Menstrual Hygiene Day: పీరియడ్స్ సమయంలో శుభ్రత పాటించకపోతే.. జరిగే నష్టాలివే..-impact of poor menstrual hygiene and ways to improve ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Impact Of Poor Menstrual Hygiene And Ways To Improve

Menstrual Hygiene Day: పీరియడ్స్ సమయంలో శుభ్రత పాటించకపోతే.. జరిగే నష్టాలివే..

నెలసరి శుభ్రత
నెలసరి శుభ్రత (File photo)

Menstrual Hygiene Day: ఇవాళ నెలసరి పరిశుభ్రత దినోత్సవం.. పీరియడ్స్ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ఆరోగ్య సమస్యలు గురించి తెలుసుకుందాం.

మెన్‌స్ట్రువల్ హైజీన్ డే ను మే 28 న జరుపుతారు. నెలసరి సమయంలో శుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇది తెలియజేస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (2020-21) ప్రకారం 15 నుంచి 24 వయస్సు మధ్యలో ఉన్న 30 శాతం కన్నా ఎక్కువ మంది నెలసరి సమయంలో సరైన శుభ్రత విధానాలు పాటించట్లేదని తేలింది.

ట్రెండింగ్ వార్తలు

సరైన అవగాహన లేకపోవడం, అపరిశుభ్రత వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయి. అందుకే దానివల్ల జరిగే హాని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1. ఇన్ఫెక్షన్లు:

యీస్ట్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నెలసరి సమయంలో అపరిశుభ్రత వల్ల వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి 4 నుంచి 6 గంటలకోసారి తప్పకుండా శ్యానిటరీ న్యాప్‌కిన్ మార్చుకోవాలి. ఒకవేళ రియూజబుల్ క్లాత్ ప్యాడ్స్, లేదా మెన్‌స్ట్రువల్ కప్స్ వాడుతుంటే.. వాటిని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసి, ఎండలో ఆరనివ్వాలి. ఆ తరువాతే ఉపయోగించాలి.

2. దురద, ర్యాషెస్:

శ్యానిటరీ న్యాప్‌కిన్ ఎక్కువ సేపు మార్చకుండా ఉంచుకుంటే దురద, ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ సేపు దురద వస్తే క్రమంగా చర్మం ఎరుపెక్కడం, నొప్పి మొదలవుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువగా పీల్చుకునే తత్వం, గాలి ప్రసరణ ఉన్న శ్యానిటరీ ఉత్పత్తుల్ని వాడాలి. రోజుకు రెండు నుంచి మూడు సార్లు గోరువెచ్చని నీళ్లతో వజైనా ప్రాంతాన్ని శుభ్రం చేసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి.

3. సంతాన సమస్యలు:

పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో సంతానోత్పత్తి మీద ప్రభావం పడుతుంది. మీ నెలసరి సమయంలో ఏదైనా మార్పు కనిపిస్తే వైద్యుల్ని సంప్రదించడం ద్వారా ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నొప్పి, రక్తస్రావంలో మార్పులు, లేదా డిశ్చార్జిలో మార్పులను గమనించాలి. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

4. చేతుల శుభ్రత:

ప్యాడ్ మార్చుకునే ముందు తరువాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి. కనీసం రెండు నిమిషాల పాటూ మంచి హ్యాండ్ వాష్ ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. లేదంటే యీస్ట్ ఇన్ఫెక్షన్లు, హెపటైటిస్ బి వచ్చే ప్రమాదం ఉంది.

5. ఇబ్బందులు రాకుండా:

నెలసరి సమయంలో శుభ్రత పాటించకపోతే రోజూవారీ పనితీరు మీద ప్రభావం పడుతుంది. ఆఫీసుకు, కాలేజీకి వెళ్లినపుడు ఏదైనా మరక అంటుతుందేమో అనే భయం సరైంది కాదు. మీకు సౌకర్యాన్నిచ్చే శ్యానిటరీ ఉత్పత్తి ఎంచుకోవాలి. మీ అవసరాల్ని అది తీర్చగలగాలి.