LML Electric Bike | అలనాటి LML బ్రాండ్ పునరాగమనం.. ఎలక్ట్రిక్ బైక్‌ల వివరాలు ఇవే
ఒకప్పటి ఐకానిక్ LML వెస్పా స్కూటర్ గుర్తుందా? ఇప్పుడు ఆ బ్రాండ్ మీద ఎలక్ట్రిక్ స్కూటర్లు, హైపర్ బైక్‌లు, సైకిళ్లు (LML Electric Bike, Scooter), రాబోతున్నాయి. వివరాలు చూడండి.
లోహియా మెషీన్స్ (LML) చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు ఐకానిక్ వెస్పా మోడల్ స్కూటర్లను విడుదల చేసిన LML ఆటోమొబైల్ కంపెనీ, ఇప్పుడు ఘనంగా పునరాగమనం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఏకంగా గ్లోబల్ లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ అయినటువంటి హార్లే- హార్లే డేవిడ్‌సన్ (Harley Davidson) తో చేతులు కలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. గత సంవత్సరం LML బ్రాండ్‌ను కొనుగోలు చేసిన SG కార్పొరేట్ మొబిలిటీ, మరికొన్ని నెలల్లో LML బ్రాండ్ మీద మూడు ద్విచక్ర వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా LML ఇ-బైక్ (సైకిల్), LML హైపర్‌బైక్ అలాగే LML ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిలో మొదటి రెండు ఉత్పత్తులను భారత మార్కెట్లో విక్రయించనుండగా, LML ఎలక్ట్రిక్ స్కూటర్ (LML Electric Scooter) గ్లోబల్ మార్కెట్ కోసం విడుదల చేయనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
LML Vespa Nostalgia- ఆ రోజుల్లో చేతక్, వెస్పాలదే హవా!
1980- 90 లలో స్కూటర్ అంటే బజాజ్ చేతక్, అలాగే LML వెస్పాలు మాత్రమే ఉండేవి. మధ్య తరగతి ఇళ్లల్లో ఈ స్కూటర్ మోడళ్లు భాగంగా ఉండేవి. ఫ్యామిలీ మ్యాన్ అనగానే నీట్‌గా టక్ చేసుకొని బజాజ్ చేతక్ లేదా LML వెస్పా మీద వెళ్లే ఒక మధ్య తరగతి వ్యక్తి కళ్లల్లో మెదులుతారు. అంతగా ముద్రవేశాయి ఈ స్కూటర్లు.
ఇటలీకి చెందిన పియాజియో వెస్పాను భారత మార్కెట్లోకి LML కంపెనీ తీసుకువచ్చి సక్సెస్ సాధించింది. LML స్కూటర్‌లు 5.5-లీటర్ ఇంధన ట్యాంకును కలిగి ఉండేవి. 100 CC సామర్థ్యంతో బజాజ్ చేతక్ స్కూటర్లకు గట్టి పోటీని ఇచ్చేది. మారుతున్న కాలంతో పాటు ఈ రెండు ఐకానిక్ స్కూటర్లు కనుమరుగయ్యాయి. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ల రూపంలో మళ్లీ నేటి అభిరుచులకు తగినట్లుగా తిరిగి ఆరంగేట్రం చేస్తున్నాయి.
LML Electric Bike- Scooter Launch Details- లాంచ్ ఎప్పుడంటే..?
మొట్టమొదటగా LML Electric Bike (సైకిల్) ను 2023 ప్రథమార్దంలో విడుదల అవుతుంది. అదే సంవత్సరం, 2023 ద్వితియార్దంలో LML Electric Hyperbike అలాగే LML Electric Scooter విడుదల అవుతుందని కంపెనీ MD , CEO యోగేష్ భాటియా ధృవీకరించారు. అంటే మరికొన్ని నెలల్లోనే LML స్కూటర్లు పునరాగమనం చేయబోతున్నాయి. మరి ఇవి ఎలా ఉంటాయి, ఏ మేరకు రాణిస్తాయో ఎప్పటికప్పుడు అప్‌డేట్లను మీకు తెలియజేస్తూ ఉంటాం.
ప్రస్తుతం హార్లే- హార్లే డేవిడ్‌సన్‌కు చెందిన ఇండియా ప్లాంటులో LML బైక్ లురూపొందుతున్నాయి. త్వరలోనే LML ఎలక్ట్రిక్ తన సొంత తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి, వ్యాపారాన్ని విస్తరించటానికి రూ. 500 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు యోచిస్తోంది బ్రాండ్ ప్రమోటర్ భాటియా స్పష్టం చేశారు.
సంబంధిత కథనం