Immunity Boost Tips in Winter: చలికాలం వచ్చేసింది.. రోగ నిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు ఇవే.. తప్పక ఫాలో అవండి!
Immunity Boost Tips in Winter: చలికాలంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిద్వారా రోగాల నుంచి రక్షణ పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి మెరుగయ్యేందుకు ఈ చిట్కాలు పాటించండి.
చలికాలం దాదాపు అడుగుపెట్టేసింది. వాతావరణం చల్లగా మారుతోంది. చలికాలంలో జలుబు, దగ్గు సహా వివిధ ఇన్‍ఫెక్షన్లు, వ్యాధుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే రోగాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండేలా శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ బాగుంటే రోగాలు దరిచేరే ప్రమాదం తగ్గుతుంది. చలికాలంలో రోగ నిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) మెరుగుపరుచుకునే ముఖ్యమైన మార్గాలు ఇవే..
పోషకాలతో కూడిన ఆహారం
రోగ నిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పోషకాలు ఉండే ఫుడ్స్ తినాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మీరు తినే ఆహారంలో విభిన్న రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్, విటమిన్ ఈ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. నట్స్ కూడా తీసుకోవాలి.
సరిపడా నీరు కచ్చితంగా..
శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉన్న కారణంగా ఎక్కువగా దాహం వేయదు. అందుకే కొందరు శరీరానికి సరిపడా నీరు తాగరు. అయితే, రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే నీరు బాగా తాగాలి. ఇమ్యూన్ కణాలు బాగుండాలన్నా, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లాలంటే సరిపోయినంత నీరు తప్పకుండా తాగాలి.
శారీరక వ్యాయామం
ఇమ్యూనిటీ పెరగాలంటే శారీరక వ్యాయామం కూడా చాలా ముఖ్యం. ప్రతీ రోజు ఎక్సర్‌సైజ్‍లు చేయాలి. వ్యాయామం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీనివల్ల తెల్లరక్త కణాల ఉత్పత్తికి మేలు జరుగుతుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజులో కనీసం 30 నిమిషాలైనా వ్యాయమం చేస్తే మంచిది. చలికాలంలో ఉదయం చలి ఎక్కువగా ఉన్న కారణంగా కొందరు వ్యాయామాన్ని వదిలేస్తుంటారు. అలా కాకుండా ప్రతీ రోజు వ్యాయామాలు చేయాలి.
రోగ నిరోధక శక్తిని పెంచే డ్రింక్స్
చలికాలంలో రోగ నిరోధక శక్తి పెంచే డ్రింక్స్ తీసుకోవడం మేలు. పసుపు కలిపిన గోరువెచ్చని పాలు, నిమ్మరసం నీరు, అల్లం టీ, అలోవెరా జ్యూస్, దానిమ్మ రసం లాంటివి తాగాలి. వీటి వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
సరిపడా నిద్ర
రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండడంలో నిద్ర కూడా కీలకపాత్ర పోషిస్తుంది. నిద్రిస్తున్న సమయంలో శరీరంలో రిపేర్ జరుగుతుంది. ఇమ్యూనిటీ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అందుకే తగినంత నిద్ర అందరికీ అవసరం. నాణ్యమైన నిద్ర పట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలి. ఒత్తిడి అధికంగా ఉంటే ఇమ్యూనిటీపై ప్రభావం పడుతుంది. అందుకే ఒత్తిడి తగ్గేందుకు ధ్యానం, బ్రీత్ ఎక్సర్‌సైజ్‍ల్లాంటివి చేయాలి.