Gobi vada: కరకరలాడే క్యాబేజీ మినప్పప్పు వడలు.. కమ్మగా, ఘాటుగా..
Gobi vada: గోబీ వడ రుచి ఒక్కసారి చూశారంటే మామూలు వడల జోలికి పోలేరు. వాటి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూసేయండి.
క్యాబేజీ లేదా గోబీని వడల తయారీకి వాడితే వాటి రుచి రెట్టింపవుతుంది. వడల్ని నూనెలో ఫ్రై చేసినప్పుడు క్యాబేజీ బాగా వేగిపోతుంది. దీంతో చాలా క్రంచీగా అవుతుంది. తింటున్నప్పుడు పంటికింది తగులుతూ వడల రుచి పెంచుతుంది. ఈ వడల్లో శనగపప్పును కూడా వాడతాం. మీకు నచ్చకపోతే కేవలం మామూలు వడల పిండితో కూడా వీటిని చేసేయొచ్చు. వడల పిండి మిగిలిపోతే దానికే కొన్ని మార్పులు చేసి, కొన్ని మసాలాలు జోడించి కూడా ఈ గోబీ వడలు చేసేయొచ్చు. దానికోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూసేయండి.
గోబీ వడల తయారీకి కావాల్సిన పదార్థాలు
సగం కప్పు శనగపప్పు
సగం కప్పు మినప్పప్పు
2 కప్పుల క్యాబేజీ తరుగు
2 పచ్చిమిర్చి, సన్నం ముక్కలు
అంగుళం అల్లం ముక్క, సన్నటి తరుగు
గుప్పెడు కొత్తిమీర తరుగు
1 రెమ్మ కరివేపాకు
సగం టీస్పూన్ జీలకర్ర
టీస్పూన్ మిరియాలు
చిటికెడు ఇంగువ
తగినంత ఉప్పు
డీప్ ఫ్రై కి సరిపడా నూనె
గోబీ వడల తయారీ విధానం:
- ముందుగా మినప్పప్పు, శనగపప్పును శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని వేరు వేరుగా రాత్రంతా నానబెట్టుకోవాలి. లేదంటే కనీసం 5 గంటలైనా నానాలి.
- ఈ పప్పుల్ని నీళ్లు వంపేసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మిరియాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోవాలి. వీలైనంత తక్కువ నీళ్లు పోసుకుని పిండి పట్టుకోవాలి. అవసరమైతే రెండు మూడు చెంచాల నీళ్లు పోసుకోండి చాలు. మిరియాల వల్ల వడల రుచి కాస్త ఘాటుదనం వచ్చి రుచి బాగుంటుంది.
- మిక్సీ పట్టిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అందులో సన్నగా తరిగిన క్యాబేజీ తరుగు, కొత్తిమీర, కరివేపాకు సన్నటి తరుగు, అల్లం ముద్ద, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
- అన్నీ బాగా కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పట్టుకోవాలి.
- నూనె వేడికాగానే అరచేతిలో పిండి తీసుకుని వడలు ఒత్తుకుని నూనె లో వేసుకోవాలి. మీడియం మంట మీద వడల్ని బాగా వేయించుకోవాలి.
- రంగు మారి కరకరలాడతాయి. అప్పుడు వాటిని ఒక పేపర్ టవెల్ మీద లేదా టిష్యూ మీదకి తీసుకోవాలి. ఇవి కాస్త నూనె పీల్చేస్తాయి. అంతే క్యాబేజీ వడలు రెడీ. వీటిని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సాంబార్‌తో కూడా కలిపి తినొచ్చు.
ఈ వడలకోసం క్యాబీజీని వీలైనంత సన్నగా తరుగు కోవాలి. ముక్కలు పెద్దగా ఉంటే ఉడకవు. దాంతో వడలు తినేటప్పుడు పచ్చి వాసన వస్తుంది.