Papad Masala Chat: ఇంట్లో అప్పడాలున్నాయా? 2 నిమిషాల్లో పాపడ్ మసాలా చాట్ చేసేయండి..
Papad Masala Chat: అప్పడంతో మసాలా చాట్ ఏంటీ అనుకోకండి. చాలా సింపుల్ గా రెండే నిమిషాల్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. రుచి ఎలా ఉంటుందో తెలియాలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి.
చాట్ అంటే పిల్లలకు తెగ ఇష్టం ఉంటుంది. అయితే చాట్ అనగానే పెద్దగా మసాలాలు అవసరం అవుతాయి అనుకోకండి. ఇంట్లో మినప్పప్పుతోనో లేదంటో ఇంకా దేంతో అయినా చేసిన అప్పడాలు ఉండే ఉంటాయి కదా. వాటితో రుచికరమైన చాట్ చేసేయొచ్చు. పిల్లలు ఇష్టపడకుండా ఉండరు. మినప్పప్పుతో చేసిన అప్పడం అయితే రుచి కాస్త ఎక్కువ బాగుంటుంది. అప్పడం కాల్చుకుని దానిమీద మసాలా మిశ్రమం సర్ది సర్వ్ చేయడమే. దాన్ని ముక్కలుగా చేసుకుంటే మసాలాతో పాటూ తినేయడమే. అదెలా చేయాలో చూసేయండి.
మసాలా పాపడ్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
4 అప్పడాలు (మినప్పప్పు అప్పడాలు, పెసరపప్పు అప్పడాలు, బియ్యంపిండి అప్పడాలు.. ఏవైనా తీసుకోవచ్చు)
సగం కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
సగం కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు
పావు కప్పు క్యాప్సికం సన్నటి ముక్కలు
పావు కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర
సగం చెంచా కారం లేదా మిరియాల పొడి
సగం చెంచా చాట్ మసాలా
పావు చెంచా ఉప్పు
2 చెంచాల సన్నం సేవ్
1 చెంచా నిమ్మరసం
మసాలా పాపడ్ చాట్ తయారీ విధానం:
1. ముందుగా పాపడ్ లేదా అప్పడాన్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. లేదంటే గ్యాస్ స్టవ్ మీద పెట్టి నేరుగా నూనె లేకుండా కాల్చుకోవచ్చు. రెండింటికీ వేరు వేరు రుచి ఉంటుంది.
2. ఇప్పుడు అన్ని కూరగాయ ముక్కల్ని కట్ చేసుకుని ఒక పెద్ద బౌల్‌లో వేసుకోవాలి.
3. అందులోనే ఉప్పు, కారం, చాట్ మసాలా లేదా గరం మసాలా కలుపుకోవాలి.
4. ఇప్పుడు అప్పడానికి కొద్దిగా నూనె రాసుకోవాలి. కూరగాయల మిశ్రమాన్ని ముందుగా కాల్చుకున్న లేదా వేయించుకున్న అప్పడం మీద అంతటా వచ్చేలాగా పెట్టుకోవాలి.
5. కూరగాయల మిశ్రమం మీద సన్నం సేవ్ లేదా మసాలా సేవ్, బూందీ లాంటివి చల్లుకోవచ్చు.
6. మీద నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని వెంటనే తినేయడమే. చాలా రుచిగా ఉంటుంది. అప్పడాల మసాలా చాట్ రెడీ అయినట్లే.
బయట దొరికే చాట్‌లలో ఏవేవో మసాలాలు వాడతారు, నూనె కూడా ఎక్కువగానే ఉంటుంది. బదులుగా చెంచా నూనెతో రెడీ అయిపోయే ఈ మసాలా అప్పడాల్ని పిల్లలకు ఇవ్వడం చాలా మేలు. దీని మీద మీకిష్టమైన కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. సేవ్ బదులుగా ఏదైనా బూందీ మిక్స్చర్ లేదా మసాలా ఖారా కూడా చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. పూర్తిగా మీ ఇష్టానికి తగ్గట్లు తయారు చేసుకుని తినేయండి.