High cholesterol symptoms: హై కొలెస్ట్రాల్ ఉందా? ఈ లక్షణాలతో పసిగట్టండి-know high cholesterol symptoms on your body legs eyes tongue ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Know High Cholesterol Symptoms On Your Body Legs Eyes Tongue

High cholesterol symptoms: హై కొలెస్ట్రాల్ ఉందా? ఈ లక్షణాలతో పసిగట్టండి

HT Telugu Desk HT Telugu
Jan 24, 2023 04:00 PM IST

High cholesterol symptoms: అధిక కొలెస్ట్రాల్ చాాలా కేసుల్లో ఎలాంటి లక్షణాలను చూపదు. ప్రాణాంతకమైన అధిక స్థాయి కొలెస్ట్రాల్ ఉందని తెలుసుకునేందుకు కాళ్లు, కళ్లు, నాలుకపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీరూ తెలుసుకోండి.

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో కనిపించే లక్షణాలు
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో కనిపించే లక్షణాలు (Freepik)

అధిక కొలెస్ట్రాల్ మీ శరీరానికి బాగా నష్టం చేకూరుస్తుంది. మొదట్లో మీకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ కాలక్రమంలో మీ శరీరంలోని అనేక అవయవాలు సంకేతాలను చూపిస్తుంటాయి. కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండడం వల్ల మీకు గుండె పోటు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అంతేకాకుండా అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. రక్తనాళాల్లో పేరుకుపోయే ఈ కొవ్వు నిల్వలు ప్రాణాంతకంగా మారుతాయి. దమనుల్లో రక్త ప్రవాహానికి అడ్డుగా నిలిచి రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. ఈ కారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

What is cholesterol: కొలెస్ట్రాల్ అంటే ఏమిటి?

‘నిజానికి మీ ఆరోగ్యం బాగుండాలంటే కొలెస్ట్రాల్ అవసరం. ఇది రక్తంలో ఉండే ఒక మైనం లాంటి పదార్థం. శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేసేందుకు కొలెస్ట్రాల్ తోడ్పడుతుంది. సాధారణంగా గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే రక్త నాళాలు అయిన ధమనులు మీ శరీర కణజాలాలను పోషిస్తాయి. అయితే కొలెస్ట్రాల్ ఇతర కొవ్వులు, పదార్థాల కారణంగా ధమనుల గోడలకు ఫలకల్లా పేరుకుపోతాయి. ఈ ప్రక్రియనే అథెరోస్ల్కెరోసిస్ అని అంటారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయి ఉన్న వారు దీని బారిన పడతారు. ఇది ధమనులను కుంచించుకుపోయేలా చేస్తుంది. టిష్యూలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది..’ అని రూబీ హాల్ క్లినిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ స్మృతీ హిందారియా తెలిపారు.

When cholesterol turns deadly: కొలెస్ట్రాల్ ఎప్పుడు ప్రాణాంతకమవుతుంది?

‘శరీరానికి కొలెస్ట్రాల్ చాలా ముఖ్యమైంది. కానీ అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా మారుతుంది. మరి ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయని మనం ఎలా తెలుసుకోగలం? ఇది అర్థ: చేసుకోవాలంటే కొలెస్ట్రాల్‌లో రెండు రకాలను అర్థం చేసుకోవాలి. కొలెస్ట్రాల్-హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లైపోప్రొటీన్). ఇది మంచి కొలెస్ట్రాల్. ఇక రెండోది కొలెస్ట్రాల్-ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లైపోప్రొటీన్). ఇది చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వర్తిస్తుంది. ఇక చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోతూ సమస్యలను సృష్టిస్తుంది..’ అని మణిపాల్ హాస్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ మయాంక్ అరోరా చెప్పారు.

