Ganji in washing machine: వాషింగ్ మెషీన్‌లో బట్టలకు గంజి పెట్టొచ్చా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
Starch in washing machine: వాషింగ్ మెషీన్ లో గంజి పెట్టొచ్చని చాలా మందికి తెలీదు. ఆ పద్ధతి గురించి వివరంగా చూసేయండి.
గంజి లేదా స్టార్చ్ పెట్టిన బట్టలు వేసుకుంటే ఆ హుందాతనమే వేరు. చాలా మంది బట్టలకు గంజి పెట్టకుండా వేసుకోలేరు. బట్టలతో పాటే బెడ్షీట్లు, కాటన్ టవెళ్లు లాంటివి కూడా గంజి పెడితే స్టిఫ్‌గా, తాజాగా అనిపిస్తాయి. కానీ ఈ రోజుల్లో బట్టలు ఉతకడానికి దాదాపుగా అందరూ వాషింగ్ మెషీన్లే వాడుతున్నారు. దాంట్లో ఉతికాక బట్టలను తీసి మళ్లీ నీళ్లలో నానబెట్టి గంజి పెట్టాల్సి వస్తుంది. కానీ నిజానికి ఆ కష్టం అక్కర్లేదు. వాషింగ్ మెషీన్ లోనే స్టార్చ్ లేదా గంజి పెట్టేయొచ్చు. అదెలాగో చూడండి.
వాషింగ్ మెషీన్లో గంజి ఎలా పెట్టాలి?
- ముందుగా మెషీన్ లో మీరు గంజి పెట్టాలనుకుంటున్న బట్టలను మాత్రమే వాషింగ్ కోసం వేయాలి.
- సాధారణంగా ఎలా మెషీన్ వాడతారో అలాగే వాషింగ్ చేయడం మొదలు పెట్టాలి.
- బట్టలు ఉతకడం అయిపోయాక చివర్లో మళ్లీ ఫైనల్ రిన్స్ సైకిల్ లేదా రిన్స్ సైకిల్ బటన్ క్లిక్ చేయాలి. లేదంటే మధ్యలో ఫైనల్ రిన్స్ సైకిల్ ముందు పాజ్ చేసి అప్పుడు స్టార్చ్ వేసుకోవాలి.
- ఇప్పుడు స్టార్చ్ సిద్ధం చేసుకోవాలి. లిక్విడ్ స్టార్చ్ వాడితే ఒకసారి బాటిల్ ను బాగా ఊపడం మర్చిపోవద్దు. ఆ తర్వాతే అవసరమైనంత లిక్విడ్ స్టార్చ్ వాడాలి. ఒకవేళ పౌడర్ రూపంలో స్టార్చ్ వాడితే 1 లేదా 2 చెంచాల స్టార్చ్ పౌడర్‌ను 1 కప్పు నీళ్లలో కలపాలి. స్టార్చ్ బాగా కలిసేదాకా కలుపుతుండాలి. పౌడర్ నేరుగా బట్టల్లో వేయకూడదు.
- ఈ స్టార్చిని డిటర్జెంట్ కోసం లేదా ఫ్యాబ్రిక్ సాఫెనర్ కోసం ఉన్న డ్రా లేదా స్పేస్ లో పోయాలి. గట్టిగా అక్కడే స్టార్చ్ అతుక్కున్నట్లు అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకోవాలి.
- చివరగా ఫైనల్ రిన్స్ సైకిల్ మరోసారి ఆన్ చేయాలి. సైకిల్ మొత్తం పూర్తవ్వాలి. అయిపోయాక బట్టలను తీసి బయట ఆరేయాలి.
- ఆరేసేటప్పుడు వీలైనన్ని తక్కువ ముడతలు ఉండేలాగా చూసుకోవాలి.
- కాటన్ షర్టులు, ప్యాంట్లు ఉంటే వాటిని ఐరన్ చేసి మడత పెట్టేసుకుంటే సరి. స్టార్చ్ పెట్టిన బట్టలు కాస్త తడిగా ఉన్నప్పుడే ఐరన్ చేస్తే స్టిఫ్‌నెస్ ఉంటుంది.
అలాగే తెలుపు బట్టలన్నీ ఒకసారి, రంగుల బట్టలన్నీ మరోసారి వేయడం మంచిది. లేదంటే అనవసరంగా రంగు అంటుకుని బట్టలు పాడైపోతాయి.
ఈ బట్టలకు స్టార్చ్ పెట్టకూడదు:
గంజి వల్ల బట్టలు స్టిఫ్ గా అవుతాయి. స్టార్చ్ లో ఉండే బియ్యం గంజి, మైదా లాంటివే దీనికి కారణం. ఇది కాటన్, లెనిన్ బట్టలకు చాలా మేలు. కానీ ఈ కింద చెప్పిన వాటికి గంజి పెట్టకూడదు.
సింథటిక్స్
ఉన్ని దుస్తులు
స్వెట్టర్లు
షాలువాలు
పాలిస్టర్ దుస్తులు
నైలాన్ దుస్తులు
వీటికి స్టార్చ్ పెట్టకూడదు.
కొన్ని జాగ్రత్తలు:
అలాగే గంజి పెట్టిన బట్టల్ని ఎక్కువ రోజులు అలాగే సెల్ఫుల్లో, బీరువాలో పెట్టి ఉంచకూడదు. అవి చిన్న పురుగుల్ని ఆకర్షిస్తాయి.
మీరు కొన్న కమర్షియల్ లేదా బ్రాండెడ్ బట్టల మీద స్టార్చ్ సంబంధించి మీడియం, లైట్, హెవీ అని లెవల్స్ ఉంటాయి. నాణ్యత అలాగే ఉండాలంటే దాని ప్రకారం స్టార్చ్ లిక్విడ్ ఎంచుకోవాలి.