Sunflower seeds health benefits: పొద్దుతిరుగుడు గింజలు.. పోషకాల గనులు
sunflower seeds health benefits: sunflower seeds health benefits: పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే పోషకాల వల్ల అవి అపరిమితమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి.
sunflower seeds health benefits: పొద్దు తిరుగుడు గింజల్లో ఉండే పోషకాలు బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. పొద్దుతిరుగుడు పూల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈ గింజల నుంచి తీసిన వంట నూనెను మనం రోజూ వినియోగిస్తాం. వీటిలో ఉండే అధిక పోషకాల కారణంగా ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. పొద్దుతిరుగుడు గింజలను యథాతథంగా, లేదా వేయించి కూడా తినొచ్చు. కొన్ని రకాల వంటకాల్లో కూడా జత చేయొచ్చు.
సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే పోషకాలు
పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ బీ1, రైబోఫ్లావిన్ (విటమిన్ బీ2), నియాసిన్ (విటమిన్ బీ3), ఫాంటోథెనిక్ యాసిడ్ (విటమిన్ బీ5), విటమిన్ బీ6, విటమిన్ ఇ, ఫోలేట్స్, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. పావు కప్పు వేయించిన సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో 205 క్యాలరీలు లభిస్తాయి. ప్రొటీన్ 5.7 గ్రాములు, కొవ్వు 18 గ్రాములు, కార్బొహైడ్రేట్లు 7 గ్రాములు లభిస్తాయి. అలాగే 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
హైబ్లడ్ ప్రెజర్, గుండె జబ్బులు వృద్ధి చెందకుండా పొద్దుతిరుగుడు గింజలు కాపాడుతాయి. మీ రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు, అలాగే మీ శక్తిస్థాయిని పెంచేందుకు సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉపయోగపడతాయి. సెలీనియం, జింక్ మగవారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భం దాల్చాలని ప్రయత్నించే వారు, గర్భం దాల్చిన వారికి ఫొలేట్స్ మేలు చేస్తాయి.
వాపు, మంటను తగ్గించే సన్‌ఫ్లవర్ సీడ్స్
శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు, మంట) ఉన్నప్పుడు సన్‌ఫ్లవర్ సీడ్స్ దాని నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే అందుకు కారణం. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించేందుకు సహాయపడతాయి. ఇతర గింజలతో పోలిస్తే ప్రతి వారం సన్‌ఫ్లవర్ సీడ్స్ వినియోగం వల్ల ఇన్‌ఫ్లమేషన్ ఐదు రెగ్లే వేగంగా తగ్గుతుంది.
రోగ నిరోధకతను పెంచే పొద్దు తిరుగుడు గింజలు
సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో జింక్, సెలీనియం వంటి పోషకాలు, ఖనిజ లవణాలు మీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, వైరస్‌లపై పోరాడే బలాన్ని ఇస్తాయి. ఇమ్యూన్ కణాలను పెంచడంలో జింక్‌ది కీలకపాత్ర. అలాగే శరీరంలో ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు, ఇమ్యూనిటీ పెంచేందుకు సెలీనయం కూడా బాగా పనిచేస్తుంది.
శక్తిని పెంచే సన్‌ఫ్లవర్ సీడ్స్
మీ శరీరానికి తగిన పోషకాలు అందక మీకు నీరసంగా, అలసటగా ఉంటుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్ లో ఉండే విటమిన్ బీ, సెలీనియం మీకు శక్తి సమకూరుస్తాయి. థయామిన్‌గా పిలుచుకునే విటమిన్ బీ 1 సన్‌ఫ్లవర్ సీడ్స్ లో ఉంటుంది. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ఇక సెలీనియం రక్త ప్రసరణను పెంచుతూ శరీరానికి తగిన ఆక్సిజన్ అందేలా సాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సన్‌ఫ్లవర్ సీడ్స్
సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఆరోగ్యకర కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకర కొవ్వుల్లో భాగమైన పాలీఅన్‌శాచ్యురేటెడ్, మోనోఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వలు పొద్దుతిరుగుడు గింజల్లో ఉంటాయి. సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో సహా ఇతర గింజలు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక బ్లడ్ ప్రెజర్ తగ్గి అంతిమంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయని పలు అధ్యయనాలు తేటతెల్లం చేశాయి.
సన్‌ఫ్లవర్ సీడ్స్ ఎంత మేర తినొచ్చు..
పొద్దు తిరుగుడు గింజలు పోషకాలతో పాటు అధిక క్యాలరీలను ఇచ్చే ఆహారం. అందువల్ల అధిక మొత్తంలో తినడం వల్ల బరువు పెరిగే ముప్పు ఉంటుంది. రోజుకో పావు కప్పు వరకు తినడం సరిపోతుంది. వేయించినప్పుడు ఉప్పు కలపకపోవడం మేలు చేస్తుంది. గింజలకు ఉండే పొర (షెల్) తొలగించి తినాలి.
సన్‌ఫ్లవర్ సీడ్స్‌ను సలాడ్స్‌లో, ఓట్స్ మీల్‌లో కలపడం ద్వారా వాటిని తినొచ్చు. అలాగే బర్గర్స్, బేకరీ ఫుడ్స్‌లో కలపొచ్చు. పీనట్ బటర్‌కు బదులుగా సన్‌ఫ్లవర్ సీడ్స్ బటర్ వాడొచ్చు. సన్‌ఫ్లవర్ సీడ్స్ నూనె రూపంలోనూ వాటి పోషకాలు పొందవచ్చు.
సంబంధిత కథనం