Mobile Using: మొబైల్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయ్
Mobile Using: ఈ మధ్యకాలంలో మొబైల్ వాడకం చాలా పెరిగిపోయింది. మొబైల్ వాడడం వల్ల మెదడులో కణితులు ఏర్పడే అవకాశం ఉందని భయం ఎంతో మందిలో ఉంది. దీని గురించి కొత్త పరిశోధన ఏం చెబుతుందో చూద్దాం.
Mobile Using: మెదడులో అసాధారణంగా కణాలు అభివృద్ధి చెందితే అవి కణితుల్లా ఏర్పడతాయి. ఆ కణితులే బ్రెయిన్ ట్యూమర్. అవి అక్కడ నుంచి ఇతర అవయవాలకు కూడా వ్యాపించవచ్చు. కొన్ని ఎలాంటి అపాయాన్ని చేయకపోతే, మరికొన్ని ప్రాణాంతక క్యాన్సర్లుగా మారుతాయి. ప్రతీ ఏడాది మన దేశంలో ఎంతోమంది ఈ బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్నారు.
తాజా డేటా ప్రకారం బ్రెయిన్ ట్యూమర్ కేసులు అధికంగా ఉన్న దేశాల్లో మన దేశం పదో స్థానంలో ఉంది. మెదడులో కణితులు ఏర్పడడానికి వయస్సుతో సంబంధం లేదు. స్త్రీ పురుష తేడా లేదు. ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ ట్యూమర్ వస్తే అది క్యాన్సర్ గా మారి మరణానికి దారితీస్తుంది.
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ సంస్థ చెబుతున్న ప్రకారం మన దేశంలో బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్న వారిలో 24 వేల మంది ఏటా మరణిస్తున్నట్టు అంచనా. అలాగే ఏటా 50000 కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు
బ్రెయిన్ ట్యూమర్ వస్తే తలనొప్పిగా అనిపిస్తుంది. మూర్చలు వచ్చే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఏకాగ్రత ఉండదు. ప్రవర్తనలో తేడాగా ఉంటుంది. మానసికంగా కూడా వారు భిన్నంగా ప్రవర్తిస్తారు. దృష్టి అస్పష్టంగా మారిపోతుంది. ముఖం లేదా శరీరం ఒకవైపు బలహీనంగా అనిపించడం, తిమ్మిరి పట్టినట్టు అనిపించడం జరుగుతుంది. వికారం, వాంతులు కనిపిస్తాయి.
బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది?
మెదడులో కణితులు ఎందుకు వస్తాయి? అనేదానికి ఇప్పటివరకు కచ్చితంగా కారణాలు కనిపెట్టలేకపోయారు. కొందరిలో వారసత్వంగా వస్తే, మరికొందరు రేడియేషన్‌కు తీవ్రంగా గురి కావడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉందనే వాదన ఉంది.
మొబైల్ ఫోన్ వాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయా అనే ప్రశ్నకు జవాబు కనిపెట్టేందుకు ఎన్నో అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. సెల్ ఫోన్లు నుండి వచ్చే విద్యుదయస్కాంత వికిరణం మెదడులో కణితిలో ఏర్పడడానికి కారణం అవుతుందని వాదన కూడా ఉంది. ఎక్కువ కాలం ఫోన్ ఉపయోగించడం వల్ల సాధారణ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పిల్లలపైనే ఈ ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది.
కేవలం ఫోన్ వల్లే బ్రెయిన్లో ట్యూమర్లు వస్తాయి అనడానికి ఇంకా సరైన ఆధారం లభించలేదు. కానీ ఫోన్ వాడకం మాత్రం మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా చెడగొడుతుందని మాత్రం అధ్యయనకర్తలు చెబుతున్నారు. వీలైనంతవరకు ఫోన్ వినియోగించడం ఎంత తగ్గించుకుంటే మెదడు అంత ఆరోగ్యంగా ఉంటుందని వివరిస్తున్నారు.
ఎవరికైనా పదే పదే తలనొప్పి రావడం, దీర్ఘకాలంగా చూపు అస్పష్టంగా కనిపించడం, చెవుల్లో ఈలలు వేసినట్లు శబ్దాలు రావడం, కళ్ళు తిరగడం, మూర్చ పోవడం వంటివి ఉంటే వాటిని తేలికగా తీసుకోకూడదు. మెదడు కణితుల మరణం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
టాపిక్