అధిక కొలెస్ట్రాల్ ఉంటే విభిన్న రకాల లక్షణాలు బయటపడుతుంటాయి. శరీరంలో ప్రభావితమైన ప్రాంతాలను బట్టి ఆ లక్షణాలు ఉంటాయి. ఒకవేళ కొలెస్ట్రాల్ స్థాయి బాగా పెరిగితే మీ కళ్లు, చర్మం, మీ నాలుక నుంచి కూడా లక్షణాలు బయటపడుతుంటాయి. కాళ్లు, కళ్లు, నాలుక ద్వారా ఎలాంటి లక్షణాలు బయటపడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Signs of high cholesterol in legs: అధిక కొలెస్ట్రాల్ వల్ల కాళ్లల్లో సంకేతాలు

‘అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల కాళ్లల్లో క్లాడికేషన్ (claudication) అనే దుష్ప్రభావం ఏర్పడుతుంది. అంటే కొలెస్ట్రాల్ వల్ల మీ కాళ్లలోని రక్తనాళాలు ఇరుగ్గా మారి లేదా బ్లాక్ అయిపోతాయి. దీని ఫలితంగా కాళ్లల్లో నొప్పులు ప్రారంభమవుతాయి. నడవడం, ఇతర శారీరక శ్రమ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే విశ్రాంతి వల్ల ఈ నొప్పి తగ్గుతుంది. కానీ వ్యక్తి శారీరక సామర్థ్యాలను పరిమితం చేస్తుంది..’ అని ఫోర్టిస్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ ఆదిత్య ఎస్ చౌటీ వివరించారు.

పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) లక్షణాలు ఇవే

‘కాళ్లు, పాదాల్లోని దమనుల్లో కొలెస్ట్రాల్ నిల్వలతో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) వస్తుంది. శారీరక వ్యాయామాల్లో కాలు నొప్పి రావడం దీని సాధారణ లక్షణం. మీ కాళ్లు, పాదాల షేప్ కూడా మారిపోవడం కనిపిస్తుంది. ముఖ్యంగా గోళ్లు, చర్మంలో మార్పులు కనిపిస్తాయి. కండరాల నొప్పి కూడా క్లాడికేషన్ లక్షణమే. నొప్పులు, తిమ్మిర్లు, అలసట దీని లక్షణాలే. నడుస్తున్నప్పుడు, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు బయటపడుతుంటాయి. ఎక్కువగా కాళ్ల భాగంలోనే ఈ సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి పిరుదులు, తొడలు పిక్కలు, పాదాల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. నొప్పి సాధారణంగా కండరాల్లో వస్తుంది. కొలెస్ట్రాల్ వల్ల ప్రభావితమైన ధమనులు ఉన్న చోట ఈ నొప్పి కనిపిస్తుంది. తీవ్రమైన పీఏడీ కేసుల్లో రెస్ట్ తీసుకున్నప్పటికీ కండరాల నొప్పి నయం కాదు. అది తిరగబెడుతూనే ఉంటుంది..’ అని డాక్టర్ హిందారియా చెప్పారు.

‘పీఏడీ ఉన్న వారి చర్మం మృదువుగా మారుతుంది. చర్మం మెరుస్తుంది. కాలిపై ఉండే వెంట్రుకలు మాయమైపోతాయి. చర్మం రంగు మారుతుంటుంది. నల్లగా అయిపోతుంది. మీ పాదాలు చల్లబడిపోతుంటాయి. టచ్ చేయాలంటే చల్లగా ఉంటాయి. మీ గోళ్లు మందంగా మారొచ్చు. లేదా ఆకృతి మారొచ్చు. రంగు కోల్పోవచ్చు..’ అని డాక్టర్ హిందారియా చెప్పారు.

కండరాలు బలహీనపడడం కూడా పీఏడీలో భాగమే. రక్త ప్రసరణ తగ్గిపోవడంతో కణాలు, టిష్యూలు, నరాలు దెబ్బతింటాయి. స్కిన్‌ అల్సర్లు మొదలవుతాయి. చిన్న గాయమైన పుండ్లు పడతాయి. నయం కావడానికి చాలా సమయం పడుతుంది.

Signs of high cholesterol in eyes: అధిక కొలెస్ట్రాల్ వల్ల కళ్లల్లో సంకేతాలు

అధిక కొలెస్ట్రాల్ వల్ల దెబ్బతినే ప్రాంతం కళ్లు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల శాంథెలస్మాస్ అనే దుష్ప్రభావం ఏర్పడుతుంది. అంటే పసుపు రంగులో ఉన్న కొవ్వు నిల్వలు కను రెప్పల్లో వచ్చి చేరుతాయి.

‘ఈ నిల్వలను సాధారణంగా చర్మ సమస్యలుగా భావిస్తారు. కానీ వీటి వల్ల ఎలాంటి అపాయం లేదు. కొన్ని కేసుల్లో ఈ స్థితి హైపర్‌లిపిడేమీయా వంటి ఇతర పరిస్థితులను సూచిస్తుంది. వైద్యులు తగిన పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు..’ అని డాక్టర్ చౌటి చెప్పారు.

