Classic Board Games | వేసవి సెలవుల్లో మీ చిన్నతనంలో ఆడిన ఆటలు గుర్తున్నాయా?
వేసవి సెలవుల్లో పిల్లలు బయట తిరగకుండా ఇంట్లోనే ఉండేలా వారితో ఆటలు ఆడండి, మీరూ మీ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకోండి. మీకు తెలిసిన ఆ ప్రసిద్ధ ఆటలను మరోసారి ఇక్కడ గుర్తుచేస్తున్నాం, చూడండి..
వేసవి కాలంలో మన దేశంలో తీవ్రమైన ఎండలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలు బయట తిరగకుండా స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. అయినా సరే పిల్లలు మాత్రం ఎర్రటి ఎండలో క్రికెట్ అంటూ గల్లీలలో ఆటలు ఆడుతారు, సైకిళ్లు, బైక్ లపై షికారులు చేస్తారు. ఎంత చెప్పినా, ఎవ్వరు చెప్పినా ఎండను ఏ మాత్రం లెక్కచేయకుండా కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతూనే ఉంటారు. అయితే పిల్లలని ఎండల్లో తిరగనివ్వకుండా ఇంట్లోనే ఆడుకునేలా ఎంతో చక్కని ఆటలు ఉన్నాయి. ఇలాంటి ఆటలు పేరేంట్స్ కూడా వారి చిన్నప్పుడు ఆడుకొనే ఉంటారు. ఇప్పుడు వారు కూడా తమ పిల్లలతో కలిసి ఆడుతూ వారి చిన్ననాటి మధుర జ్ఞాపకాలలో గడపవచ్చు.
ఇలాంటి ఆటలు ఆడటం వలన పిల్లలు ఇంట్లోనే ఉండగలుగుతారు, వారిలో క్రియేటివిటీ పెరుగుతుంది, నైపుణ్యాలు పెరుగుతాయి, వినోదం లభిస్తుంది. ఇంట్లోనూ ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.
ఇంట్లో ఉండి ఆడుకొనే కొన్ని ఆనాటి క్లాసిక్ ఆటలు:
చెస్
చెస్ ఎంతో మంచి ఆట, ఇంట్లో ఇద్దరు కలిసి ఆడవచ్చు. పేరేంట్స్ తమ పిల్లలకు చెస్ ఆడటం నేర్పించాలి. ఈ గేమ్ ఆడటం వలన వారిలో ఆలోచనాశక్తి పెరుగుతుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఏర్పడుతుంది.
క్యారమ్స్
ఇంట్లో నలుగురు కలిసి ఆడుకోవచ్చు. క్యారమ్స్ ఎన్నో రకాలుగా ఆడుకోవచ్చు. మ్యాచ్‌లు ఆడుకోవచ్చు, బిజినెస్ గేమ్ ఆడుకోవచ్చు. పోటీతత్వం పెరుగుతుంది.
స్క్రాబుల్
స్క్రాబుల్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ వర్డ్ గేమ్. ఇది స్వల్పకాలంలోనే డిజిటలైజ్డ్ గేమ్‌గా కూడా మార్చారు. ఇది ఆన్లైన్లోనూ పాపులర్ గేమ్ అయింది. ప్లేయర్‌లకు లెటర్ టైల్స్ ఉంటాయి. అర్థవంతమైన పదాలు కలపాలి. ఎవరైతే ఎక్కువ కలుపుతారో వారే విన్నర్. ఈ గేమ్ ద్వారా పిల్లలు కొత్తకొత్త పదాలు, వాటికి అర్థాలు తెలుసుకోగలుగుతారు.
మోనోపలి
మోనోపలి గేమ్ కూడా ఎంతో పాపులర్. పిల్లలే కాదు కార్పోరేట్ ఉద్యోగాలు చేసేవారూ ఈ ఆటను ఆడటానికి ఎంతో ఇష్టపడతారు. మోనోపలిని నలుగురైదుగురు కలిసి ఆడవచ్చు కానీ ఇందులో విజేత ఒక్కడే. మోనోపలి అంటే అర్థం కూడా అదే గుత్తాధిపత్యం. బ్యాంకింగ్, వ్యాపారాలు, కొనుగోళ్లు, అమ్మకాలు, అద్దెలు ఇలా ఎనో రకాల అంశాలతో ఈ ఆట చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
లూడో
చిన్నప్పడు ఈ ఆట ఆడనివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది కూడా ఫ్యామిలీ కలిసి ఆడుకునే లూడో ఒక ఆల్ టైమ్ ఫేవరేట్ ఆట. దీనిని మరో విధంగా అష్టా-చెమ్మా అని కూడా చెప్పవచ్చు. ఈ ఆటను నలుగురు కలిసి ఆడవచ్చు. నలుగురికి 4 కాయిన్స్ ఉంటాయి. ఎవరైతే ముందుగా తమ కాయిన్సును ఇంట్లోకి పంపిస్తారో వారే విజేత.
పచ్చీస్
ఇది చాలా ప్రాచీనమైన భారతీయ ఆట. పులిమేక ఆట కూడా అంటారు. నలుగురు ఆటగాళ్లతో ఇద్దరు జట్లుగా విడిపోయి ఆడవచ్చు. పాచికలు వేయడం మీద ఈ ఆట సాగుతుంది. సరైన సమయానికి ఎవరు పాచికలు బాగా వేయగలిగితే వారే విజేత.
ఇవేకాకుండా ఊనో, స్నేక్స్ అండ్ ల్యాడర్, దొంగాపోలీస్, అంత్యాక్షరి ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఇలాంటి ఆటలు పిల్లలకు ఆడించాలి, తల్లిదండ్రులూ ఆడాలి. ఇవే భవిష్యత్తులో మధుర జ్ఞాపకాలుగా ఉంటాయి. కాదంటారా? మరింకేం మీరు ఒక ఆట మొదలుపెట్టండి.
సంబంధిత కథనం
టాపిక్