Fruits and Veggies for iron: ఈ శీతాకాలపు పండ్లు, కూరగాయలతో.. ఐరన్ లోపానికి చెక్
Fruits and Veggies for iron: శీతాకాలంలో ఎక్కువగా దొరికే కొన్ని రకాల కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకుంటే ఐరన్ లోపం నుంచి బయటపడొచ్చు. అవేంటో వివరంగా తెలుసుకోండి..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతీయ మహిళల్లో దాదాపుగా 53 శాతం మంది రక్త హీనతతో బాధ పడుతున్నారు. శరీరంలో ఐరన్ లోపం వల్ల ఈ రక్త హీనత వస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే మహిళలు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శీతాకాలంలో సీజనల్‌గా దొరికే కొన్ని పండ్లు, కూరగాయలు, ఆకు కూరల్లో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మనం ఈ ఇనుము లోపం నుంచి బయటపడొచ్చు.
యాపిల్ :
శీతాకాలంలో ఎక్కువగా దొరికే యాపిల్ పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీన్ని తొక్కతో సహా తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్త వృద్ధి జరగడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఖాళీ కడుపుతో దీన్ని తినడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.
దానిమ్మ పండు :
మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచడానికి దానిమ్మ పండు ఎంతగానో సహకరిస్తుంది. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్ సీ లాంటివీ దొరుకుతాయి. అందువల్ల మనం శక్తివంతంగా కావడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.
కమలా పండు :
కమలాఫలాల్లో ఎక్కువగా సీ విటమిన్ ఉంటుంది. అది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వరా ఐరన్ శోషణను పెంచడంలో సహకరిస్తుంది. బరువు తగ్గాలనకునే వారు రోజూ వీటిని తినొచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ పండు ఉపయోగపడుతుంది.
బ్రోకలీ:
క్యాలీ ఫ్లవర్‌కి చెల్లెల్లిలా ఉండే బ్రోకలీలో పుష్కలంగా ఇనుము లభిస్తుంది. ఇంకా విటమిన్ బీ, సీలు దీనిలో ఉంటాయి. దీన్ని తక్కువగా వేడి చేసుకుని తినడం వల్ల ఎక్కువగా పోషకాలను మనం పొంద గలుగుతాం. మలబద్ధకం, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం లాంటి సమస్యలను ఇది తీరుస్తుంది.
బచ్చలి కూర:
బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఐరన్ లోపం ఉన్న వారు దీన్ని తప్పకుండా తినవచ్చును. కళ్లు, ఎముకల ఆరోగ్యమూ మెరుగవుతుంది. బీపీ కూడా నియంత్రణలో ఉండటానికి ఇది సహకరిస్తుంది.
బీట్ రూట్:
ముదురు ఊదా రంగులో ఉండే బీట్‌రూట్ దుంపల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్‌తోపాటు కాల్షియం, విటమిన్ సీ లాంటివీ ఉంటాయి. అనీమియాతో బాధ పడేవారు రోజూ బీట్ రూట్ జ్యూస్‌ని తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.