచుకోండి.
5. ఇన్ఫెక్షన్లు:
యీస్ట్ ఇన్ఫెక్షన్లు కూడా ర్యాషెస్ కలుగజేస్తాయి. కాబట్టి పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.
కొబ్బరి నూనె వాడొచ్చా?
కొబ్బరి నూనెకు యాంటీ మైక్రోబయల్ లక్షణాలున్నాయి. ఇది బ్యాక్టీరియా, ఫంగస్, యీస్ట్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనికున్న మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల చర్మం లోపలి పొరల్లోకీ బాగా ఇంకుతుంది. దీనివల్ల చర్మం తేమగా పొడిబారకుండా ఉంటుంది. దాంతో దురద సమస్య తక్కువవుతుంది. దీనికున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మం మీదున్న ఎరుపు దద్దుర్లు, వాపును, దురదను కాస్త తగ్గిస్తుంది. దాంతో ర్యాషెస్ తొందరగా నయం అవుతాయి.
కొబ్బరినూనె ఎలా వాడాలి?
ముందుగా యోని, చుట్టు ప్రాంతాన్ని శుభ్రంగా గాఢత తక్కువున్న సబ్బుతో కడిగేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత సమస్య ఉన్న చోట.. అంటే తొడల లోపలి భాగంలో, పిరుదుల కింది భాగంలో, ప్యాడ్ చర్మానికి తాకేచోట ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ కొబ్బరి నూనెను దూదితో నేరుగా రాసుకోవాలి. రెండు మూడు గంటలకోసారి రాసుకుంటూ ఉండొచ్చు. దాంతో తొందరగా ఉపశమనం ఉంటుంది. లేదంటే రాత్రి పూట పడుకుని రాసుకున్నా తొందరగా సమస్య తగ్గుతుంది. దురద మరీ ఎక్కువుంటే కొబ్బరి నూనెలో రెండు చుక్కల టీట్రీ నూనె లేదా ల్యావెండర్ నూనె కలిపి రాసుకోవచ్చు. దాంతో చల్లగా ఉపశమనం దొరుకుతుంది.
మరికొన్ని చిట్కాలు:
1. ర్యాషెస్ తగ్గడానికి అలొవెరా జెల్ వాడొచ్చు. చన్నీటితో కాపడం పెట్టొచ్చు.
2. పెట్రోలియం జెల్లీ రాసుకున్నా ఫలితం ఉంటుంది. ప్యాడ్ పెట్టుకోకన్నా ముందే ఇది రాసుకుంటే ఇంకా నయం.
3. ప్రతి నాలుగు నుంచి అయిదు గంటలకోసారి ప్యాడ్ తప్పకుండా మార్చుకుంటే ర్యాషెస్ రాకుండా ఉంటాయి.
4. పీరియడ్స్ ప్యాడ్స్ వల్ల ర్యాషెస్ ఎక్కువైతే ట్యాంపన్లు, మెన్‌స్ట్రువల్ కప్స్ వాడొచ్చు.