Fake Vs Pure silk: అసలు సిసలు పట్టుచీర ఇలా గుర్తించొచ్చు.. వేల డబ్బులు మోసపోరిక-how to find difference between pure silk and fake silk saree ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fake Vs Pure Silk: అసలు సిసలు పట్టుచీర ఇలా గుర్తించొచ్చు.. వేల డబ్బులు మోసపోరిక

Fake Vs Pure silk: అసలు సిసలు పట్టుచీర ఇలా గుర్తించొచ్చు.. వేల డబ్బులు మోసపోరిక

Koutik Pranaya Sree HT Telugu
Jul 09, 2024 07:00 PM IST

Pure silk Vs Fake: ప్యూర్ పట్టు చీర అనగానే నమ్మేసి బోలెడంత డబ్బెట్టేసి చీర కొనేస్తాం. అది నిజంగా అసలు సిసలైన పట్టు చీరో కాదో తెల్సుకోవాలంటే కొన్ని చిట్కాలు తెలియాల్సిందే.

పట్టుచీర నాణ్యత చెప్పే చిట్కాలు
పట్టుచీర నాణ్యత చెప్పే చిట్కాలు

పెళ్లిళ్లు, పేరంటాలు, పూజలు, సాంప్రదాయ వేడుకలేవీ చీరకట్టు లేనిదే పూర్తికావు. అయితే ప్రతి వేడుకకూ అసలైన పట్టు చీర కొనడం వీలుకాకపోవచ్చు. కానీ, ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నా, మన పెళ్లే ఉన్నా, అక్కో అన్నదో పెళ్లున్నా వేల రూపాయలు పెట్టి మంచి పట్టుచీర కొంటాం. దుకాణంలో వాళ్లు ప్యూర్ పట్టు చీర అని చెప్పినా అది గుర్తుపట్టలేక సరే అని నమ్మేస్తాం. కానీ అసలైన పట్టుచీరను గుర్తించడానికి కొన్ని టిప్స్, ట్రిక్స్ ఉన్నాయి. కొన్ని షాపులో చెక్ చేయగలిగితే, కొన్ని పాత చీరల స్వచ్ఛతను చూడ్డానికి పనికొస్తాయి. అవేంటో చూసేయండి. 

మెరుపు:

అసలైన పట్టు చీరను లైట్ కింద పెట్టినప్పుడు బంగారు వర్ణం మెరుపుతో రంగు రంగులుగా కనిపిస్తుంది. పట్టు చీర రంగులను వివిధ రకాలుగా పరావర్తనం చేయడమే దానికి కారణం. అదే సింథటిక్ చీర అయితే ఒకే రంగు తెలుపు లాంటి మెరుపు ఉంటుంది తప్ప అసలైన పట్టు చీర లాగా మెరిసిపోదు.

నీటి పరీక్ష:

చీరపై చిన్న నీటి చుక్క వేసి చూడాలి.  స్వచ్ఛమైన పట్టు ఉంటే నీరు నెమ్మదిగా పీల్చుకుంటుంది. కానీ సింథటిక్ చీర అయితే  నీరు జారిపోతుంది. దుకాణంలో చీర మీద నీళ్లు పోస్తే ఊరుకుంటారా ఏంటి? అనుకోకండి. ఇది మీ దగ్గరున్న పాత చీరల నాణ్యత తెల్సుకోడానికి ఒక చిట్కా అనుకోండి. 

కాల్చడం వల్ల:

అదిగో మళ్లీ.. చీర కాల్చడం అంటారు.. చీర కాల్చి చూస్తే ఎవరూరుకుంటారని తిట్టుకోకండి. చీరకున్న పోగు చాలు ఈ పరీక్ష చేయడానికి. దాన్ని లైటర్ తో కాల్చినప్పుడు జుట్టు కాలినప్పుడు వచ్చే వాసన వస్తుంది. మంట చాలా చిన్నగా ఉండి త్వరగా ఆరిపోతుంది. నలుపు రంగు బూడిద వచ్చేస్తుంది. అదే సింథటిక్ చీర అయితే మంట తగలగానే కుచించుకుపోతుంది. 

ఉంగరంతో పరీక్ష:

అసలైన పట్టు చీరను కొన పట్టుకుని కాస్త ఉంగరంలోకి దూర్చి చూస్తే ఎంత లాగినా బయటకు వచ్చేస్తుంది. అదే సింథటిక్ చీర ఒక అడుగు పొడవైనా బయటకు రాకుండా ఆగిపోతుంది. 

ధర:

అసలైన పట్టు చీరలు తయారీకి బోలెడు శ్రమ అవసరం. సమయం అవసరం. అందుకే అవి చాలా ఖరీదుంటాయి. ఎవరైనా తక్కువ ధరకే అసలైన పట్టుచీరలిస్తున్నారంటే మోసపోకండి. అది అసాధ్యం. పట్టు చీరలు కొనేటప్పుడు సరైన షాపులో కొనడం మరింత ముఖ్యం. 

తాకి చూస్తే:

పట్టు అంటేనే మెత్తదనం. చీర మీద చేయిపెట్టి అలా తాకగానే మృదువుగా అనిపించాలి. ఆ మెత్తదనం స్పర్శ మీకు స్పష్టంగా తెలుస్తుంది. సింథటిక్ చీరలు తాకగానే కాస్త రఫ్ గా అనిపిస్తాయి. 

పారదర్శకత:

లైట్ ముందు చీరను పెట్టి చూస్తే పలుచగా అనిపించకూడదు. చీర మందంగా ఉన్నట్లు అనిపించాలి. అసలైన పట్టు చీర పలుచగా అటువైపు వస్తువులు స్పష్టంగా కనిపించేలా ఉండదు. 

జరీ వర్క్:

చీర మీదుండే జరీ వర్క్ జాగ్రత్తగా గమనించండి. అసలైన పట్టు చీరలకు వాడే జరి బంగారు వర్ణంలో నాణ్యంగా ఉంటుంది. చాలా బిగుతుగా చీరను పట్టుకుని ఉంటుంది. స్వచ్ఛత లేని చీరల జరీలో అంత మెరుపుదనం ఉండదు. కాస్త వదులుగా, పోగులు తేలి కనిపించొచ్చు. 

WhatsApp channel