Cotton Candy: గులాబీ రంగు పీచు మిఠాయిలో క్యాన్సర్ కారకాలు, ఆ రంగు వల్లే ఈ అనారోగ్యం
Cotton Candy: పీచుమిఠాయి పేరు చెబితేనే చాలామందికి నోరూరిపోతుంది. ఒకప్పుడు పీచు మిఠాయి స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు అదనపు రంగులను కలిపి కృత్రిమంగా తయారు చేస్తున్నారు.
Cotton Candy: పీచు మిఠాయిని చక్కెరతో చేస్తారు. దూదిలాగా ఉంటుంది. తీపిగా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు దీన్ని చాలా ఇష్టంగా తినేవారు. పూర్వం దీని రంగు తెలుపులోనే ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మరింత ఆకర్షణీయంగా చేయడం కోసం గులాబీ రంగును కలిపి తయారుచేస్తున్నారు. ఇలా కృత్రిమ రంగులు కలిపి చేసే పీచు మిఠాయి చాలా ప్రమాదకరం. ఆ కృత్రిమ రంగులో క్యాన్సర్ కారకం ఉన్నట్టు తేలింది. అందుకే కొన్ని రాష్ట్రాలు ఈ పీచు మిఠాయిపై నిషేధం విధించడం మొదలుపెట్టాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా ఒక్కో రాష్ట్రం ఈ గులాబీ రంగు పీచు మిఠాయిపై నిషేధం విధిస్తూ వస్తోంది.
పీచు మిఠాయి దూది పొరల్లా ఉంటుంది, పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. చిన్న గుండ్రటి యంత్రంలో కరిగించిన చక్కెరను వేసి దారపు పోగుల్లా వచ్చేలా చేస్తారు. దాన్ని చిన్న కర్ర పుల్లకు చుట్టి ఇస్తారు. ఈ గులాబీ రంగు పీచు మిఠాయి చిన్న కవర్లలో పెట్టి అమ్మడం మొదలుపెట్టారు. సర్కస్‌లు, జాతరలు, సంతలు... ఎక్కడ జరిగినా రంగురంగుల పీచు మిఠాయిలు కనిపిస్తాయి. తెల్లని పీచు మిఠాయికి వేరే రంగు రావాలంటే ఖచ్చితంగా రసాయనాలు కలిసిన రంగులను వాడాల్సిందే. వాటి వల్లే పీచు మిఠాయి క్యాన్సర్ కారకంగా మారుతుంది.
క్యాన్సర్ కారకమైన రోడమైన్ బి అనే రసాయనం ఉన్నట్టు తాజా పరీక్షల్లో తేలింది. అందుకే పుదుచ్చేరి ప్రభుత్వం, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు ఈ పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించాయి. తమిళనాడులోని చెన్నైలో మెరీనా బీచ్ లో విక్రయిస్తున్న పీచుమిఠాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పీచు మిఠాయిలో ఉండే రోడమైన్ బి అనే రసాయనం చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలో చేరాక 45 రోజులు పాటు అక్కడే ఉంటుంది. అది శరీరం నుంచి బయటికి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. ఈ రసాయనం నాడీ వ్యవస్థ ,మెదడు, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఎన్నో కణాలను నిర్వీర్యం చేస్తాయి. భవిష్యత్తులో క్యాన్సర్ కణితులు పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి రంగురంగుల పీచు మిఠాయిలను చూసి పిల్లలకు కొని ఇవ్వకండి. వారి ఆరోగ్యాన్ని మీరే ప్రమాదంలోకి నెట్టినవారవుతారు.
పీచు మిఠాయిని వందేళ్ళ క్రితం నుంచి మనం తింటున్నాం. అప్పట్లో ఇలా కృత్రిమ రంగులను కలిపేవారు కాదు. 1897వ సంవత్సరంలోని అమెరికాలో పీచు మిఠాయిని తయారు చేసే యంత్రాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత ఎక్కడ సంతలు, జాతరలు జరిగినా ఈ పీచు మిఠాయి అమ్మకాలు జరగడం మొదలయ్యాయి. దీన్ని కాటన్ క్యాండీ అని పిలుస్తారు. అమెరికాలో పీచు మిఠాయి కోసం ఒక దినోత్సవం కూడా ఉంది. ప్రతి ఏడాది డిసెంబర్ 7న ‘నేషనల్ కాటన్ క్యాండీ డే’ నిర్వహించుకుంటారు.
టాపిక్