Detect secret camera: మీరుండే గదిలో సీక్రెట్ కెమెరాలుంటే.. ఏమూలనున్నా గుర్తించే మర్గాలివే
Detect secret camera: మనం ఉంటున్న గదుల్లో సీక్రెట్ లేదా హిడెన్ కెమెరాలు పెట్టారని అనుమానం ఉంటే.. వాటిని నిర్దారించుకునే మార్గాలు కొన్ని తెల్సుకోండి.
ఊర్వశి రౌటెలా బట్టలు మార్చుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీని గురించి యాక్టర్ తీవ్రంగా స్పందించింది. దీనిమీద భిన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది పబ్లిసిటీ కోసమే చేస్తున్న స్టంట్ అంటున్నారు. మరికొందరు ఊర్వశి మీద సానుభూతి చూపిస్తున్నారు. విషయం ఏదైనా అమ్మాయిలు ప్రైవసీ గురించి ఆలోచించుకోవడం మాత్రం ముఖ్యమే. మీరుంటున్న హోటల్లో, గదుల్లో హిడెన్ కెమెరాలున్నాయో లేదో పరీక్షించుకోవడం తప్పనిసరి. అదెలాగో చూడండి.
సీక్రెట్ కెమెరాను గుర్తించే మార్గాలు:
కెమెరాకు సంబంధించిన వైర్లు ఎంత బాగా దాచిపెట్టినా కూడా దాని లెన్స్ మాత్రం బయటకు ఉండాల్సిందే. రికార్డ్ చేసేది లెన్స్ ద్వారానే కాబట్టి లెన్స్ కు అడ్డంగా ఏమీ ఉండకుండానే అమర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఆధారంగానే సీక్రెట్ కెమెరాలను గుర్తించొచ్చు.అదెలాగంటే..
1. లైట్లు ఆఫ్ చేయండి:
హోటల్ గదిలోకి వెళ్లగానే గది లైట్లు అన్నీ ఆర్పేయండి. కర్టెయిన్లూ మూసేయండి. గదిలోకి వెలుతురు అస్సలే రాకుండా చూడండి.
కొన్ని రకాల కెమెరాలకు చాలా చిన్న లైట్లు ఉంటాయి. చిమ్మ చీకట్లో అవి కనిపించొచ్చు. అలా కనిపించని కెమెరాలను ఫోన్ ఫ్లాష్ లైట్ ద్వారా గుర్తించొచ్చు. గది మూలల్లో, గదంతటా ఫ్లాష్ లైట్ పెట్టి చూడాలి. కెమెరాలు మిగతా వస్తువులతో పోలిస్తే వెలుతురును వేరుగా పరావర్తనం చేస్తాయి. అలాగే వాటిమీద వెలుతురు పడితే కాస్త మెరిసినట్లు కనిపించొచ్చు. ఆ మార్పు ద్వారా కెమెరాలను గుర్తించొచ్చు.
2. అద్దాలు, పెయింటింగ్స్:
సాధారణంగా అద్దాలను అవసరమైన చోట మాత్రమే హోటల్ గదుల్లో పెడతారు. అలాకాకుండా అవసరం లేని చోట అలంకరణ కోసం పెట్టినట్టనిపిస్తే దాన్ని పరీక్షించాల్సిందే. వెనకాల కెమెరా ఉందేమో చూడాలి. అలాగే ఆ అద్దం మరో వైపు నుంచి బయటకు కనిపిస్తుందా అని పరీక్షించాలి.దానికి అడ్డుగా ఏమైనా మీరే ఉంచాలి. పెయింటింగ్స్, గోడ గడియారాల నంబర్లలో, బొమ్మల కళ్లలో, వాల్ హ్యాంగర్లలో, స్మోక్ అలార్మం దగ్గర, ల్యాంప్స్ లలో కూడా కెమెరా దాచి పెట్టే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గమనించాలి.
3. స్మార్ట్ ఫోన్ యాప్స్:
కెమెరా నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ కిరణాలను గుర్తించే స్మార్ట్ యాప్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సీక్రెట్ కెమెరాలు గుర్తించొచ్చు.అలాంటి నమ్మదగ్గ యాప్స్ లిస్ట్ చూడండి. హిడెన్ కెమెరా డిటెక్టర్ స్పై సి, హిడెన్ స్పై కెమెరా డిటెక్టర్, హిడెన్ కెమెరా డిటెక్టర్ ప్రో, నో హిడెన్ స్పై కెమెరా ఫైండర్, హిడెన్ పిన్ హోల్ కెమెరా డిటెక్టర్.. వీటిలో మీకు బాగా అనిపించిన యాప్ ఒకటి మీ ఫోన్లో ఉంచండి. యాప్ చెప్పిన మార్గదర్శకాల ఆధారంగా కెమెరాను గుర్తించడానికి ఇవి కొంతయినా సాయపడొచ్చు.
కెమెరాలు పెట్టే అవకాశం ఉన్న ప్రదేశాలు:
సీలింగ్ ఫ్యాన్ మధ్య భాగంలో
స్మోక్ డిటెక్టర్స్
స్పీకర్ల మెష్ లోపల
ఫైర్ అలార్మం
డూర్ లాక్స్
హ్యాంగర్లు
బెడ్ ల్యాంపులు
బొమ్మల కళ్లలో, లేదా బొమ్మలో వెరైటీగా కనిపించే భాగాల్లో
పెయింటిగ్స్, ఫ్రేములు
గోడల్లో ఉండే సన్నని రంధ్రాల్లో
గోడ గడియారాల్లో, ముఖ్యంగా నంబర్లుండే దగ్గర
గది మూలల్లో
బాత్రూం మూలల్లో
షెల్ఫుల మూలల్లో