‘కళ్ల కింది చర్మం నారింజ లేదా పసుపురంగులోకి మారుతుంది. లేదా ఆ రంగుల్లో మచ్చలు కనిపిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి ఇవి సంకేతాలు. ఇవి కనిపిస్తే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించాలి. కొలెస్ట్రాల్ వల్ల వచ్చే ఈ లక్షణాలు వెంటనే రావు. చాలా కాలం పడుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆ సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇలా పసుపు, నారింజ, తెలుపు మచ్చలు కనిపిస్తే వైద్య పరిభాషలో దానిని ఆర్కస్ సెనైలిస్ అంటారు. ఇది 35 ఏళ్ల వయస్సు తరువాత కనిపిస్తుంది..’ అని డాక్టర్ ఆరోరా వివరించారు.

అధిక కొలెస్ట్రాల్ రెటినా నాళాలపై కూడా ప్రభావం చూపుతుంది. కంటి వెనక ప్రాంతంలో ఉండే అత్యంత సున్నితమైన ఈ ప్రాంతానికి రెటినల్ ఆర్టరీ ద్వారా రక్తం సరఫరా అవుతుంది.

‘ఒక కన్ను కనిపించకపోవడం, మసక బారడం, నల్లని వలయాల్లో దృశ్యాలు కనిపించడం, ప్రభావితమైన కంటిలో నొప్పి ఉండడం వంటి విభిన్న లక్షణాలు కనిపిస్తాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల కార్నియాలో కొలెస్ట్రాల్ నిల్వలు పెరుగుతాయి. దాని చుట్టూ నీలం లేదా బూడిద రంగు వలయాలు ఏర్పడుతాయి..’ అని డాక్టర్ హిందారియా చెప్పారు.

Signs of cholesterol in tongue: కొలెస్ట్రాల్ వల్ల నాలుకలో కనిపించే లక్షణాలు

అధిక కొలెస్ట్రాల్ వల్ల నాలుక కూడా ప్రభావితమవుతుంది. హెయిరీ టంగ్ అనే దుష్ప్రభావం ఏర్పడుతుంది. నాలుక ఉపరితలంపై ఉండే చిన్న బుగ్గలు పెద్దవిగా, రంగులేనివిగా మారుతాయి.

‘ఈ మార్పులు నాలుకపై వెంట్రుకలు ఉన్న తరహాలో కనిపిస్తాయి. ఇవి తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తాయి. ఇదేమంతా హానికరం కాదు. కానీ దుర్వాసనకు దారితీస్తాయి. నోట్లో ఒక చెడు రుచి అనిపిస్తుంది..’ అని డాక్టర్ చౌటీ చెప్పారు.

‘నాలుక కొన ఊదా నీలి రంగులోకి మారుతుంది. ఇవి రక్తం స్తంభించిపోయిన మరకలు అయి ఉండొచ్చు..’ అని డాక్టర్ హిందారియా చెప్పారు.

శరీరంలోని విభిన్న అవయవాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల ధమనులు పూడుకుపోతుంటాయి. దీని కారణంగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. పోషకాలు అందవు. చేతులు, కాళ్ల గోర్లు, చర్మం రంగు మారుతుంది. ఈ లక్షణాలను నాలుకపై కూడా గమనించవచ్చు. నాలుక పసుపు రంగులోకి మారుతుంది..’ అని డాక్టర్ అరోరా వివరించారు.

అయితే ఈ లక్షణాలు వేరే వ్యాధుల వల్ల కూడా కనిపించవచ్చని, అందువల్ల సరైన డయగ్నోసిస్ అవసరం అని డాక్టర్ చౌటీ చెప్పారు.

‘అధిక కొలెస్ట్రాల్ ఒక్కోసారి ఎలాంటి లక్షణాలను చూపదు. అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు వీలుగా తరచూ చెకప్స్ కోసం వెళ్లాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించడం వల్ల అధిక కొలెస్ట్రాల్‌ను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు అదుపులో ఉంచుకోవడం, పొగ తాగకపోవడం వంటి జీవనశైలిని అనుసరించాలి.. ’ అని డాక్టర్ చౌటీ సూచించారు.

WhatsApp channel