Gym setup in 5000: ఐదు వేలు ఖర్చు పెట్టారంటే.. ఎప్పటికీ పనికొచ్చే జిమ్ ఇంట్లోనే రెడీ అవుతుంది-how to setup gym at home in just 5000 rupees know what is required ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gym Setup In 5000: ఐదు వేలు ఖర్చు పెట్టారంటే.. ఎప్పటికీ పనికొచ్చే జిమ్ ఇంట్లోనే రెడీ అవుతుంది

Gym setup in 5000: ఐదు వేలు ఖర్చు పెట్టారంటే.. ఎప్పటికీ పనికొచ్చే జిమ్ ఇంట్లోనే రెడీ అవుతుంది

Koutik Pranaya Sree HT Telugu
Sep 15, 2024 05:00 AM IST

Gym setup in 5000: ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలుసా? కేవలం 5000 రూపాయలకు అటూఇటూగా ఖర్చు పెట్టారంటే ఇంట్లోనే జిమ్ రెడీ అవుతుంది. దానికోసం ఏమేం కావాలో చూడండి.

ఇంట్లోనే జిమ్ తయారీ
ఇంట్లోనే జిమ్ తయారీ (freepik)

జిమ్‌కు వెళ్లాలంటే వేలకొద్దీ ఖర్చు పెట్టాల్సిందే. ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టాలనుకున్నా జిమ్‌కు వెళ్లే సమయం కొంత మందికి ఉండదు. కొంతమందికి జిమ్ సదుపాయమూ ఉండదు. అలాంటప్పుడు వీలైనంత తక్కువ ఖర్చులో ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు చేయాలనుకున్న వ్యాయామాలను బట్టి పరికరాలు ఎంచుకోవాలి. అదెలాగో చూసేయండి.

వెయిట్ లిఫ్టింగ్ కోసం:

మనింట్లో ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లలో ఇసుక నింపి వాటిని వెయిట్ లిఫ్టింగ్ కోసం వాడొచ్చు. మీ సామర్థ్యాన్ని బట్టి చిన్న, పెద్దా బాటిళ్లు ఎంచుకోవచ్చు. ఒకవేళ డంబుల్స్ అవసరం అనుకుంటే మంచి నాణ్యమైనవి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల్లో వచ్చేస్తాయి. మీ అవసరాన్ని బట్టి వాటిని కొనుక్కోండి.

రెసిస్టెన్స్ బ్యాండ్స్:

ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ 300 నుంచి 500 రూపాయల్లోనే వచ్చేస్తాయి. కానీ వీటితో చాలా రకాల వ్యాయామాలు కూడా చేయొచ్చు. కండరాల పెరుగుదలకు, బరువు తగ్గాలనుకునే వాళ్లకి, కాస్త పెద్ద వయసున్న వాళ్లు కూడా దీంతో మంచి వ్యాయామం చేయొచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో సింపుల్ వ్యాయామాలు కూడా దీంతో చేయొచ్చు. వీటిలో హ్యాండిళ్లు ఉన్నవి, కేవలం బ్యాండ్స్ లాంటి రకాలుంటాయి. మీ సౌకర్యాన్ని బట్టి ఎంచుకోవచ్చు. స్కిప్పింగ్ రోప్ ఉంటే దాన్ని కూడా జంపింగ్ కోసం వాడొచ్చు.

ఎక్సర్‌సైజ్ బాల్:

ఈ ఎక్సర్‌సైజ్ బాల్ కూడా కేవలం వెయ్యి రూపాయలలోపే వచ్చేస్తుంది. దీనిమీద కూర్చుని, కాళ్లమధ్య, చేతుల మధ్య పెట్టుకుని బోలెడు రకాల వ్యాయామాలు చేయొచ్చు. పుషప్స్, హ్యాండ్ఆఫ్, నీటక్స్, ఎక్సెటెన్షన్లు.. ఇలా చాలా రకాల వ్యాయామాలు కేవలం ఒక్క బాల్‌తో చేయొచ్చు. లేదా మామూలుగా ఇంట్లో పెద్ద బాల్ ఏదైనా ఉంటే దాంతో పుషప్స్ చేయొచ్చు.

యోగా మ్యాట్:

మంచి నాణ్యత ఉన్న యోగా మ్యాట్ వెయ్యి లేదా అంతకన్నా తక్కువ లోనే వస్తుంది. దీని ఉపయోగం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యోగాతో పాటు, చాలా రకాల వ్యాయామాలు చేయడానికి దీన్ని వాడొచ్చు. మీరు హోమ్ జిమ్ ఏర్పాటు చేసుకుంటే అందులో ఇది తప్పకుండా ఉండాల్సిందే.

దుపట్టా:

అవును.. మీ దగ్గర ఉండే కాటన్ దుపట్టాతో లెక్కలేనన్ని వ్యాయామాలు చేయొచ్చు. దుపట్టాను కిటికీ రాడ్‌కు గట్టిగా కట్టేసి రెండు కొనలను రెండు చేతులతో పట్టుకుని రకరకాల వ్యాయామాలు చేయొచ్చు. నడుముకు చుట్టుకుని, కాళ్లకు ఆసరాగా చేసుకుని బరువు తగ్గించే వ్యాయామాలు చేయొచ్చు.

మ్యూజిక్ సిస్టం:

మంచి సంగీతం వింటూ ఎంత పనైనా చేసేస్తాం. మీరు జిమ్ సెటప్ చేయలనుకున్న చోట కూడా ఒక మంచి బ్లూటూత్ స్పీకర్ లాంటిది ఏర్పాటు చేసుకోండి. సాధారణ వైర్‌లెస్ స్పీకర్ వెయ్యి రూపాయల్లో వచ్చేస్తుంది. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు దీంట్లో మ్యూజిక్ పెట్టుకుంటే మంచి అనుభూతి దొరుకుతుంది.

అలాగే మీరు జిమ్ ఏర్పాటు చేసుకునే చోట వెలుతురు, గాలి బాగుండేలా చూసుకోండి. మీ చుట్టూ మంచి ఆకర్షణీయమైన మొక్కలు, బ్యాక్‌గ్రౌండ్ లాంటివి పెట్టుకోండి. ఇంట్లో వాడకుండా ఉన్న పాత టీవీ ఏదైనా ఉంటే జిమ్ చేసే దగ్గర పెట్టుకోండి. అందులో ఏవైనా వీడియోలు చూస్తూ కూడా కసరత్తులు చేయొచ్చు. మొత్తం కలిపి అటూ ఇటూగా అయిదువేల రూపాయల్లో జిమ్ ఏర్పాటు అయిపోతుంది.