Cumin seeds health benefits: జీలకర్ర లేని వంట గది ఉండదేమో బహుశా. దీని ఆరోగ్య ప్రయోజనాలు దీని వాడకాన్ని పెంచాయి. వేల సంవత్సరాలుగా జీలకర్ర వినియోగంలో ఉంది. ఆహారంలో భాగంగా వాడే జీలకర్రను.. పర్‌ఫ్యూమ్‌లలోనూ వినియోగిస్తారు. అనేక ఔషధ గుణాలు ఉన్న సహజ సిద్ధమైన ఈ జీలకర్ర అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
సాధారణంగా మనకు కడుపు అసౌకర్యంగా ఉంటే పెద్దవాళ్లు వెంటనే జీలకర్ర నమలాలని, జీలకర్ర నీళ్లు తాగాలని సూచిస్తారు. ఆహారం జీర్ణం కాకపోయినా, విరేచనాలు ఉన్నా, కడుపు ఉబ్బరం ఉన్నా జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రతో తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కిడ్నీలు, మూత్రాశయంలో రాళ్లను కూడా కరిగిస్తుంది. కంటి సమస్యలకు కూడా జీలకర్ర బాగా పనిచేస్తుంది.
జీలకర్రలో విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. మనకు రోజూ అవసరమయ్యే ఫైబర్‌లో నాలుగో వంతు ఒక గ్రాము జీలకర్రలో లభిస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్లు జీలకర్రలో ఉన్నాయి. జీలకర్రను పొడి రూపంలో లేదా జీలకర్ర గింజల రూపంలోనూ వాడుకోవచ్చు.
జీలకర్రలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. మీ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసే బ్యాక్టీరియాను జీలకర్ర చంపేస్తుంది. ఇ.కొలీ బ్యాక్టీరియా వంటి ఫుడ్ పాయిజన్‌కు కారణమయ్యే మైక్రోఆర్గానిజమ్స్‌ను జీలకర్ర చంపేస్తుంది. అందుకే జీలకర్రను కడుపు నొప్పి ఉపశమన ఔషధంగా చూస్తారు.
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, ఇరిటెబుల్ బొవెల్ సిండ్రోమ్(ఐబీఎస్) ఉన్న వారు జీలకర్ర నమిలి మింగితే తక్షణం ఉపశమనం పొందవచ్చు. లేదా జీలకర్ర టీ తాగినా వెంటనే గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. విరేచనాలను అరికడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జీలకర్ర కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. జీలకర్ర పొడి పెరుగులో కలుపుకుని తింటే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లైజరిడ్లు తగ్గడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగిందని ఓ అధ్యయనంలో తేలింది.
డయాబెటిస్ లక్షణాలను, ప్రభావాలను జీలకర్ర తగ్గిస్తుంది. యాంటీడయాబెటిక్ ఔషధాల్లో కూడా దీనిని వినియోగిస్తారు. ఇన్సులిన్‌కు మీ శరీరం స్పందించే తీరును ప్రభావితం చేస్తే యూరియా స్థాయిని కూడా ఈ జీలకర్ర తగ్గిస్తుందని పరిశోధకులు తేల్చారు. అంతేకాకుండా రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయి నార్మల్ రేంజ్‌లో ఉండేలా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
శరీరంలోని కణాల్లో మొదలయ్యే క్యాన్సర్ క్రమంగా వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ అసాధారణ కణాల్లో ట్యూమర్లు వృద్ధి చెందుతాయి. ఈ తరహా ట్యూమర్లు పెరగడాన్ని జీలకర్ర అడ్డుకుంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. లివర్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లలో ఈ జీలకర్ర ప్రభావవంతంగా పనిచేస్తుంది.
జీలకర్ర తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుందని, బరువు తగ్గుతారని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. జీలకర్ర క్రమం తప్పకుండా తీసుకున్న వారిలో బాడీ మాస్ ఇండెక్స్ సాధారణ స్థితికి వచ్చిందని తేలింది.
జీలకర్రలో ఉండే నూనెలు స్ట్రెస్, యాంగ్జైటీని తొలగిస్తాయి. నిద్రకు కారణమయ్యే ఈ మానసిక సమస్యలు జీలకర్ర వల్ల తొలగిపోతాయి. ఫలితంగా మీరు నిద్ర లేమి సమస్యల నుంచి దూరమవుతారు. జీలకర్రలో ఉండే మెలటోనిన్ నిద్రకు ఉపయుక్తమైన హార్మోన్లను నియంత్రిస్తుంది.
శరీరంలో విభిన్న కారణాల వల్ల ఉండే ఇన్‌ఫ్లమేషన్ (వాపు, మంట) ను జీలకర్ర తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలే అందుకు కారణం. జీలకర్రలో ఉండే ఫేవనాయిడ్లు శరీరంలో శక్తిమంతమైన యాంటీఆక్సిడంట్లుగా పనిచేస్తాయి.
జీలకర్రను అధిక మొత్తంలో వినియోగించినా సాధారణంగా ఎలాంటి నష్టం లేదు. 300 నుంచి 600 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చు. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినప్పుడు జీలకర్ర తీసుకనే సైజు తగ్గించాలి. అలాగే దీని వల్ల మగవారిలో టెస్టోస్టిరోన్ స్థాయి తగ్గుతుందని, అందువల్ల వారిలో సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందని చెబుతారు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు కూడా జీలకర్ర అధికంగా వినియోగించవద్దని చెబుతారు.