Jaggery in Winter: బెల్లంలో వీటిని కలుపుకొని తినండి చాలు, ఎంతటి చలినైనా తట్టుకుంటారు-jaggery in winter just mix sesame seeds in jaggery and eat them they will withstand any cold ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jaggery In Winter: బెల్లంలో వీటిని కలుపుకొని తినండి చాలు, ఎంతటి చలినైనా తట్టుకుంటారు

Jaggery in Winter: బెల్లంలో వీటిని కలుపుకొని తినండి చాలు, ఎంతటి చలినైనా తట్టుకుంటారు

Haritha Chappa HT Telugu
Jan 02, 2024 01:00 PM IST

Jaggery in Winter: చలిని తట్టుకునే శక్తి శరీరానికి ఇవ్వాలంటే ప్రతిరోజూ బెల్లాన్ని తినాలి.

చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి?
చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి? (pixabay)

Jaggery in Winter: చలికాలాన్ని తట్టుకోవడం కొందరికి చాలా కష్టం. ముఖ్యంగా చలికాలంలోనే గుండెపోటు వంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా చలికాలంలో బలహీనంగా ఉంటుంది. అందుకే శీతాకాలంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తినాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినడం వల్ల శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలాగే శరీరానికి ఉష్ణోగ్రతను అందించే పదార్థాలను ఎంచుకొని తినాలి. రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాల్లో బెల్లం ఒకటి. బెల్లాన్ని ప్రతిరోజు చిన్న ముక్క తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఖచ్చితంగా బెల్లం మొదటి స్థానంలో ఉంటుంది. ఒకే ఒక్క బెల్లం తింటే అందే పోషకాల కన్నా... బెల్లంలో కాస్త నువ్వులు కలుపుకొని తింటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో బెల్లం, నువ్వులు కలిపి లడ్డూల్లా చేసుకుని తింటే పోషకాలు అందడంతో పాటు శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రత లభిస్తుంది. గుండెపోటు బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి.

బెల్లం తినడం వల్ల శక్తి వెంటనే అందుతుంది. అలాగే నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది రోజంతా స్థిరంగా శక్తి అందేలా చేస్తాయి. ఆయుర్వేదం వంటి సాంప్రదాయ వైద్య విధానాల్లో బెల్లం, నువ్వులను శరీరానికి వెచ్చదనాన్ని అందించే పదార్థాలుగా చెబుతారు. ఈ ఆహారాలను తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. చల్లని వాతావరణంలో శరీరం వేడిగా ఉండడం అత్యవసరం.

నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివి అధికంగా ఉంటాయి. ఇక బెల్లంలో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి కావలసినవే. బెల్లంలో జీర్ణ లక్షణాలు ఎక్కువ. కాబట్టి జీర్ణ వ్యవస్థకు మంచి జరుగుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది. నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల కీళ్ల నొప్పులు వంటివి తగ్గుతాయి.

బెల్లంలో ఉండే విటమిన్ సి... నువ్వుల్లో ఉండే నాన్ హీమ్ ఇనుము శోషణను పెంచుతుంది. ఇనుము లోపం ఉన్నవారు ప్రతిరోజు బెల్లం, నువ్వులతో చేసిన ఆహారాలను తినాలి. రక్తహీనత సమస్య నుండి వారు త్వరగా బయటపడతారు. నువ్వుల్లో సెసామిన్, సెసామాల్తో... అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను నశించకుండా కాపాడతాయి. అలాగే బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగానే ఉంటాయి. బెల్లం గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువే. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచదు. మధుమేహం ఉన్నవారు చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల లాభాలను పొందవచ్చు.

Whats_app_banner