Curd Poha: పెరుగు అటుకులు ఇలా స్పైసీగా, తీయగా రెండు రుచుల్లో చేసేయండి
Curd poha: పెరుగుతో తియ్యటి పోహా, కారం పోహా తయారు చేసుకోవచ్చు. వీటికోసం తయారీ అక్కర్లేదు. రెండు నిమిషాల్లో కడుపు నిండా తినే స్నాక్స్ ఇవి. వాటి తయారీ చూసేయండి.
పెరుగుతో పోహా ఏంటి అనుకుంటున్నారా? చాలా ప్రాంతాల్లో పెరుగటుకులు లేదా పాలటుకులు తింటారు. మహారాష్ట్రలో, దాని సరిహద్దు ప్రాంతాల్లో ఈ అలవాటు కాస్త ఎక్కువగా ఉంటుంది. రుచి చాలా బాగుంటుంది. ఈ పెరుగటుకులు లేదా పెరుగు పోహాను తియ్యగా చేసుకోవచ్చు. తీపి నచ్చని వాళ్లు కాస్త కారంగానూ చేసుకోవచ్చు. ఈ రెండింటి తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.
తియ్యటి పెరుగు పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 చెంచా నెయ్యి
1 చెంచా జీడిపప్పు
1 చెంచా బాదాం
1 కప్పు చిక్కటి పెరుగు
రెండు చెంచాల పంచదార
పావు కప్పు దానిమ్మ గింజలు
1 కప్పు సన్నం అటుకులు
తియ్యటి పెరుగు పోహా తయారీ విధానం:
1. ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసుకోవాలి. వేడెక్కాక బాదాం, జీడిపప్పు కాస్త రంగు మారేదాకా వేయించుకోవాలి.
2. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో పెరుగు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజలు, పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి.
3. చల్లగా తినాలనుకుంటే ఈ పెరుగు మిశ్రమాన్ని ముందుగానే కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. లేదా అలాగే వాడుకోవాలి.
4. మీరు తినాలనుకున్నప్పుడు 5 నిమిషాల ముందు ఈ పెరుగు మిశ్రమంలో అటుకులు వేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది. స్వీట్ కర్డ్ పోహా రెడీ అయినట్లే.
కారం పెరుగు పోహా కోసం కావాల్సిన పదార్థాలు:
1 చెంచా నూనె
1 చెంచా మినప్పప్పు
1 టీస్పూన్ ఆవాలు
1 టీస్పూన్ జీలకర్ర
కరివేపాకు రెబ్బ
2 చెంచాల వేయించిన పల్లీలు
2 పచ్చిమిర్చి
1 కప్పు పెరుగు
సగం చెంచా ఉప్పు
1 చెంచా కొత్తిమీర
1 కప్పు సన్నం అటుకులు
కారం పెరుగు పోహా తయారీ విధానం:
1. ఒక కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని అన్నీ వేయించాలి.
2. పచ్చిమిర్చి, వేయించుకున్న పల్లీలు కూడా వేసి మరో నిమిషం వేయించుకోవాలి. స్టవ్ కట్టేయాలి.
3. ఒక బౌల్ లో పెరుగు, ఉప్పు, పైన తయారు చేసుకున్న తాళింపు మిశ్రమం కూడా చల్లారాక వేసుకుని కలుపుకోవాలి.
4. ఈ పెరుగు మిశ్రమం కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. లేదా అలాగే ఉంచేయొచ్చు.
5. తినేకన్నా రెండు నిమిషాల ముందు ఈ పెరుగు మిశ్రమంలో పోహా కలుపుకుని సర్వ్ చేసుకుంటే చాలు. కారం పెరుగు పోహా రెడీ అయినట్లే. సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకోవడం మర్చిపోకండి. పోహా మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకుని సర్వ్ చేసుకోండి.
- వీటి తయారీ కోసం సన్నం లేదా మందం అటుకులు వాడుకోవచ్చు. మందం అటుకులు వాడితే ముందుగానే నీళ్లలో కడుక్కుని రెండు నిమిషాల పాటూ నానబెట్టాక పెరుగు మిశ్రమంలో కలుపుకోవాలి. సన్నం అటుకులు కడగాల్సిన అవసరం లేదు.
- కారం పెరుగు పోహా మరింత ఆరోగ్యకరంగా మార్చేందుకు దాంట్లో కీరదోస తురుము, బీట్ రూట్ తురుము, క్యారట్ తురుము వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. రుచి కూడా పెరుగుతుంది.