Weight loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 రకాల కాంబినేషన్లతో దెబ్బే
Weight loss: బరువు తగ్గాలనుకుంటే 5 రకాల ఫుడ్ కాంబినేషన్లను దూరం పెట్టాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గాలనుకున్నప్పుడు మీరు తినే ఆహారంపై జాగరూకతతో ఉండాలి. లేదంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు వెయిట్ తగ్గాలనుకున్న మీ ప్రయత్నాలను విఫలం చేస్తాయి. ఇతర కొవ్వు పదార్థాలతో కలిసి కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే మొదటికే మోసం వస్తుంది. అందువల్ల మీరు వేటిని మీ డైట్ నుంచి తొలగించాలో, ఏ పోషక ఆహారాలు చేర్చుకోవాలి తెలుసుకుంటే మీ వెయిట్ లాస్ జర్నీ సాఫీగా సాగుతుంది. అలాగే పోషక అవసరాలు తీరి మీ ఎనర్జీ లెవెల్స్ యథాతథంగా ఉంటాయి. ఇక మీ ఆహారం మరింత టేస్టీగా ఉండేందుకు మీకు నచ్చిన మార్పులు కూడా చేసుకోవచ్చు.
మీరు ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారనే దానిని బట్టి కూడా క్యాలరీలు మారుతాయి. డీప్ ఫ్రై చేయడానికి బదులుగా ఉడికించినవి, ఆవిరిపై ఉడింకించినవి చాలా మేలు చేస్తాయి. కొన్ని రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు జత చేయడం వల్ల రుచిని కూడా పెంచుకోవచ్చు. నిమ్మరసం, తేనె, ఖర్చూరాలు, డ్రై ఫ్రూట్స్ వంటివి కలపడం వల్ల మీకు నచ్చిన రుచి ఉండేలా చూసుకోవచ్చు. ఇక కొన్ని రకాల ఆహారాలను కలిపి తినకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అన్నం-ఆలుగడ్డ, చికెన్-పప్పు ధాన్యాలు, పాలు-అరటి పండు వంటి కాంబినేషన్లను విడిచిపెట్టాలని సూచిస్తున్నారు.
‘కొత్త సంవత్సరంలో చాలా మంది బరువు తగ్గాలని రిజల్యూషన్ చేసుకుని ఉంటారు. గత ఏడాది కంటే ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. మరింత ఆరోగ్యకరమైన డైట్‌పై మనం ఫోకస్ చేస్తాం. వ్యాయామం చేస్తాం. అయితే మనం ఏం తింటున్నామో ఒక్కోసారి విస్మరిస్తాం. తరచుగా మనం తినే కొన్ని కాంబినేషన్ ఆహారాలు మన వెయిట్ లాస్ జర్నీకి భంగకరంగా ఉంటాయి..’ అని డైట్ స్టూడియో ఫౌండర్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ కోమల్ పటేల్ సూచించారు.
హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బరవు తగ్గాలనుకునే వారు 5 రకాల ఫుడ్ కాంబినేషన్స్‌కు దూరంగా ఉండాలని కోమల్ పటేల్ సూచించారు.
1. Rice and potato: అన్నం, ఆలుగడ్డ కాంబినేషన్
వరి అన్నంలో అత్యధికంగా కార్బొహైడ్రేట్లు ఉంటాయి. పెద్ద మొత్తంలో వరి అన్నం తినడం బరువు పెరగడానికి దారితీస్తుంది. అన్నం అరగడం సులువే అయినప్పటికీ, దాని పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆలుగడ్డతో కలిపి వరి అన్నం తీసుకోవడం మంచి కాంబినేషన్ అనిపించుకోదు. అవి రెండూ బరువు పెరగడానికి కారణమవుతాయి. ఆలుగడ్డలో స్టార్చ్ రూపంలో ఉండే కార్బొహైడ్రేట్లు అన్నంతో కలిపి తీసుకున్నప్పుడు అధిక క్యాలరీలు జతకలుస్తాయి. విడిగా చిన్న పరిమాణాల్లో తీసుకుంటే అవి మీ శరీరానికి హాని చేయవు.
2. White bread and frozen yogurt: వైట్ బ్రెడ్-ఫ్రోజెన్ యోగర్ట్
సమయం ఆదా చేసుకోవడానికి వీలుగా మనం తరచూ శాండ్‌విచ్, ఫ్రోజెన్ యోగర్ట్ కలిపి తీసుకుంటాం. అయితే వైట్ బ్రెడ్‌లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీరు బరువు తగ్గాలనుకుంటే ఇది తినడం మంచిది కాదు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ గానీ, బ్రౌన్ బ్రెడ్ గానీ పరవాలేదు. వీటిలో కాస్త పోషకాలు ఉంటాయి. అలాగే ఫ్రోజెన్ యోగర్ట్‌లో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కూడా వెయిట్ లాస్ జర్నీకి ఇబ్బందులే.
3. Chicken and lentil: చికెన్ - పప్పులు
కొన్నిసార్లు ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా జీర్ణ క్రియ పాడవుతుంది. దీని వల్ల మీ తప్పిదం లేకుండానే అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది. ఒకవేళ మీరు ప్రోటీన్ ఆధారిత ఆహారాలు చికెన్, పప్పు వంటివి తినాలంటే వాటిని వేర్వేరు భోజన సమయాల్లో తీసుకోండి. రెండూ కలిపి తినొద్దు. లేదంటే అది కడుపు ఉబ్బరానికి, అజీర్ణానికి దారితీస్తుంది.
4. Processed snacks with beverages: స్నాక్స్, పానీయాల విషయంలో జాగ్రత్త
స్నాక్స్‌తో పాటు మనం టీ లేదా కాఫీ తీసుకోవడం సర్వసాధారణమైన అలవాటు. ఈ కాంబినేషన్ ఎసిడిటీకి దారితీస్తుంది. అయితే అధికంగా ప్రాసెస్ చేసిన బిస్కెట్లు, కుకీలు వంటి వాటిలో షుగర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నిల్వ చేసేందుకు ఉపయోగించే ప్రిజర్వేటివ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి మీ శరీర బరువును పెంచేస్తాయి. అలాగే వీటిలో కొన్ని రకాల స్నాక్స్‌ను బాగా డీప్ ఫ్రై చేస్తారు. అది మీరు దీర్ఘకాలంలో బరువు పెరిగేందుకు కారణమవుతుంది.
5. Milk and banana: పాలు, అరటి పండ్లు
పాలు, అరటి పండ్లు అద్భుతమైన ఆహారాలు. అమోఘమైన పోషక విలువలు వీటిలో ఉంటాయి. అయితే రెండింటినీ కలిపి తినడం వల్ల పోషక విలువలు నష్టపోతాయి. అంతేకాకుండా బరువు పెరిగేందుకు కారణమవుతాయి. అందువల్ల ఈ రెండింటి మధ్య కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చి తీసుకోండి.
టాపిక్