Hot Coconut Oil For Hairs : కొబ్బరి నూనె వాడితే.. ఇక మీ జుట్టుకు సమస్యలు ఉండవు
Coconut Oil Home Remedies : కొబ్బరి నూనెతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు రాలడం సమస్యను ఈ కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు కొబ్బరి నూనెను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు.
జుట్టు రాలడం(Hair Fall) అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య. మొదట్లో కొన్ని వెంట్రుకలు రాలడం ప్రారంభిస్తాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తల మొత్తం ఖాళీ అయి బట్టతల వస్తుంది. మీరు జుట్టు రాలడం వల్ల బాధపడుతుంటే కొబ్బరి నూనె(Coconut Oil)ను సరిగ్గా అప్లై చేస్తే.. ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొబ్బరి నూనె జుట్టును బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచుతుంది. అలాగే, చుండ్రు సమస్యను నయం చేస్తుంది. కొబ్బరినూనెను ఇలా జుట్టుకు పట్టించడం వల్ల కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
వేడి కొబ్బరి నూనె మసాజ్ : ఒక పాన్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేయాలి. కొద్దిగా గోరువెచ్చని కొబ్బరి నూనెతో మీ తలకు మసాజ్ చేయండి. ఈ నూనెను మీ జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే జుట్టుకు పూర్తి పోషకాలు అందడంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుంది.
కొబ్బరి నూనె - కరివేపాకు : కొబ్బరి నూనె, కరివేపాకు మిశ్రమం జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇందుకోసం ఒక పాత్రలో కొబ్బరి నూనె తీసుకుని అందులో కొన్ని కరివేపాకులను వేయాలి. కరివేపాకు వేగిన తర్వాత స్టౌ మీద నుంచి నూనె దించాలి. ఈ నూనెను మీ జుట్టుకు రూట్ నుండి రుద్దండి. మీరు దానికి ఉసిరికాయను కూడా జోడించవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడే అనేక విటమిన్లు, ఖనిజాలను జుట్టును అందిస్తుంది.
కొబ్బరి నూనె - మెంతులు : అరకప్పు కొబ్బరి నూనెను తక్కువ మంటపై వేడి చేయండి. దానికి 2 చెంచాల మెంతులు కలపండి. వీటిని బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేడి చేయండి. నూనె వేడి అయ్యాక పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. తలస్నానానికి గంటన్నర ముందు ఈ నూనెను మీ జుట్టుకు రాయండి. ఈ నూనె జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. మెంతి గింజలు విటమిన్లు ఎ, సి, కె, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లకు మంచి మూలం. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కొబ్బరినూనెలో మెంతికూర కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.