Bellam Appalu: పిల్లల కోసం బెల్లం అప్పాలు, ఆరోగ్యానికి ఎంతో మేలు-bellam appalu recipe in telugu snakcs for evening ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bellam Appalu: పిల్లల కోసం బెల్లం అప్పాలు, ఆరోగ్యానికి ఎంతో మేలు

Bellam Appalu: పిల్లల కోసం బెల్లం అప్పాలు, ఆరోగ్యానికి ఎంతో మేలు

Haritha Chappa HT Telugu
Dec 13, 2023 03:44 PM IST

Bellam Appalu: సాయంత్రం అయితే పిల్లలకు స్నాక్స్ గా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? ఒకసారి బెల్లం అప్పాలు పెట్టి చూడండి.

బెల్లం అప్పాలు
బెల్లం అప్పాలు (Youtube)

Bellam Appalu: స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు స్నాక్స్ కోసం మారాం చేస్తారు. బయట దొరికే పదార్థాలను ప్రతిరోజూ పెడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంట్లోనే తయారు చేసి పెట్టడం మంచిది. ముఖ్యంగా వారికి పోషకాహారలేమి, రక్తహీనత రాకుండా చూసే ఆహారాలను తినిపించాలి. పిల్లలు అధికంగా రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వారికి బెల్లంతో చేసిన స్నాక్స్ ను తినిపిస్తే మంచిది. అలాంటి వాటిల్లో బెల్లం అప్పాలు ఒకటి. వీటిని తయారు చేయడం చాలా సులువు. ఒక్కసారి తయారు చేసుకుంటే వారం రోజులు పాటు నిల్వ ఉంటాయి. వీటిని తినిపించడం వల్ల శరీరానికి శక్తి అందడంతో పాటు ఐరన్ పుష్కలంగా చేరుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య రాదు. రక్తహీనత సమస్య లేని పిల్లలు ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. నీరసం వారి దరిచేరదు. ఇప్పుడు బెల్లం అప్పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం.

బెల్లం అప్పాల తయారీకి కావలసిన పదార్థాలు

బియ్యప్పిండి - ఒక కప్పు

బొంబాయి రవ్వ - ఒక కప్పు

బెల్లం తురుము - రెండు కప్పులు

గోధుమపిండి - ఒక కప్పు

యాలకుల పొడి - ఒక స్పూను

కొబ్బరి తురుము - అరకప్పు

నెయ్యి - నాలుగు స్పూన్లు

నూనె - సరిపడినంత

బెల్లం అప్పాల తయారీ

1. ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యప్పిండి, గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి తురిమిన బెల్లాన్ని వేసి మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి.

3. బెల్లం నీళ్లు మరుగుతున్నప్పుడే యాలకుల పొడిని, ఎండుకొబ్బరి తురుమును, రెండు స్పూన్ల నెయ్యి వేసి కలపాలి.

4. ఇప్పుడు చిన్న మంట మీద ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి.

5. గరిటతో కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటాయి. ఉండలు కడితే బెల్లం అప్పాలు సరిగా రావు.

6. మొత్తం పిండిని వేసాక బాగా కలిపి ఉండలు లేవని నిర్ధారించుకున్నాక మూత పెట్టాలి. ఒక నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.

7. పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చపాతీలకు ఎలా అయితే ఉండలు కట్టుకుంటామో అలా ఉండలు చుట్టుకోవాలి.

8. చేతికి నెయ్యి రాసుకొని చుట్టుకుంటే అంటకుండా ఉంటుంది. అలా చేసుకున్న ఉండలను చేత్తోనే గుండ్రంగా అప్పాల్లా ఒత్తుకోవాలి.

9. అప్పాలు మరీ మందంగా కాకుండా అలా అని పలుచగా కాకుండా ఒత్తుకోవాలి.

10. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

11. నూనె బాగా వేడెక్కాక ఒత్తుకున్న అప్పాలను నూనెలో వేసి వేయించాలి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.

12. అప్పాలు బూరెల్లా పొంగుతాయి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

13. టిష్యూ పేపర్లో ఉంచి నూనెను పీల్చుకునేలా చేయాలి. తర్వాత వాటిని ఒక క్యాన్‌లో భద్రపరచుకోవాలి.

14. వీటిని వారం రోజులు పాటు తినవచ్చు. రుచి అదిరిపోతుంది.

15. పంచదార వేసి చేసే వాళ్ళు ఎంతోమంది. పంచదార కన్నా బెల్లాన్ని వాడడం వల్లే ఆరోగ్యకరం. పంచదార తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదు.

Whats_app_banner