Lesson from eagle: విజయ బావుటా ఎగురవేయడానికి.. గ్రద్ధ నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠం..-know inspiring lesson from eagle motivational story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lesson From Eagle: విజయ బావుటా ఎగురవేయడానికి.. గ్రద్ధ నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠం..

Lesson from eagle: విజయ బావుటా ఎగురవేయడానికి.. గ్రద్ధ నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠం..

Koutik Pranaya Sree HT Telugu
Jun 30, 2024 05:00 AM IST

Lesson from eagle: గ్రద్ధ నేర్పే జీవిత పాఠం చాలా గొప్పది. మన ఎదుగుదల కోసం దాన్నెలా అనువర్తించుకోవచ్చో తెల్సుకుంటే మనదారి రహదారి అవుతుంది. ఎవరూ మనల్ని దెబ్బి పొడవరు.

గ్రద్ధ చెప్పే జీవిత పాఠం
గ్రద్ధ చెప్పే జీవిత పాఠం (pexels)

నిలువెత్తు బంగారం దానం చేసినా దానిలో లోపం వెతికేవాళ్లు ఉంటారు. వంద కోట్లు దానం చేసి కోటి రూపాయలు ఉంచుకుంటే నువ్వు ఉంచుకున్న కోటి గురించే మాట్లాడేవాళ్లుంటారు. వందకోట్ల దానం గురించి మాట్లాడటం వాళ్లకు అనవసరం. నువ్వు విజయం సాధించేదాకా దేనికీ పనికిరావు అన్నట్లు మాట్లాడతారు. విజయం సాధించాక.. ఇన్ని సంవత్సరాలు చదివితే ఈ ఉద్యోగమే వచ్చింది.. ఏం లాభం అంటారు. పెళ్లి గురించి, కుటుంబ సమస్యల గురించి, డబ్బు గురించి, స్థాయి గురించి.. ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి ఎవరో ఒకరు అంటూనే ఉంటారు.

మనుషుల భావోద్వేగాలకు విలువ ఇవ్వని వారికి మంచి అనవసరం. మనం సాధించలేనిది, మనలో ఉన్న లోపాన్ని మాత్రమే గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ప్రయాణిస్తున్న గమ్యంలో ఇలాంటి మాటల్ని గులకరాళ్లు అనుకొని పక్కన పడేయాలి. లేదా దాటేసి వెళ్లాలి తప్ప. దాని మీద కాలేసి కుచ్చుకుందని ఆగిపోకూడదు.

గ్రద్ధతో ఏ పక్షీ పోటీ పడే ధైర్యం చేయదు. ఒక్క కాకి తప్ప. గ్రద్ధ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కాకి దానికన్నా ఎత్తుకు ఎగిరి దాని మెడమీద పొడవాలని ప్రయత్నిస్తుంది. కాకి ఎంత పొడిచినా, ఏం చేసినా గ్రద్ధ పట్టించుకోదు. ఆకాశంలో ఎగరకుండా కిందికి దిగదు. తలూపదు. బదులుగా రెక్కలు విప్పుకుని ఇంకా పైకి ఎగురుతుంది. గ్రద్ధ ఎంత ఎత్తు ఎగిరితే కాకికి శ్వాస తీసుకోవడం అంత ఇబ్బంది అవుతుంది. ఎత్తులో కాకికి శ్వాస ఆడదు. దాంతో కాకి గ్రద్ధ మీద నుంచి అలాగే కిందికి పడిపోతుంది. తర్వాత గ్రద్ధ తన ప్రయాణం తాను కొనసాగిస్తుంది. కాకిని కనీసం లెక్క చేయదు. తన ప్రయాణానికి ఆటంకంగా భావించదు. అందుకే గ్రద్ధకు విలువ ఎక్కువ.

గ్రద్ధలాగే మీరు కూడా కాకుల్లాంటి ఆటంకాలను లెక్క చేయకండి. వాటిని తరిమి కొట్టడానికి మీ విలువైన సమయాన్ని వృథా చేయకండి. కాకుల్లాంటి ఆటంకాలు మీరు ప్రయాణం మొదలు పెట్టిన మొదట్లో మాటల రూపంలో, కొన్ని చేతల రూపంలో, కష్టాల రూపంలో.. మీతో పాటూ ఉండి మిమ్మల్ని కిందికి దించేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ అవే కొంతకాలానికి చేతకాక, మీతో పోటీ పడలేక, మీ పట్టుదలకు తలవంచి కిందకి పడిపోతాయి. మీరు చేయాల్సిందళ్లా ఆటంకాలను లెక్క చేయకుండా పైకి చూస్తూ వీలైనంత ఎత్తుకు ఎగరడమే.

మనం కష్టపడి వేసుకున్న రహాదారిలో భవిష్యత్తుకోసం ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక గుంతలు, బండరాళ్లు, పెద్ద పెద్ద వాహనాలు మనకు అడ్డుగా ఉంటాయి. ఆ గుంతలు దాటాలి. బండరాళ్లను పక్కకు పడేయాలి. వాహనాలను చేదించి వాటిని ఓవర్ టేక్ చేసి ముందుకెళ్లాలి. గ్రద్ధ కాకిని పట్టించుకోకుండా ఎలా తన ప్రయాణం తాను కొనసాగించిందో.. మనమూ అలాగే చేయాలి. మనల్ని దెబ్బి పొడిచే మాటలు మనసులోకి తీసుకోకూడదు. మీ గురించి తక్కువ చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరు మీకు సెల్యూట్ కొట్టేలా ఉండాలి మీ ప్రయాణం. మీ గురించి మాట్లాడాలంటే వాళ్లకే సిగ్గనిపించాలి. వాళ్లే మీ విజయం చూసి మంచిగా మారిపోవాలి.

మీరు మీ విజయ ప్రయాణంలో గమ్య స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు ఆల్ ది బెస్ట్.

WhatsApp channel