Jaggery: కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను బెల్లం కాపాడగలదా? ప్రయోజనాలు ఇవే
Jaggery benefits: దీపావళి వల్ల కొందరిపై వాయు కాలుష్యం ప్రభావం పడి ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు ఎదురై ఉంటాయి. అయితే, కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు కలిగి ఈ సమస్యను తగ్గేందుకు బెల్లం ఉపయోగపడుతుందా అనేది ఇక్కడ చూడండి.
ఇటీవలే దీపావళి పండుగ జరిగింది. టపాసులు భారీస్థాయిలో కాల్చడం వల్ల వాయు కాలుష్యం ప్రభావం కొందరిపై పడి ఉంటుంది. ఊపిరితిత్తులపై కూడా ఎఫెక్ట్ పడి ఉంటుంది. జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులను కూడా కొందరు ఎదుర్కొంటూ ఉండొచ్చు. వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తులకు ఏర్పడిన ఈ సమస్యలు తగ్గేందుకు బెల్లం సహకరిస్తుంది. అదెలానో ఇక్కడ చూడండి.
ఊపిరితిత్తులు క్లీన్ అయ్యేందుకు..
బెల్లంలో చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. అలాగే, శరీరం పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి వెళ్లేందుకు బెల్లం ఉపకరిస్తుంది. బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అయ్యేందుకు కూడా తోడ్పడుతుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని బెల్లం పెంచగలదు. కాలుష్యం నుంచి వచ్చే దుష్ప్రభావాన్ని బెల్లం తగ్గించగదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజు ఓ బెల్లం ముక్క తినడం వల్ల వాయుకాలుష్యం కలిగే రిస్క్ తగ్గుతుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు తేల్చాయి.
జలుబు, దగ్గుకు..
జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గేందుకు కూడా బెల్లం సహాయపడుతుంది. ఇందులోని వెచ్చని గుణం గొంతు నొప్పి, గరగర తగ్గేందుకు తోడ్పడుతుంది. బెల్లం కలిపిన హెర్బల్ టీలు తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
రోగ నిరోధక శక్తి మెరుగయ్యేలా..
బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి శరీరం సమర్థంగా పోరాడేందుకు ఛాన్స్ పెరుగుతుంది. బ్యాక్టిరియా, వైరస్‍ల వల్ల కలిగే శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండడం చాలా ముఖ్యం.
అలర్జీలు తగ్గేలా..
బెల్లం తీసుకోవడం వల్ల కొన్ని రకాల అలర్జీల నుంచి ఉపశమనం దక్కుతుంది. బెల్లంలో యాంటీ అలర్జిటిక్ గుణాలు ఉంటాయి. ఇవి అందుకు ఉపయోగపడతాయి.
ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల బెల్లం శరీరానికి శక్తిని అందించగలదు. నీరసం రాకుండా చేస్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచగలదు. బెల్లంలో గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది.
రోజూ ఎంత తినాలి?
రోజులో 15 గ్రాముల వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. నేరుగా కూడా తినవచ్చు. లేకపోతే టీల్లో కలుపుకొని, వంటల్లో వేసుకొని తీసుకోవచ్చు. రెగ్యులర్‌గా మోతాదు మేరకు బెల్లం తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.